పడవ ప్రమాద మృతులకు శాసనసభ సంతాపం

ఆదివారం విహారయాత్రకు వచ్చి పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర శాసనసభ సంతాపాన్ని ప్రకటించింది. అనుమతి లేని ఓ ప్రైవేటు బోటు అనుభవ రాహిత్యంతో ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం సాక్షిగా 20 మంది ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో సోమవారం దుర్ఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం పూర్తి పాఠం ఇదీ..

“నవంబర్ 12వ తేదీ-ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీవ్ర విచారాన్ని తెలియజేస్తోంది. అత్యంత దిగ్ర్భాంతికి గురిచేసిన ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమైనది. విజయవాడలోని భవానీద్వీపం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీఘాట్‌కు వెళుతున్న బోటు తిరగబడటంతో ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వచ్చి ఇలా విషాదాంతం కావడం దురదృష్టకరం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఈ దుర్ఘటనలో మృతిచెందినవారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తోంది. సొంతవాళ్లను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తోంది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ ప్రార్ధిస్తోంది.
ముగ్గురు బోటు సిబ్బంది సహా మొత్తం 45 మంది యాత్రికులతో వెళుతున్న ఈ పడవ సాయంత్రం గం.5.15 ని.లకు అదుపుతప్పి తిరగబడటంతో 20మంది మృతిచెందడం కలచివేస్తోంది. గల్లంతైన మరొకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. సురక్షితంగా బయటపడిన మరో 21మందిలో 17 మందిని స్వస్థలాలకు తరలించి, మిగిలిన నలుగురికి వైద్యచికిత్స అందించడం ఉపశమనం కలిగిస్తోంది.

NDRF, SDRF, పోలీస్, అగ్నిమాపక, జలవనరులు, రెవెన్యూ, పురపాలక, వైద్యారోగ్య, పర్యాటక శాఖల యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని రాత్రి తెల్లవార్లూ శ్రమించింది. తక్షణమే స్పందించి ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడిన స్థానిక మత్స్యకారులకు ఈ సభ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రాణాలకు తెగించి మానవత్వం చాటిన మత్స్యకారులు నడికుదుటి పిచ్చయ్య, కన్నా శివయ్యను రాష్ట్ర శాసనసభ అభినందిస్తోంది.
గల్లంతైన మిగిలినవారి ఆచూకీ కోసం చేస్తున్న కృషి సత్వరం ఫలించాలని శాసనసభ ఆశిస్తోంది. ఈ పెను విషాదానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ సభ రెండు నిమిషాలు మౌనం పాటిస్తోంది

Related posts

Leave a Comment