499 రోజుల వ్యవధిలో ఆరు డబుల్ సెంచరీలు బాదిన కోహ్లీ
2016లో మూడు, 2017లో మూడు డబుల్ సెంచరీలు
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ క్లబ్ లోకి…
ఓవైపు ఢిల్లీ వాయు కాలుష్యం ధాటికి శ్రీలంక ఆటగాళ్లు అల్లాడుతుంటే.. ముక్కుకు గుడ్డ కూడా కట్టుకోకుండా విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. తన హోం ఫీల్డ్ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో ఆదివారం కోహ్లీ తన అత్యధిక వ్యక్తిగత స్కోరు (243) నమోదు చేశాడు. కోహ్లీకి ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ. దీంతో… టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ల జాబితాలో తన సీనియర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు. వీటికి మించిన విశేషమేమంటే… అతి తక్కువ సమయంలో ఆరు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ కోహ్లీ.
క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లెవరంటే మొదట చెప్పే పేరు డాన్ బ్రాడ్ మన్. ఇప్పుడు కోహ్లీ సాధించిన ఆరు డబుల్ సెంచరీలకు, ఆయనకు సంబంధం ఉంది. అతి తక్కువ సమయంలో ఆరు డబుల్స్ సాధించిన క్రికెటర్ గా డాన్ బ్రాడ్ మన్ విశిష్ఠత ఇప్పటిదాకా పదిలంగా ఉంది. తాజాగా కోహ్లీ ఆరో డబుల్ సెంచరీతో అది బద్ధలైంది. బ్రాడ్ మన్ తన కెరీర్లో ఒకానొక సమయంలో 581 రోజుల వ్యవధిలో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత కోహ్లీ అంతకంటే తక్కువ సమయంలో (499 రోజుల్లో) ఆరు డబుల్స్ సాధించాడు.
2016 జూలైలో కోహ్లీ దూకుడు మొదలైంది. అప్పుడు వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్టులో 200 పరుగులు చేసిన కోహ్లీ, అదే ఏడాది అక్టోబర్ మాసంలో న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ మూడో మ్యాచులో 211 పరుగులు చేశాడు. మళ్లీ డిసెంబర్ మాసంలో ముంబైలో ఇంగ్లండ్ జట్టుపై 235 పరుగులు నమోదు చేశాడు. 2017 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ జట్టుతో హైదరాబాద్ నగరంలో జరిగిన మ్యాచులో 204 పరుగులు సాధించిన కోహ్లీ, ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీ ఆరు డబుల్ సెంచరీలూ కెప్టెన్ అయ్యాక నమోదైనవే కావడం గమనార్హం.
వరుస మ్యాచ్ లలో డబుల్స్..
ఇలా వరుసగా రెండు మ్యాచులలో డబుల్ సెంచరీలు చేసిన విషయంలోనూ ‘డాన్’తో కోహ్లీకి పోలిక ఉంది. బ్రాడ్ మన్ 1934లో ఇలా వరుస డబుల్ సెంచరీలతో అదరగొట్టారు. డాన్ కంటే ముందు వాలీ హమ్మండ్ కూడా వరుస మ్యాచులలో డబుల్ సెంచరీలు చేశారు. అయితే, ఆయన ఆడిన రెండు మ్యాచుల మధ్య చాలా గ్యాప్ ఉంది. 1928-29 సీజన్లో ఒకటి, 1933లో మరొకటి నమోదు చేశారు. బ్రాడ్ మన్ తర్వాత మళ్లీ 60 ఏళ్ళకు (1993లో) వినోద్ కాంబ్లీ ఈ ఘనతను సాధించారు. ఆ తర్వాత 14 సంవత్సరాలకు 2007లో కుమార సంగక్కర, ఐదేళ్ళ గ్యాప్ తర్వాత 2012లో మైఖేల్ క్లార్క్ వరుస డబుల్స్ నమోదు చేశారు.
సరిగ్గా ఐదేళ్ల గ్యాప్ తర్వాత కోహ్లీ 2017లో శ్రీలంకపై ఈ ఫీటు సాధించాడు. గత నెలలో నాగపూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ, తాాజాగా ఢిల్లీలోనూ డబుల్స్ నమోదు చేశాడు. ఆరు డబుల్స్ నమోదు చేసినవారి క్లబ్ లో చేరినా… కోహ్లీ అత్యధిక డబుల్స్ సాధించాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆ విషయంలో ఈ ఇండియన్ క్రికెట్ ‘కింగ్’ అంతర్జాతీయ క్రికెట్ ‘డాన్’ బ్రాడ్ మన్ ను చేరడానికి తన డబుల్ సెంచరీల సంఖ్యను డబుల్ చేయవలసి ఉంది.