‘జెరూసలేం’ నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్త నిరసనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక) అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అమెరికా వైఖరిని తప్పు పట్టింది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల (అందులో ఐదు శాశ్వత సభ్య దేశాలు)లో అమెరికా ప్రతినిధి మినహా మిగిలిన అందరూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అమెరికా ఏకాకిగా మిగిలిపోయింది.
అమెరికా తాజా వైఖరి మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించిందని సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి గత తీర్మానాలకు భిన్నంగా అమెరికా జెరూసలేంపై నిర్ణయం తీసుకోవడాన్ని అన్ని దేశాలూ తప్పుపట్టాయి. తూర్పు జెరూసలేంను ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతంగా ఐక్యరాజ్యసమితి గతంలో ప్రకటించింది. అందువల్లనే ప్రపంచంలోని ఏ దేశమూ జెరూసలేంలో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అమెరికా ఒక్క దేశమే…తమ రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నగరంనుంచి జెరూసలేంకు మారుస్తామని ప్రకటించింది.
ఆక్రమిత జెరూసలేం ప్రాంతంతో సహా మొత్తం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించాలన్న అమెరికా ప్రయత్నాలకు గతంనుంచీ నిరసన వ్యక్తమవుతోంది. అందుకే ఇంతకు ముందు పని చేసిన అధ్యక్షులెవరూ ఆ సాహసం చేయలేదు. మొండి ట్రంప్ పర్యవసానాలను ప్రక్కన పెట్టి తీసుకున్న నిర్ణయం ముస్లిం దేశాల్లో తీవ్ర నిరసనలకు, ప్రపంచవ్యాప్త విమర్శలకు కారణమైంది. ట్రంప్ నిర్ణయం వెలువడగానే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుకె, స్వీడన్ సహా ఎనిమిది భద్రతా మండలి సభ్య దేశాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరాయి.
అమెరికా వీటో పవర్ ఉన్న శాశ్వత సభ్య దేశం కావడంవల్ల ‘జెరూసలేం’ చర్చపై ఓటింగ్ కోరలేదు. అయితే, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్రస్ సహా అమెరికాయేతర ప్రతినిధులంతా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ మాత్రం తమ అధ్యక్షుడు ప్రకటించిన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ మాట్లాడారు. ఇజ్రాయిల్ ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు జెరూసలేంలోనే నడుస్తున్నాయని, అందుకే వాస్తవిక దృక్పథంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారని హేలీ చెప్పారు.
బ్రిటన్ ప్రతినిధి మాథ్యూ రైక్రాఫ్ట్ మాట్లాడుతూ… జెరూసలేం రాజధాని అనడాన్ని, అమెరికా రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలించడాన్ని బ్రిటన్ అంగీకరించడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రక్రియకోసం ఐక్యరాజ్యసమితి సమన్వయకర్తగా పని చేస్తున్న నికొలాయ్ మ్లాదెనోవ్ అక్కడ తాజా పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బద్రతా మండలి సభ్యులకు వివరించారు. ట్రంప్ నిర్ణయం హింసకు దారి తీస్తోందని పేర్కొన్నారు. ఐక్య రాజ్యసమితిలో ఇటీవలి కాలంలో అమెరికాకు ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన అంశం మరొకటి లేదు.