కాంగ్రెస్ భక్తులకు, విమర్శకులకు కూడా ఆయన ఇన్నాళ్లూ ‘యువరాజు’. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో ‘మహారాజ’ పట్టాభిషేకానికి సన్నద్ధమయ్యారు. అందుకు సోమవారం శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికకోసం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ రోజుతో గడువు ముగుస్తున్నా ఇంతవరకూ రాహుల్ మినహా మరెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో.. రాహుల్ ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు.
సోమవారం నామినేషన్ దాఖలు చేయక ముందు రాహుల్ గాంధీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో ప్రణబ్ ముఖర్జీ రాహుల్ గాంధీకి తిలకం దిద్ది పంపగా… మన్మోహన్ సింగ్ స్వయంగా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎఐసిసి కార్యాలయంలో పార్టీ ఎన్నికల అధారిటీకి రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాహుల్ తల్లి, ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మినహా కాంగ్రెస్ హేమాహేమీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కర్నాటక, పంజాబ్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అమరీందర్ సింగ్, సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, షీలా దీక్షిత్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, మొహసినా కిద్వాయ్ హాజరైనవారిలో ఉన్నారు. రాహుల్ తరపున సీనియర్ నాయకులు కమల్ నాథ్, షీలా దీక్షిత్, మోతీలాల్ వోరా, తరుణ్ గొగోయ్ మొదటి సెట్ పత్రాలను దాఖలు చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతలూ రాహుల్ గాంధీ తరపునే నామినేషన్ పత్రాలను సమర్పించారు. కొందరు రాష్ట్రాల ఎన్నికల అధికారుల వద్ద పత్రాలను దాఖలు చేశారు.
రాహుల్ గాంధీ తన తల్లి సోనియా మార్గంలో నడవాలని, ఏకాభిప్రాయంతో పార్టీని నడిపించాలని ఈ సందర్భంగా పలువురు నేతలు సూచించారు. రాహుల్ గాంధీని ‘కాంగ్రెస్ డార్లింగ్’గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. రాహుల్ మినహా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆగే అవసరం లేకుండా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.
2017 డిసెంబర్ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నేపథ్యంలో… గత నెల 20వ తేదీన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) , రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని తీర్మానించింది. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. ఇతరులెవరూ పోటీ చేసే అవకాశం లేకుండా రాహుల్ గాంధీని రుద్దుతున్నారని మహారాష్ట్ర నాయకుడు హెహ్జాద్ పూనావాలా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు ఘాటుగా జవాబిచ్చారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో నరేంద్రమోదీకి ఏం పని? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గుజరాత్ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికవుతున్నందున… ఆయన తొలి సవాలును ఎదుర్కోబోతున్నారని చెప్పవచ్చు. అందుకే మోదీతో సహా బీజేపీ నేతలంతా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చవిచూసిన ఘోర ఓటమి.. బిజెపి సొంతగా మెజరిటీ సాధించడానికి కారణమైంది. ఇటీవల మారుతున్నపరిస్థితుల్లో రాహుల్ గాంధీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో 1998లో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సోనియా గాంధీ, సమర్ధవంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె హయాంలోనే పదేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2014లో ఓటమిని ఎదుర్కొంది. 19 సంవవత్సరాలపాటు అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాహుల్ గాంధీకి ప్రమోషన్ ఇచ్చే విషయంలో సోనియా ఆచితూచి వ్యవహరించారు.