దక్షిణ భారతంలో దేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ అంశంపై లోక్ సభకు సమర్పించిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ అహిర్ సమాధానమిచ్చారు. ‘దక్షిణ భారత దేశంలో రెండో రాజధానిని (హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో) ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా?’ అని నర్సయ్య గౌడ్ రాతపూర్వకంగా ప్రశ్నను సమర్పించారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి లేదని బదులిచ్చారు.
గత వారం తమిళనాడుకు చెందిన ఎఐఎడిఎంకె ఎంపీ ఒకరు పార్లమెంటు సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో టీఆరెస్ ఎంపీ ఈ ప్రశ్న వేయడం గమనార్హం. ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న వాయు కాలుష్యంపై గత వారం పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా ఎఐఎడిఎంకె ఎంపీ నవనీతక్రిష్ణన్ ‘ఢిల్లీలో ప్రతి ఒక్కరూ భయంతో బతుకుతున్నారు. ఢిల్లీ నగరం గ్యాస్ ఛాంబర్ లా మారింది. మానవ ఆవాసానికి ఢిల్లీ ఏమాత్రం అనుకూలంగా లేదు… పార్లమెంటు సమావేశాలను దక్షిణాదిలోని ఏదో ఒక చోట నిర్వహించడం మంచిది. దానివల్ల మన ఉత్తరాది మిత్రులు కూడా కాలుష్యరహితమైన దక్షిణాది గాలిని పీల్చుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.