తెలంగాణ గడ్డపైన పొడుస్తున్న ‘పవర్’ పొత్తు!

1 0
Read Time:6 Minute, 1 Second

‘ప్రజలకు కల్పించిన ఆశలను నెరవేర్చుకుంటూ పోతున్న వారికి కాక ఇంకెవరికి మద్ధతు ఇవ్వాలి?’…సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలసిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇది. తాను కేసీఆర్ ను కలవడంలో… పొత్తు, మద్ధతు ఆలోచనలు లేవని పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు విలేకరులకు చెప్పారు. అయితే, తరచి తరచి అడిగినప్పుడు పై మాట బయటకు వచ్చింది. అసలు మతలబు అందులోనే ఉంది.

తెలంగాణలో రైతులకు 24 గంటలపాటు విద్యుత్ (ఉచితం) అందించే నిర్ణయాన్ని నూతన సంవత్సరం ప్రారంభం రోజునుంచీ అమలు చేస్తున్న నేపథ్యంలో.. అభినందించడానికి తాను కేసీఆర్ ను కలసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంథకారమవుతుందనే ఆందోళననుంచి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసే దశకు పరిస్థితి ఎలా మెరుగుపడిందో తెలుసుకోవలసిన అంశమని పవన్ పేర్కొన్నారు. 24 గంటలు సరఫరాపై గతంలో జానారెడ్డి సందేహం వ్యక్తం చేసిన సందర్భాన్ని పవన్ గుర్తు చేశారు.

24గంటల విద్యుత్ సరఫరా వాస్తవ రూపం ఎలా దాల్చింది? దీని వెనుక ఉన్న పాలనా సామర్ధ్యాన్ని అభినందించవలసిందే.. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇది ఒక కేస్ స్టడీ’’

రాజ్ భవన్ లో మాటలు కలిశాయి

ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చిన సందర్భంగా కేసీఆర్, తాను మాట్లాడుకున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఒకసారి కలవాలని అప్పుడు అనుకున్నామని, సరైన సందర్భంలో కలుద్దామని కేసీఆర్ చెప్పారని పవన్ వెల్లడించారు. ఆ నేపథ్యంలోనే… 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైన రోజున అభినందించడానికి తాను వచ్చానని పవన్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కలవలేదని, తెలుగు మహాసభల సందర్భంగా తనను ఆహ్వానించినా సమయం కుదరలేదని పవన్ చెప్పారు.

పొత్తులేం లేవు…సంబంధాల కోసమే

కేసీఆర్ తో జరిపిన చర్చలు, టీఆరెస్-జనసేన పొత్తు అవకాశాలపై విలేకరులు ప్రశ్నించినప్పుడు… తమ చర్చల్లో అవేమీ లేవని పవన్ బదులిచ్చారు. ‘నేను ప్రతి ఒక్కరినీ కలుస్తాను. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు… అన్ని పార్టీల పెద్దలనూ కలుస్తాను. కుమార స్వామిని కూడా కలిశాను. అవగాహన పెంచుకుంటాను. సమస్యలను విన్నవించడానికి వారితో పరిచయం పెంచుకుంటాను. ఇక్కడ గుడ్ విల్… ప్రధానాంశం’ అని పవన్ పేర్కొన్నారు.

తెలంగాణలో నా బలం నాది

వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ కు మద్ధతు ఇచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ఆ స్థాయిలో ఆలోచన చేయలేదని, అది ఊహాజనితమని పవన్ బదులిచ్చారు. ‘తెలంగాణలో నాకుండే అభిమానులు నాకున్నారు. నాకు ఉండే బలం నాకు ఉంది’ అని పవన్ వ్యాఖ్యానించారు. తాను గతంలో కూడా టీఆరెస్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడానని పవన్ గుర్తు చేశారు. జనసేన ఆవిర్భావ సభలోనూ టీఆరెస్ ఉద్యమంపై తనకు గౌరవం ఉన్నట్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

విభజన గతం…సుహృద్భావం నేటి అవసరం

‘రాష్ట్రాలు విడిపోయాయి. అప్పటి పరిస్థితులు వేరు.. ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరు. ఒకటి రెండు విభేదించే అంశాలున్నాయి గానీ, వాటిపై మాట్లాడుకోవడానికి కూడా సుహృద్భావ వాతావరణం అవసరం’ అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా హక్కుల సాధనకు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని తీసుకోవాలని చెబుతుంటానని పేర్కొన్నారు.

రాజకీయ సంబంధాలు చాలా వేగంగా మారే రోజులివి. రాష్ట్ర విభజనకు ముందోసారి.. తెలంగాణలో వేర్వేరు సభల్లో పవన్ కళ్యాణ్ ‘కేసీఆర్ నీ తాట తీస్తా’ అంటే… ‘పవన్ కళ్యాణ్..నేను చిటికేస్తే నువ్వు వెయ్యి ముక్కలవుతావు’ అంటూ కేసీఆర్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అప్పటి పరిస్థితులు వేరు. టీఆరెస్ నేతలపైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అందుకు ప్రతిగా ఆ పార్టీ నేతలు చేసిన వాడిన పదజాలం అంతా గతం. విభజిత తెలంగాణ గడ్డపైన ఐదేళ్ల పాలన తర్వాత టీఆరెస్ 2019లో ఎదుర్కోనున్న ఎన్నికలు ఇప్పుడు చాలా కీలకం. గతాన్ని మరచి ‘సుహృద్భావం’ పెంచుకోవడం నేటి అవసరం. నూతన సంవత్సరానికి (2018కి) స్వాగతం పలికే వేళ ‘24 గంటల పవర్’ పవర్ స్టార్, కేసీఆర్ మధ్య సుహృద్భావాన్ని పెంచింది. సరికొత్త పొత్తు పొడుపుకు నాంది పలికింది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply