‘నానో’ ఎలక్ట్రిక్ అవతారం ‘నియో’.. ఇక ‘టాటా’ ముద్ర ఉండదు

టాటా నానో… అత్యంత చౌకైన కారుగా ప్రారంభానికి ముందే ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. శిలాజ ఇంథనంతో నడిచిన పాత నానో… వినియోగదారులను మాత్రం ఆమేరకు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడది కొత్త అవతారమెత్తుతోంది. నానో ఎలక్ట్రిక్ కారు ‘జయెం నియో’గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సరికొత్త బ్రాండ్ ప్రారంభమవుతోంది. మొదటగా ఓలా కంపెనీకి  400 నియో కార్లు సరఫరా చేయనున్నారు.

‘జయెం నియో’ కార్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న హైదరాబాాద్ నగరంలో ప్రారంభించబోతున్నారు. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడంకోసం ఆరోజు ప్రధాని హైదరాబాద్ వస్తున్నారు. కోయంబత్తూరు కేంద్రంగా ఉన్న జయెం ఆటోమోటివ్స్ ఈ నానో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఇంజన్ మినహా మిగిలిన నానో బాడీ పార్టులన్నిటినీ టాటా మోటార్స్ సప్లై చేస్తోంది. టాటా మోటార్స్, జయెం ఆటోమోటివ్స్ మధ్య దీర్ఘ కాల సంబంధాలున్నాయి. ఇటీవల ఈ రెండు కంపెనీలూ ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఎంపిక చేసిన టాటా కారు మోడల్స్ తో స్పోర్ట్స్ వెర్షన్స్ తయారు చేయడానికే ఆ ఒప్పందం.

నియోలో ట్విస్ట్ ఏమిటంటే… నానోను సృష్టించిన ‘టాటా’ ముద్ర ఈ కారుపై ఉండదట. నియో పూర్తిగా జయెం బ్రాండ్ తోనే వస్తోంది. సైడ్స్ లో మాత్రం ‘పవర్డ్ బై ఎలక్ట్రా ఇవి’ అని ఉంటుంది. ’ఎలక్ట్రా ఇవి‘నే నియోలో వాడే పవర్ ట్రైన్స్ సరఫరా చేస్తోంది. నియో తర్వాత వచ్చే మరో పవర్ ఫుల్ మోడల్ మాత్రం టాటా బ్యాడ్జితో వస్తుందట.

Related posts

Leave a Comment