ధైర్యముంటే 20 సీట్లలో ఎన్నికలు : బాబుకు జగన్ సవాల్

admin
0 0
Read Time:9 Minute, 4 Second
ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారు
నంద్యాల ఒక్కచోట రూ. 200 కోట్లు ఖర్చు చేశారు
20 చోట్ల ఎన్నికలు పెడితే రూ. 4000 కోట్లు నల్లధనం కావాలి
అంత ఖర్చు పెడితే మోదీ కాలితో తంతాడు
పాదయాత్ర ప్రారంభ సభలో వైఎస్ జగన్

చంద్రబాబునాయుడుకు ధైర్యం, నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఆయా స్థానాలన్నిటిలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలు చేశారు. నంద్యాల ఒక్కచోట ఉప ఎన్నిక వస్తే రూ. 200 కోట్లు ఖర్చు చేశారని, అదే 20 చోట్ల ఎన్నికలు వస్తే చంద్రబాబుకు రూ. 4,000 కోట్లు నల్లధనం అవసరమవుతుందని పేర్కొన్న జగన్… ‘అంత డబ్బు పంచడం మొదలుపెడితే మోదీ కాలితో తంతాడు. అందుకే ఎన్నికలకు రారు’ అని వ్యాఖ్యానించారు. 20 చోట్ల ఎన్నికలుపెడితే చంద్రబాబు పునాదులు కదిలిపోతాయని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్ల మేరకు ఆరు నెలల్లో పాదయాత్ర చేయాలని సంకల్పించిన జగన్… దానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి సోమవారం శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ప్రారంభ సభలో మాట్లాడుతూ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తమ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల మాదిరి కొన్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. అధికారంలో ఉన్నవాళ్లు చట్టాన్ని గౌరవించాలని, కానీ చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతోపాటు నలుగురిని మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారని ఆక్షేపించారు. రాష్ట్రమంత్రివర్గాన్ని చూస్తుంటే ఎవరు ఏ పార్టీనో అర్ధం కావడంలేదన్నారు. ‘నంద్యాల ఒక్క చోట గెలిచి ఇది నా బలం అంటున్న చంద్రబాబును అడుగుతున్నా.. బలమో వాపో.. ప్రజలకుమంచి చేశావని, వాళ్ళు ఓటు వేస్తారని నమ్మకం ఉంటే 20 చోట్ల ఎన్నికలు పెట్టాలని సవాలు చేస్తున్నా’ అని జగన్ ఉద్ఘాటించారు.

దేవుడు ఆశీర్వదించి, ప్రజలు దీవిస్తే ఒక ఏడాదిలో తన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలను కదిలించినా ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోందని, చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే లేడంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ. 87 వేల కోట్ల మేరకు రైతు రుణాలు ఉంటే… బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పారని, రూ. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడని గుర్తు చేశారు. రైతులకు వడ్డీ రాయితీ రూపంలో ఇప్పటిదాకా ఇవ్వాల్సిన రూ. 10వేల కోట్లను ఎగ్గొట్టి.. మరోవైపు రుణ మాఫీ చేస్తున్నానని ఘనంగా చెబుతున్నాడని ఆక్షేపించారు. ఒకవైపు రైతుల జేబు కొట్టి మరోవైపు వారికేదో ఇస్తున్నట్టుగా ఫోజు కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడంలేదన్నారు.

మోదీ తంతారనే రాష్ట్ర డిమాండ్లపై రాజీ!

రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి చంద్రబాబు గట్టిగా అడగడంలేదని ఆక్షేపించిన జగన్.. అవినీతికి పాల్పడుతున్నందునే కేంద్రాన్ని డిమాండ్ చేయలేేకపోతున్నారని ఆరోపించారు. ఇదే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నానరని, ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

ఈయన కేంద్రాన్ని అడగడు. ఎందుకంటే సంపాదించిన నల్లధనాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకోసం పంచుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కాంట్రాక్టులోనైనా 30 శాతం కమిషన్ తీసుకుంటున్నాడు. లంచాలు తీసుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబుకు కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు. గట్టిగా అడిగిత మోదీ లాగి తంతాడేమోనని భయం’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు పూర్తిగా అవినీతిమయం చేశారని జగన్ ఆరోపించారు. తాను వస్తే అవినీతిపై పోరాటం చేసి అందరిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రానికి రూ. 26 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని చెప్పారని, కానీ రూ. 10 వేల కోట్లు కూడా రాలేదని పేర్కొన్నారు.

నాకున్న కసి ఏంటో తెలుసా?!

‘నాకు కసి ఉంది. ఆ కసి ఏంటంటే… చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికుండాలన్నదే. అందుకే మంచి చేస్తా. నేను పోయాక నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలి…నాన్న ఫొటో పక్కన’

విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని నమ్ముతున్నానని, అది తేవాల్సి ఉందని జగన్ చెప్పారు. హోదాను సాధించి రాష్ట్రంలోని ప్రతి యువకుడికీ ఉద్యోగం వచ్చేలా చేస్తానన్నారు. ’నాలో ఉన్న కసి రైతులకు వ్యవసాయం మళ్ళీ పండుగ చేయాలని… నా కసి అధికారంలోకి వచ్చాక మూడు నాలుగేళ్లలో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని. నా కసి ఏంటో తెలుసా…మళ్లీ చదువుల విప్లవం తేవాలి. ప్రతి పేదవాడినీ చదివించాలి’ అని జగన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం పేద విద్యార్ధులు చదువుకోలేకపోతున్నారని, ఫీజు రూ. లక్ష ఉంటే రీ ఇంబర్స్ మెంట్ పథకం కింద రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారని, మిగిలిన మొత్తంకోసం అప్పులపాలవుతున్నారని జగన్ చెప్పారు. చంద్రబాబు రాజధానిని నిర్మిస్తానని రోజుకో సినిమా చూస్తున్నారని, ఏ దేశం వెళ్తే ఆ దేశంలానే రాజధాని ఉండాలంటున్నారని, ఆచరణలో ఒక్క ఇటుకు కూడా పడలేదని ఆక్షేపించారు.

ఉద్యోగులకు వరాలే

తాను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో పని చేసే ప్రతి ఉద్యోగికీ మేలు చేస్తానని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో ఉన్నవారికి, కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైనవారికి మంచి చేస్తానని జగన్ చెప్పారు. ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టో రెండు పేజీలే

తాను పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఆఫీసుల్లో కూర్చొని తయారు చేయబోనని, ప్రజల మధ్య తిరిగి సూచనలు తీసుకుంటానని జగన్ చెప్పారు. మేనిఫెస్టో రెండే రెండు పేజీలుంటుందని చెప్పారు. ’ప్రజలు ఇచ్చిన…ప్రజలకు తిరిగి ఇచ్చే మేనిఫెస్టో’ ఉంటుందన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

భాగమతి ఫస్ట్ లుక్ ఇదే

Share Tweet LinkedIn Pinterest
error

Enjoy this blog? Please spread the word