టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోలవరం యాత్ర

అసెంబ్లీ సమావేశాల మధ్యలో గురువారం అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలవరం సందర్శనా యాత్రను చేపట్టారు. జీవిత కాలంలో ఒక్కసారే చూడగలమని, అంతా పోలవరం నిర్మాణం జరుగుతున్నప్పుడు సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో సాధారణ ప్రజానీకానికి కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ దిశగా తన పార్టీ ప్రజా ప్రతినిధులకు పోలవరాన్ని చూపించారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోలవరం పనులను చూడటంకంటే ముందు ప్రజా ప్రతినిధులు పట్టిసీమ లిఫ్టును సందర్శించారు. నదుల అనుసంధానానికి నమూనాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వచిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఇప్పుడొక యాత్రా స్థలిగా మారింది. దాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగమే ప్రజాప్రతినిధుల సందర్శన. పోలవరం పూర్తయ్యేవరకు ఆగకుండా గోదావరి జలాలను వినియోగించుకునే ఉద్దేశంతో చేపట్టినదే పట్టిసీమ ప్రాజెక్టు. పోలవరం కుడి కాలువను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పట్టిసీమ లిఫ్టుద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసి కృష్ణా నదికి తరలిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన పనుల్లో పట్టిసీమ మొదటిదని చెప్పవచ్చు. దేశంలోనే మొదటిగా నదుల అనుసంధానం చేశామని పట్టిసీమనే ఉదాహరణగా చూపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లిఫ్టు పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటికే 100 టిఎంసిల నీరు కృష్ణకు తరలింది. సరిగ్గా ఆ మైలు రాయిని దాటే సమయానికి ప్రజా ప్రతినిధుల యాత్రను ప్లాన్ చేశారు. మొత్తం ఆరు బస్సుల్లో ప్రజాప్రతినిధులు విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి పట్టిసీమకు బయలుదేరారు. ఇటు పట్టిసీమ వద్ద, అటు పోలవరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా నేతలు స్వాగతం పలికారు. పట్టిసీమ వద్ద గోదావరి జలాలకు వందన సమర్పణ చేసిన ప్రజా ప్రతినిధులు పోలవరం పయనమయ్యారు.

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టునుంచి గ్రావిటీతో నీరు ఇచ్చేందుకు తగిన విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. పోలవరం వద్ద పనుల సందర్శన సందర్భంగా ఎమ్మెల్యేలతోనూ, అనంతరం విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా రూ. 12,550 కోట్లు ఖర్చయ్యాయని, అందులో రూ. 7,400 గత మూడు సంవత్సరాల్లో ఖర్చు చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకోసమే రూ. 32 వేల కోట్లు ఖర్చు  చేయవలసి ఉందన్న మంత్రి, వారికోసం ఏలూరి వంటి పట్టణాన్ని నిర్మించాలన్నారు.

పట్టిసీమ ద్వారా 100 టిఎంసిల నీటిని ఈ ఒక్క ఏడాదిలో తరలించడం ద్వారా రాయలసీమకు, కృష్ణా గుంటూరు జిల్లాలకు నీరివ్వగలిగామని మంత్రి లోకేష్ చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఏటా 3000 టిఎంసిల గోదావరి నీరు సముద్రంలోకి పోతోందని, పోలవరం ద్వారా ఆ నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సశ్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత ప్రజాప్రతినిధులంతా విశాఖపట్నం బయలుదేరి వెళ్ళారు. అక్కడ జరుగుతున్న అగ్రి టెక్ సదస్సులో వీరు పాల్గొంటున్నారు.

Related posts

Leave a Comment