నెంబర్ 2 శ్రీకాంత్… ప్రపంచ బ్యాడ్మింటన్ తాజా ర్యాంకులివి

ఒక కేలండర్ సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ళను గెలుచుకున్న ఏకైక ఇండియన్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా రికార్డులకెక్కిన కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్ లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ప్రకటించిన ర్యాంకుల ప్రకారం పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ ది రెండో స్థానం. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకిన శ్రీకాంత్ నాలుగో ర్యాంకునుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. బిడబ్ల్యుఎఫ్ టాప్ 10 ర్యాంకర్లలో ఒకే ఒక్క ఇండియన్ శ్రీకాంత్. మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో రాష్ట్రానికే చెందిన పీవీ సింధు ఇదివరకే రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు పురుషుల సింగిల్స్ లోనూ అదే ఘనత ఆంధ్రుడికి దక్కింది.

డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ ఎక్సెల్సెన్ 77,930 పాయింట్లతో ప్రపంచ ర్యాంకులలో మొదటి స్థానంలో ఉండగా శ్రీకాంత్ 73,403 పాయింట్లతో అతని తర్వాత స్థానానికి వచ్చాడు. విక్టర్ 13 టోర్నమెంట్లు ఆడగా శ్రీకాంత్ 12 టోర్నమెంట్లు ఆడాడు.18 టోర్నమెంట్లలో పాల్గొన్న కొరియా ఆటగాడు సోన్ వాన్ హో 71,738 పాయింట్లతో మూడో స్థానంలో నిలిస్తే… చైనా ఆటగాడు లిన్ డాన్ 11 టోర్నమెంట్లు ఆడి 68,746 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 5,7,9 స్థానాల్లోనూ చైనీయులే ఉండగా 6,10 స్థానాలను చైనీస్ తైపీ (తైవాన్) ఆటగాళ్ళు పొందారు. ప్రపంచ ర్యాంకుల్లో ఇంకా ఇండియన్ ఆటగాళ్ళు ప్రణోయ్ 11వ స్థానంలో, సాయి ప్రణీత్ 16వ స్థానంలో, సమీర్ వర్మ 18వ స్థానంలో, అజయ్ జయరాం 22వ స్థానంలో నిలిచారు.

Related posts

Leave a Comment