నేను రాజీపడినట్టే ఉంటుంది.. కానీ రాజీ కాదు! : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం

నాది బాధ్యతాయుతమైన రాజకీయం
గొడవలు పెట్టుకోవడం చివరి అస్త్రం
విలీనం చేసేట్టయితే పార్టీ పెట్టడం ఎందుకు?
‘వందేమాతరం’ అంతటి మహావాక్యం ‘జై తెలంగాణ’

అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలతో తాను రాజీపడినట్టుగా వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘కొన్నిసార్లు నేను రాజీపడినట్టే ఉంటుంది. కానీ అది రాజీ కాదు. తగ్గడం’ అని పవన్ వివరణ ఇచ్చారు. 2019కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణనుంచి ప్రారంభించిన పవన్ మంగళవారం కరీంనగర్ లో జనసేన కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజా సంక్షేమంకోసం కొన్నిసార్లు తగ్గి ఉండటానికి తాను సిద్ధమని పవన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయని, రెండు చోట్లా తాను చాలా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. ‘నేను విభేదిస్తాను. అవసరమైతే గొడవపెట్టుకుంటాను. కానీ అది ఆఖరి అస్త్రం. పరిస్థితులు కుదిరినప్పుడు ఓకే. సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్లపైకి రావడానికి సిద్ధం’ అని చెప్పారు.

2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీని వేరే పార్టీలలో విలీనం చేసే అవకాశం లేదని కుండబద్ధలు కొట్టారు. ‘జనసేనను కూడా విలీనం చేస్తారా అని కొందరు అడుగుతున్నారు. విలీనం చేయడానికైతే పార్టీ పెట్టడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. తనపై ఎవరు విమర్శలు, దాడులు చేసినా మడమ తిప్పబోనని ఉద్ఘాటించారు. ‘మాట ఇచ్చానా..నిలబడి తీరుతా’ అని గర్జించారు.

తాను ఒక సంవత్సరం వచ్చిపోయేవాడిని కానని, సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించానని చెప్పారు. ‘ఒక ఆదర్శం వాస్తవ రూపం దాల్చాలంటే 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. నాది సుదీర్ఘ ప్రస్థానం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధపడండి’ అని జనసేన అనుయాయులకు పిలుపునిచ్చారు. జనసేన కులమత ప్రస్తావన లేని రాజకీయాలను కోరుకుంటుందని, ఇండియా సెక్యులర్ దేశమని, తమది ప్రాంతీయతలను గౌరవించే జాతీయ ధృక్పథమని పవన్ పేర్కొన్నారు.

వందేమాతరం వంటిది జైతెలంగాణ

తెలంగాణ భావోద్వేగాలంటే తనకు చాలా ఇష్టమన్న పవన్ కళ్యాణ్ ‘జై తెలంగాణ’ నినాదాన్ని ‘వందేమాతరం’తో పోల్చారు. వందేమాతరం ఎలాంటిదో జై తెలంగాణ అలాంటి మహావాక్యమని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని ఉద్ఘాటించారు. ‘ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. కరీంనగర్ లో నన్ను ఆంజనేయుడు కాపాడాడు. అలాంటి గడ్డకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎక్కువ కాలం జీవించింది తెలంగాణలోనే’ అని పవన్ పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యాసని, బాషని గౌరవించకపోవడంవల్ల సమస్యలు వచ్చాయని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ కవులను, కళాకారులను గౌరవించడం అంటే ఇంకొకరిని చిన్నబుచ్చడం కాదని ప్రపంచ తెలుగు మహాసభలు చూసినప్పుడు అర్ధమైందన్నారు. భిన్న సంస్కృతులను గౌరవించాల్సి ఉందన్నారు.

గన్ పాయింట్ లో కాదు…

కేంద్రం హిందీని రుద్దడానికి ప్రయత్నించినప్పుడు తమిళనాట వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పవన్ గుర్తు చేశారు. ప్రాంతీయతలను గౌరవించకపోతే జాతి సమైక్యతకే విఘాతం కలుగుతుందన్నారు. తాను కూడా ఉర్దూ, హిందీని నేర్చుకున్నానని, అది తాను ఇష్టపూర్వకంగా చేసిన పనే తప్ప ఎవరో గన్ పాయింట్ లో నేర్పింది కాదని పవన్ వ్యాఖ్యానించారు.

మా అన్నా కాంగ్రెస్ నాయకుడే..

 

కేసీఆర్ ను స్మార్ట్ సిఎం అంటే కాంగ్రెస్ నాయకులు తనను విమర్శించడాన్ని పవన్ తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవలసిన విషయం… మా అన్నయ్యా కాంగ్రెస్ నాయకుడే..! కేసీఆర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే.. రాజకీయాల్లో ప్రజలకోసం పోరాడేవాళ్లంటే నాకిష్టం. వాళ్ళతో నేను విభేదించొచ్చు. ఈరోజుకూ నాకు కొన్ని అంశాల్లో విభేదాలున్నాయి’ అని పవన్ చెప్పారు.

 

Related posts

Leave a Comment