చికాగోలో చంద్రబాబుకు ఐటీ బూస్ట్

విశాఖపట్నం, విజయవాడలలో 60 కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు..

సంస్థల ఏర్పాటుకు మొత్తం 450 మంది సిద్ధం!..
ఐటీ సిటీపై టాస్కుఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రెజెంటేషన్..

ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు దేశాల పర్యటన మంచి స్పందనతో ప్రారంభమైంది. చికాగోలో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తర్వాత జరిగిన ఐటీ సంస్థల సమావేశంలో అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన 80 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో అత్యధికులు తెలుగువారు. ప్రతిపాదిత ఐటీ సిటీపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ టాస్కుఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం మెగా ఐటీ సిటీగా, అమరావతి మేజర్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నట్టు చెప్పారు.

ఏపీలో సంస్థల ఏర్పాటుకు 450మంది ప్రవాస భారతీయులు ఆసక్తి చూపుతున్నారని, అందులో మొదటగా 60 సంస్థలు వచ్చే 12 నెలల కాలంలో ఐటీ సంబంధిత యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సంస్థలలో ఐటీ సర్వీసులు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, సాఫ్టువేర్ ప్రోడక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ సర్విసెస్, ఎమర్జెంగ్ టెక్నాలజీస్ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ 60 సంస్థల ఏర్పాటుకు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాలు అవసరమని ప్రతిపాదించారు. వాటి ద్వారా 8వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.

ఇదిలా ఉంటే తర్వాత 12 మాసాల్లో మొత్తం 500 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ప్రస్తుత పర్యటనలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో 100 అవగాహన ఒప్పందాలకు వివిధ సంస్థలు  సిద్ధంగా ఉన్నట్లు టాస్కుఫోర్స్ వెల్లడించింది. తొలిగా వచ్చే 60 సంస్థలకు వచ్చే 12 నెలలలో కార్యాలయ వసతిని సమకూర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవనం

భారత కాలమానం ప్రకారం చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత చికాగో చేరుకున్నారు. స్థానిక ప్రవాసాంధ్రులతో పాటు అమెరికా తెలుగు సంఘం ‘తానా’ కార్యవర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అమరావతిలో రెండు మిలియన్ డాలర్ల వ్యయంతో తానా భవనాన్ని నిర్మిస్తామని, అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించారు.

Related posts

Leave a Comment