77 మందితో తొలి జాబితా విడుదల
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక 77 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా పటేళ్ళకు పెద్ద పీఠ వేసింది. ప్రకటించిన 77 సీట్లలో ఏకంగా 20 పటేళ్ళకు కేటాయించింది. బిజెపి రెండు రోజుల క్రితం ప్రకటించిన తొలి జాబితాలో 70 సీట్లకుగాను 18 పటేళ్ళకు ఇచ్చింది. రిజర్వేషన్లు కోరుతూ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పటేల్ లీడర్లు… కాంగ్రెస్ ఎదుట కూడా డిమాండ్లు పెట్టారు. పటేళ్ల మద్ధతు పోతోందన్న భయంతో బిజెపి, సాధించాలన్న తపనతో కాంగ్రెస్ భారీగానే సీట్లు కట్టబెట్టాయి.
రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్ధతు, ప్రతిగా పటేల్ లీడర్ల మద్ధతుపై చర్చలు సాగుతున్న నేపథ్యంలో తొలి జాబితా ఆలస్యమైంది. డిసెంబర్ 9న జరగనున్న తొలి విడత పోలింగ్ కు సంబంధించి నామినేషన్ల దాఖలుకు మంగళవారం (నవంబర్ 21)తో గడువు ముగుస్తోంది. బిజెపి నిన్న, మొన్న రెండు విడతలుగా 106 మంది అభ్యర్ధులతో జాబితాలను ప్రటించింది. కాంగ్రెస్ జాబితా ఆలస్యంపై రాష్ట్ర పార్టీ నేతలు కొందరు కినుక వహించారు.
కాగా కాంగ్రెస్ జాబితాలో మొట్టమొదటి పేరు ఆ పార్టీ సీనియర్ నేత శక్తిసిన్హ్ గోహిల్ దే. ఆయన మండ్వి నుంచి పోటీ చేస్తుండగా… రాజ్ కోట్ పశ్చిమ స్థానంనుంచి ముఖ్యమంత్రి విజయ్ రూపానిపై ఇంద్రానిల్ రాజ్యగురు పోటీ చేయనున్నారు. పటేల్ నాయకులలో లలిత్ వసోయాకు ధోరాజి, అర్జున్ మోధ్వాదియాకు పోర్ బందర్ టికెట్లు కేటాయించారు. అదే సమయంలో మోర్బి అసెంబ్లీ స్థానం ఆశించిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత మనోజ్ పనారాకు నిరాశే ఎదురైంది. ఆ స్థానంనుంచి తమ పార్టీ నేత బ్రిజేష్ మేర్జానే కాంగ్రెస్ బరిలోకి దింపింది.
యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన తుషార్ చౌదరి మహువానుంచి పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా 89 సీట్లకు తొలి విడతగా డిసెంబర్ 9న పోలింగ్ జరగనుంది. మిగిలిన 93 సీట్లు డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఫలితాలను డిసెంబర్ 18న విడుదల చేస్తారు. కాంగ్రెస్ జాబితాను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్ఛార్జి ఆస్కార్ ఫెర్నాండెజ్ విడుదల చేశారు.