ఇక హెచ్1బి కొనసాగింపు ఇవ్వరు
గ్రీన్ కార్డ్ కోసం వేచి చూడటం కుదరదు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 20వ తేదీకి సరిగ్గా ఏడాది. ఈ కాలంలో 17 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించినట్టు శ్వేతసౌధం ఘనంగా ప్రకటించింది. అదే ఉత్సాహంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సుమారు 10 లక్షల మంది విదేశీయులను ‘స్వచ్ఛంద బహిష్కరణ’ చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ట్రంప్ ఎఫెక్ట్’ బాధితుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటారని అంచనా. ప్రధానంగా ఐటీ రంగంలోనే ఉపాధి పొందుతున్న వారిలో ఆంధ్రుల సంఖ్య గణనీయం.
హెచ్1బి వీసాకు నిర్దేశించిన గడువును పొడిగించడానికి వీల్లేకుండా అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ కొత్త నియంత్రణలను అమల్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. గ్రీన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకొని హెచ్1బి వీసా గడువును పొడిగించుకుంటూ వస్తున్న సుమారు 10 లక్షల మంది విదేశీయులు సరికొత్త నియంత్రణలతో కష్టాల్లో పడనున్నారు. అందులో సుమారు ఐదు లక్షల మంది భారతీయులు అమెరికాను వదిలి రావలసి ఉంటుందని అంచనా. అంతమంది ఉద్యోగులు అంటే.. అన్ని కుటుంబాలు.
ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మొత్తం సుమారు 12 నుంచి 15 లక్షల వరకు ట్రంప్ ఎఫెక్ట్ తో ప్రభావితమవుతారని ఓ అంచనా. ఈ ప్రభావానికి గురయ్యే భారతీయ ఉద్యోగుల సంఖ్య 7.5 లక్షలు ఉంటుందని ఒక ఇమిగ్రెంట్ సంస్థ ముఖ్యాధికారి చెప్పారు. వారి భార్యా పిల్లలు మరో ఎనిమిది లక్షల మంది వరకు ఉంటారని అతని అంచనా. అంచనాల్లో కొద్దిపాటి తేడాలున్నా ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు లక్షల సంఖ్యలో స్వదేశమార్గం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
‘అమెరికా వస్తువులే కొనండి. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి’ అనే ట్రంప్ నినాదం, విధానం ఇప్పుడు ఆచరణ రూపుదాలుస్తున్నాయి. హెచ్1బి వీసా గడువు కొనసాగింపునకు కత్తెర వేసేలా రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై హోంల్యాండ్ విభాగం శాఖాధిపతుల మధ్య చర్చలు సాగుతున్నట్టు అమెరికన్ మీడియా వెల్లడించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘అమెరికన్ కాంపిటీటివ్ నెస్ ఇన్ ద 21 సెంచరీ యాక్ట్ (ఎసి21)’ హెచ్1బి వీసాలను సరళతరం చేయగా.. ఆ చట్టంలో వాడిన భాషను పునర్నిర్వచించాలని ఇప్పుడు అమెరికా అధికారులు భావిస్తున్నారు.
ఏమటీ హెచ్1బి?
వలస జనాభాకు కాకుండా అమెరికా కంపెనీలు నియమించుకునే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వీసా హెచ్1బి. మూడు నుంచి ఆరేళ్ళపాటు పని చేయడానికి వీలుగా ఈ వీసా జారీ చేస్తారు. అయితే, అమెరికాలో స్థిరపడాలనే కోరిక ఉన్నవారు గ్రీన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకోవడం సహజం. ఒకసారి గ్రీన్ కార్డు ప్రక్రియ ప్రారంభమైతే హెచ్1బి వీసా గడువు విషయంలో భయం లేకుండా ఉద్యోగం చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు వ్యవహారం పెండింగ్ లో ఉన్నంత కాలం వీసాను పొడిగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సరిగ్గా ఈ వెసులుబాటునే ట్రంప్ ప్రభుత్వం కత్తిరిస్తోంది.
ఒక దెబ్బకు రెండు ప్రయోజనాలు!
తాజా నియంత్రణల ద్వారా ట్రంప్ ప్రేమికులకు రెండు ప్రయోజనాలున్నాయి. ఇటు హెచ్1బి వీసాలపై దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెళ్లగొట్టడం ఒక ప్రయోజనమైతే… విదేశీయులు శాశ్వత లేదా సుదీర్ఘకాల నివాసానికి (గ్రీన్ కార్డు) అవకాశాలనూ నిరోధించడం మరో ప్రయోజనం. హెచ్1బి వీసాలకు, గ్రీన్ కార్డులకు గతంలో లేని పరిమితులను ఇప్పుడు విధిస్తున్నారు. మొత్తం వీసాలు, గ్రీన్ కార్డులలో ఒక్కో దేశానికి ఏడు శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదనే మార్గదర్శకాలు ప్రధానంగా భారతీయులను నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నమే. ఇప్పటివరకు భారతీయులు మొత్తం వీసాలలో 70 శాతంవరకు పొందే అవకాశం ఉండేది.
2016లో అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో జారీ చేసిన హెచ్1బి వీసాలు 1.62 లక్షల వరకు ఉంటే అందులో ఇండియన్లకే 1,26,692 దక్కాయి. ఇండియన్ల తర్వాత స్థానంలో ఉన్న చైనీయులకు కేవలం 21,657 వీసాలు జారీ అయ్యాయి. హెచ్1బి ద్వారా అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారిలో భారతీయుల వాటా ఏమిటో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సంఖ్యలను బట్టి చూస్తే ట్రంప్ ఎఫెక్ట్ తో అమెరికాను వదలిపోనున్న విదేశీయుల్లో 70 శాతానికి పైగా ఇండియన్లే ఉంటారని అర్ధమవుతోంది. ‘ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్’ చట్టం ద్వారా హెచ్1బి వీసా మార్గదర్శకాలను కఠినతరం చేసే ప్రయత్నాలు ఓవైపు… వీసాలను పొడిగించుకునే అవకాశం లేకుండా దేశంనుంచి పంపించే ప్రయత్నాలు మరోవైపు చురుగ్గా సాగుతున్నాయి.