మున్సిపాలిటీలలో ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులు
ఏర్పాటుకు సిఎం ఆదేశం
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రభుత్వ ప్రచారం, సమాచార చేరవేత లక్ష్యాలుగా ఎలక్ట్రానిక్ సైన్ బోర్డుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఐవోటీ, ఐటీ, ఫైబర్ నెట్, రియల్‌టైమ్ గవర్నెన్స్ తదితర అంశాలపై వివిధ శాఖాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో సైన్ బోర్డుల అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
20 ఏళ్ళ క్రితం తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు హైదరాబాద్ పొందుతున్న ఫలితాలు కళ్ళముందే ఉన్నాయన్నసిఎం… అంతకంటే ఉన్నత సంస్కరణలతో రాష్ట్రం దూసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా నిలవాలని ప్రభుత్వ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పాలనలో తీసుకొస్తున్న సంస్కరణల ఫలాలు తక్షణం ప్రజలకు చేరాలని, దానికి ఉద్యోగుల సహకారం అత్యంత అవసరమని అన్నారు.
ఆలోచనలు, ఆవిష్కరణలు అనుకున్నట్టుగా అమలు చేయగలిగితే అద్భుతాలు చేయవవచ్చునని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇ- ప్రగతి ద్వారా ప్రతి శాఖను అనుసంధానం చేసి ప్రజలకు రియల్ టైములో సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతిరోజు ఉదయాన్నే రియల్ టైం గవర్నెన్స్ కోసం ఒక గంట సమయం వెచ్చిస్తున్నట్టు తెలిపారు. దస్త్రాల (ఫైళ్ళ) పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ చూపిన సిఎం
సమీక్షకు హాజరైన వివిధ శాఖల అధికారులకు సచివాలయం మొదటి భవనంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను స్వయంగా చూపించి, సెంటర్ ఏ విధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. వచ్చే ఆదివారం ఈ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించపోతున్నట్టు ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇకపై రియల్ టైం గవర్నెన్స్‌లో కీలక భూమిక పోషించనుందని తెలిపారు.
లోకేష్ కు సూచన
రాష్ట్ర ఐటీ శాఖ అత్యున్నత సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని తయారు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు సూచించారు. కేంద్రంతో మాట్లాడి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నామని, ఈ టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఫైబర్ గ్రిడ్, డ్రోన్ కార్పోరేషన్, టవర్ కార్పోరేషన్, వర్చువల్ క్లాస్ రూములు, కంటెంట్ కార్పొరేషన్ వంటి వాటినన్నింటినీ సమీకృతం చేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని తీరాలన్నారు.
1,23,000 సెట్ టాప్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, వారానికి పది వేల బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఫైబర్ నెట్ సీఈవో అహ్మద్ బాబు తెలపగా, ఈ వేగం సరిపోదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మన టీవీ సేవలను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. దీని నిర్వహణ బాధ్యతలు ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. అన్ని స్కూళ్ళకు ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, డీజీపీ నండూరి సాంబశివరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, అదనపు కార్యదర్శి రాజమౌళి, జీఏడీ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఆర్టీజీ సీఈవో బాలసుబ్రమణ్యం, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.