తలాఖ్ పద్ధతికి తలాఖ్

1 0
Read Time:5 Minute, 44 Second
బిల్లుకు లోక్ సభ ఆమోదం

ముస్లిం సమాజంలోని దురాచారమైన తలాఖ్ పద్ధతిని నేరంగా పరిగణించే బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం లోక్ సభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ వాడి వేడి చర్చ అనంతరం… రాత్రికి మూజువాణి ఓటుతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. కాంగ్రెస్ సహా పలు విపక్షాలు సూచించిన సవరణలను అధికార పక్షం కొట్టిపారేసింది. తలాఖ్ పద్ధతిని వ్యతిరేకించే పార్టీలు సైతం అధికారపక్షం ప్రవేశపెట్టిన బిల్లులోని కొన్ని భాగాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక ఎంఐఎం వంటి పార్టీలైతే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.

‘ట్రిపుల్ తలాఖ్’ నిరోధానికి ప్రతిపాదించిన ఈ బిల్లు ప్రకారం… తలాఖ్ చెప్పి విడిపోయే భర్తలకు మూడేళ్ళవరకు జైలు శిక్ష విధించవచ్చు. తలాఖ్ పద్ధతిలో తక్షణ విడాకులు ఇచ్చే ముస్లిం పురుషులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయవచ్చు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. కాగా, ఈ బిల్లులోని పలు అంశాలు ముస్లిం పురుషులను ప్రభుత్వం వేధించేందుకు అనుగుణంగా ఉన్నాయని కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్ధతు ప్రకటిస్తూనే సవరణలు సూచించింది. అయితే, వాటిని ప్రభుత్వం తోసిపుచ్చింది. బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలని కాంగ్రెస్ సూచించినా అధికారపక్షం వినిపించుకోలేదు.

కాంగ్రెస్ పార్టీ స్థూలంగా తలాఖ్ బిల్లుకు మద్ధతు తెలిపినా..ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ మాత్రం ఈ బిల్లుపై అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోందని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎంపీ, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తలాఖ్ బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు ఈ బిల్లు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన అసదుద్దీన్… ఇలాంటి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదని అభిప్రాయపడ్డారు.

ప్రధానిపై ఒవైసీ సెటైర్

గుజరాత్ రాష్ట్రంలో మన బాబీ (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్యను ఉద్దేశించి) సహా దేశంలో వివిధ మతాలకు చెందిన సుమారు 20 లక్షల మంది మహిళలు భర్తలకు దూరంగా ఉంటున్నారని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. భర్తలు వదిలేసిన భార్యలకూ న్యాయం చేయాలని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆలిండియా ముస్లిం లీగ్ సభ్యులతోపాటు ఆర్జేడీ సభ్యులు కూడా తాజా బిల్లును వ్యతిరేకించారు. బీజేడీ, బీజేపీ గూటిలోనే ఉన్న అన్నాడిఎంకె సైతం ఈ బిల్లును వ్యతిరేకించాయి.

ఇక రాజ్యసభ వంతు…

లోక్ సభ మూజువాణి ఆమోదం పొందిన తలాఖ్ బిల్లును ఇక రాజ్యసభలో ప్రవేశపెట్టవలసి ఉంది. లోక్ సభలో సొంతగా బీజేపీకి మెజారిటీ ఉంది. అయితే, రాజ్యసభలో ఆ పార్టీకి ఇంకా మెజారిటీ రాలేదు. దీంతో… కాంగ్రెస్ పార్టీ మద్ధతు కీలకం కానుంది. లోక్ సభలో ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపినా… కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ముస్లిం పురుషులపై వేధింపులు, మహిళల ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రతిపాదించిన సవరణలను బీజేపీ తోసిపుచ్చింది.

రాజ్యసభలో ఈ సవరణలకోసం వివిధ పార్టీలు పట్టుపట్టే అవకాశం లేకపోలేదు. కాగా, రాజ్యసభలో ఏకాభిప్రాయంతో తలాఖ్ బిల్లుకు ఆమోదం తెలిపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సభ వాయిదా పడిన తర్వాత జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం వేదికనుంచి విన్నవించారు. రాజ్యసభ ఆమోదంతో తలాఖ్ ను నేరంగా పరిగణించే ఈ బిల్లు చట్టమవుతుంది. ఈ చట్టం జమ్మూ కశ్మీర్ మినహా మిగిలిన దేశమంతటికీ వర్తిస్తుంది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply