నంది అవార్డులపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు గుర్తింపుగానీ, ఆధార్ కార్డుగానీ లేనివాళ్ళే నంది అవార్డులపై ఎక్కువ మాట్లాడుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఎలు) హైదరాబాదులో ఉండి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. విమర్శల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ లాబీలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేవలం ఇద్దరు ముగ్గురే నంది అవార్డుల ఎంపికపై విమర్శలు చేస్తున్నారని లోకేష్ ఆక్షేపించారు. మూడేళ్ళకు ఒకేసారి ఇవ్వడంపై స్పందిస్తూ… ’అసలు అవార్డులే ఇవ్వనివారిని అడిగే దమ్ము వీరికి ఉందా’ అని ప్రశ్నించారు. అవార్డులపై వివాదం నెలకొన్న విషయంలో ముఖ్యమంత్రి బాధపడ్డారని లోకేష్ చెప్పారు. అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.
కులం ఆపాదిస్తారా?
సోమవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష వ్యూహరచనా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నంది అవార్డలు విషయాన్ని ప్రస్తావించారు. అవార్డుల ప్రకటనకు కులాన్ని ఆపాదించడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డులు ఎవరికి ఇచ్చారో తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించిన చంద్రబాబు, అందుకోసం నియమించిన కమిటీలే ఆ పని చేశాయని, వారి ఎంపికనే ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు.
అవార్డుల ఎంపిక కార్యక్రమం ఇంత వివాదాస్పదమవుతుందని తాను ఊహించలేదని, అలా అనుకొని ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ ద్వారానే ప్రజాభిప్రాయం సేకరించి విజేతలను ఎంపిక చేసేవారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు ఒకేసారి అవార్డు విజేతలను ప్రకటించడం సరి కాదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు సమాచారం.