భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) త్వరలోనే కొత్త 10 రూపాయల నోటును విడుదల చేయనుంది. కొత్త రంగుతో సరికొత్త చిత్రంతో డిజైన్ రూపొందింది. చాకొలెట్ బ్రౌన్ రంగుతో… ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం చిత్రంతో రూపొందిన ఈ నోటు డిజైన్ కు గత వారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహాత్మా గాంధీ సిరీస్ లో రిజర్వు బ్యాంకు ఇప్పటికే 100 కోట్ల కొత్త రూ. 10 నోట్లను ముద్రించినట్టు సమాచారం.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 10 నోటు డిజైన్ చివరిసారిగా 2005లో మారింది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఇంతకు ముందే రిజర్వు బ్యాంకు సరికొత్త రూ. 50, 200 నోట్లను ముద్రించింది. 2016 నవంబర్ 8న అప్పటికి చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత కొత్త డిజైన్ తో రూ. 500 నోటును విడుదల చేసిన రిజర్వు బ్యాంకు కొత్తగా రూ. 2000 నోటును ప్రవేశపెట్టింది.
దొంగ నోట్లను పట్టివేయడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యాలుగా పాత నోట్లను రద్దు చేసినట్టు ప్రభుత్వం పదే పదే చెప్పింది. ఇటీవల రూ. 200 నోటును విడుదల చేసిన తర్వాత రూ. 2000 నోటును కూడా క్రమంగా ఉపసంహరిస్తారనే ప్రచారం జరిగింది. రూ. 2000 నోటు ప్రింటింగ్ నిలిపివేశారన్న సమాచారం ఈ ప్రచారానికి కారణమైంది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా… ఆ పని క్రమంగా జరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఫొటో : పాత రూ. 10 నోటు.