ముస్లిం సమాజంలో విడాకులు ఇవ్వడానికి అనుసరించే ట్రిపుల్ తలాఖ్ పద్ధతికి వ్యతిరేకంగా లోక్ సభ ఆమోదించిన బిల్లుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్ధతు పలికారు. అయితే, బిల్లులో ప్రతిపాదించిన క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు వ్యతిరేకత తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ పేరిట కేసులు పెట్టి వేధిస్తే సమస్యలు వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు.
ట్రిపుల్ తలాఖ్ విధానం రద్దయినప్పుడు ఇక అంతా విడాకులను కోర్టు కేసుల ద్వారా తీసుకుంటారని, ట్రిపుల్ తలాఖ్ నుంచి సాధారణ పద్ధతికి వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ట్రిపుల్ తలాఖ్ పేరిట విచారణలు, కేసులతో వేధింపులు ఎదురైతే వ్యతిరేకత వస్తుందని, కొత్త సమస్యలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతిని ముస్లింలలోనే 68 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడైందని సిఎెం గుర్తు చేశారు.