ఠాగూర్ పేరూ చేదైందా?!!

1 0
Read Time:6 Minute, 26 Second
మొదట ముస్లిం రాజుల పేర్లు మార్చాలన్నారు..
ఇప్పుడు జాతీయ గీతం రచయితదాకా వచ్చారు..
పట్నాలో గురు రబీంద్ర చౌక్ పేరు మార్పునకు ప్రతిపాదన..
వ్యతిరేకతతో వెనక్కు తగ్గిన మున్సిపల్ కార్పొరేషన్

రాముడి పేరిట రాజకీయాలను దేశం కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉంది. నాలుగేళ్లుగా గోవుల పేరిట గూండాగిరీ చూశాం. తాజాగా… పట్టణాలు, ప్రఖ్యాత ప్రదేశాల పేర్లను మార్చే రాజకీయం నడుస్తోంది. ప్రధానంగా ముస్లిం పేర్లతో ఉన్న పట్టణాలు, ప్రదేశాల చుట్టూ చర్చ సాగుతోంది. కొన్ని పేర్లు మారాయి… మరికొన్నిటిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు వస్తున్నాయి. అయితే, అది అక్కడితో ఆగలేదు. విశ్వ విఖ్యాత కవి, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుకూ ఎసరు వచ్చింది.

బీహార్ రాజధాని పట్నాలో ప్రధాన కూడలి అయిన ‘‘కవి గురు రబీంద్ర చౌక్ (అంతకు ముందు డాక్ బంగ్లా చౌక్)’’ పేరును మార్చి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి పేరును తగిలించాలని బీజేపీకి చెందిన నగర్ మేయర్ ప్రతిపాదించినట్టు వార్తలు వచ్చాయి. మేయర్ సీతా సాహు ప్రతిపాదనపై పట్నా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ గురువారంనాడు చర్చించనున్నట్టు సమాచారం. బీహార్ లో ఇప్పుడిదో వివాదాస్పద అంశమైంది.

రబీంద్రనాథ్ ఠాగూర్ వలస పాలన ప్రతినిధి కాదు. మొఘలాయి చక్రవర్తుల వారసుడూ కాదు. మరి ఆయన పేరును కూడా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. భారత చరిత్రలో పేరెన్నికగన్న కవులు, రచయితలలో రబీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినవాడు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన అరుదైన భారతీయుడు.

భారత జాతీయ గీతం ‘‘జన గణ మన’’ ఠాగూర్ రచించిన ఆణి ముత్యాల్లో ఒకటి. ఆ జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలో సైతం ఆలపించడం తప్పనిసరి అని హూంకరించింది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన చేయడంలేదని కొంతమందిపై దాడులు కూడా జరిగాయి. అలాంటి కరుడుగట్టిన ‘‘జాతీయ గీత భక్తులు’’ ఇప్పుడు ఠాకూర్ పేరును ఎందుకు వద్దంటున్నారు.

పట్నాలో ఆ కూడలికి 2002లో రాష్ట్రీయ జనతాదళ్ ప్రభుత్వ హయాంలో ఠాగూర్ పేరు పెట్టారు. అప్పట్లో లాలూప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1936లో ఠాగూర్ పట్నా నగరాన్ని సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాన కూడలికి ‘‘కవి గురు రబీంద్ర చౌక్’’ అని నామకరణం చేశారు. ఠాగూర్ ఆ ఏడాది మార్చి 16, 17 తేదీల్లో తన సంగీత బృందంతో సహా పట్నాను సందర్శించారు. ఆ సందర్భంగా ఠాగూర్ రచించిన ‘‘చిత్రాంగద’’ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.

గురు రబీంద్ర చౌక్ పేరు మార్పు ప్రయత్నాన్ని బీహార్ లోని బెంగాలీ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి బెంగాలీలు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలవనున్నట్టు తెలిసింది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నేతలు కూడా ఈ పేరు మార్పు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. డాక్ బంగ్లా చౌక్ పేరును మార్చేందుకు ప్రయత్నిస్తే నిరసన తప్పదని ఆర్.జె.డి ఎమ్మెల్యే శక్తి యాదవ్ హెచ్చరించారు.

సీఎం సొంత పట్టణం పేరూ మార్చాలని డిమాండ్

బీహార్ రాష్ట్రంలో ఇంతకు ముందే భక్తియార్ పూర్ పట్టణం పేరును మార్చాలన్న డిమాండ్ బీజేపీనుంచి వినవచ్చింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్వయంగా ఈ డిమాండ్ ను ముందుకు తెచ్చారు. భక్తియార్ పూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత పట్టణం. పట్నా జిల్లాలోని ఈ పట్టణానికి… కుత్భుద్దీన్ ఐబక్ ఆర్మీ జనరల్ అయిన భక్తియార్ ఖిల్జీ పేరును పెట్టినట్టుగా భావిస్తున్నారు. అయితే, ఈ పేరు మార్పు డిమాండ్ ను బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ (యు) నేతలే వ్యతిరేకించారు.

పేరు మార్చడంలేదు : కార్పొరేషన్ వివరణ

‘‘కవి గురు రబీంద్ర చౌక్’’ పేరును మార్చి వాజ్ పాయి పేరు పెట్టే అవకాశం లేదని పట్నా మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) కమిషనర్ అనుపమ్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. పేరు మార్పు ప్రతిపాదన, గురువారం స్టాండింగ్ కమిటీ చర్చించనుందనే సమాచారం వివాదాస్పదమైన నేపథ్యంలో… మేయర్ సీతా సాహుతో కమిషనర్ మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులకు వివరణ ఇచ్చారు. ఠాగూర్ చౌక్ లో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పారు.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %