అత్యంత చౌక కారుగా ప్రారంభమైన టాటా ‘నానో’కు కాలం చెల్లింది. గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ లో ఏర్పాటు చేసిన టాటా నానో కారు ప్లాంటు ప్రస్తుతం రోజుకు రెండు యూనిట్ల చొప్పున మాత్రమే ఉత్పత్తి చేస్తోంది! నానో డీలర్లు ఆర్డర్లు ఇవ్వడమే మానేశారు. ఆ డీలర్లందరూ ఇప్పుడు చిన్న కార్ల సెగ్మెంట్ లోని ఇతర మోడళ్ళను నమ్ముకుంటున్నారు.
దేశవ్యాప్తంగా 630 అమ్మకపు ఔట్ లెట్లు ఉన్న నానో కంపెనీ అక్టోబర్ నెలలో వాటన్నిటికీ పంపిన కారు యూనిట్ల సంఖ్య కేవలం 57. అంటే 11 షోరూంలకు ఒక్క కారు చొప్పున కూడా లేదు. ఇది నానో ప్రస్తుత పరిస్థితికి దర్పణం పడుతోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 180 కార్లను సేల్స్ ఔట్ లెట్లకు పంపిన టాటా.. సెప్టెంబర్లో ఆ సంఖ్యను 124కు తగ్గించింది. అక్టోబర్ నెలలో ఏకంగా 57కు తగ్గించింది.
నిజానికి సెప్టెంబర్, అక్టోబర్ పండుగ సీజన్లలో కార్లకు డిమాండ్ పెరగాలి. కానీ, నానో కారుకు మాత్రం ఆర్డర్లు ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూ. 2.25 లక్షల నుంచి 3.20 లక్షల వరకు నానో కార్ల ధరలున్నాయి. డీలర్లు కొత్తగా ఆర్డర్లు ఇవ్వకుండా తమ వద్ద ఉన్న యూనిట్లను వదిలించుకునే పనిలో ఉన్నారు.
ఉత్పత్తి తగ్గిందిలా
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో టాటా కంపెనీ కేవలం 1,299 నానో యూనిట్లను ఉత్పత్తి చేసింది. గత ఏడాది అదే కాలంలో ఉత్పత్తి అయిన కార్ల సంఖ్యలో ఇది దాదాపు నాలుగో వంతు. దేశీయ అమ్మకాలే కాకుండా ఎగుమతులు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేవలం 111 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి.
గత ఏడాది మే నెలలో 884 యూనిట్లు ఉత్పత్తి అయితే ఈ ఏడాది అదే నెలలో 343 యూనిట్లే ఉత్పత్తి అయ్యాయి. అమ్మకాలు గత ఏడాది 856 యూనిట్లకుగాను ఈ ఏడాది కేవలం 355 జరిగాయి. జూన్లో 275 యూనిట్లు ఉత్పత్తి అయితే అమ్ముడుపోయింది కేవలం 167 యూనిట్లు. జూలైలో 167 యూనిట్లే ఉత్పత్తి చేయగా పాత స్టాకుతో కలిపి 260 యూనిట్లను డీలర్లు అమ్మారు. ఆగస్టులో 215 యూనిట్లు ఉత్పత్తి అయితే 180 అమ్మారు. సెప్టెంబర్ నెలలో కేవలం 58 యూనిట్లు ఉత్పత్తి చేస్తే డీలర్లు పాత స్టాకుతో కలిపి 124 అమ్మారు. అక్టోబర్ నెలలో 74 యూనిట్లు ఉత్పత్తి అయితే 57 మాత్రమే అమ్ముడయ్యాయి.
నానో కార్ల మోడల్ లో కోయంబత్తూరుకు చెందిన జయెం మోటార్స్ ‘నియో’ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కారు బాడీలను సరఫరా చేస్తున్నది టాటా కంపెనీ. అయితే, టాటా బ్రాండ్ మాత్రం ఉండదు. సో… ఇక ‘నానో’కు ‘టాటా’ చెప్పినట్టే!