విజయవాడ దుర్గగుడి వివాదంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్య కుమారి వైఫల్యం ఉందని నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈవో పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆమెను వెంటనే బదిలీ చేయాలని శనివారం దేవాదాయ శాఖను ఆదేశించారు.
ఆలయ నియమాలకు విరుద్ధంగా సంబంధంలేని వ్యక్తులు ప్రవేశించారని విచారణ కమిటీ నిర్ధారించిందని పేర్కొన్న ప్రభుత్వం, ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు అంతరాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో ఈవో సూర్యకుమారి విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది ఈ కారణంగానే ఈవోను బదిలీ చేశారు.
కనక దుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారని వార్తలు రావడం కలకలం రేపింది. ఈ వార్తలను ఆసరాగా చేసుకొని.. ‘నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతోనే క్షుద్ర పూజలు చేయించార’ని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఈవో నుంచి దేవాదాయ శాఖ మంత్రి వరకు అందరూ ఖండించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదంతంపై దృష్టి సారించి… దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నేతృత్వంలో విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ మధ్యంతర నివేదికను తాజాగా శనివారం సమర్పించింది. ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి మాణిక్యాలరావు తాము విచారించిన అంశాలను ఏకరువు పెట్టారు.
సంబంధం లేని వ్యక్తులు అంతరాలయంలోకి ప్రవేశించడంపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యంపై దుర్గగుడి ఈవో సూర్యకుమారిని తక్షణం బదిలీ చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈవోను బదిలీ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధనే కనక దుర్గ ఆలయ ఇన్ఛార్జిగా నియమించారు.
సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.