పదిరోజుల్లో 21 లక్షల దోమతెరల పంపిణీ!

1 0
Read Time:8 Minute, 25 Second
  • సీజనల్ వ్యాధులు ఇక కనిపించకూడదు..
  • వైద్య ఆరోగ్యశాఖలో అలసత్వాన్ని సహించను..
  • ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ..

 

రాష్ట్రంలో ఇకపై సీజనల్ వ్యాధులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హుకుం జారీ చేశారు. ప్రజారోగ్యం విషయంలో నిర్ల్యక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన వైద్య ఆరోగ్య శాఖను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ముఖ్య కారణమైన దోమల్ని నియంత్రించాల్సిందేనని అధికారులకు స్పష్టంచేసిన ముఖ్యమంత్రి.. రానున్న పది రోజుల వ్యవధిలో 21 లక్షల దోమతెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనిపై పరిష్కార వేదిక నుంచి అవసరమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్దేశించారు.

 

గురువారం రాత్రి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవరచుకోవాలని సూచించారు. అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబొరేటరీలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అందుబాటులో వున్న వైద్యులను, సహాయ సిబ్బందిని సమర్ధంగా వినియోగించుకోవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని సిఎం ఆదేశించారు. ‘సీజనల్ వ్యాధులు ఎప్పుడొస్తాయనేది ప్రతి ఏడాది తెలిసిన విషయమే. ఆ సీజన్‌కు ముందే తగిన ప్రణాళికలు తయారు చేసుకోవడం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా మారాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సీజనల్ వ్యాధుల గత చరిత్ర దగ్గర పెట్టుకుని అవి ఎప్పుడు వస్తాయో స్పష్టంగా తెలుసుకుని ముందు నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలన్నారు.

సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోనని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టంచేశారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇకపై నెలకు ఒకసారి తప్పనిసరిగా సమీక్ష జరుపుతానని చెప్పారు. వనరులు పుష్కలంగా ఉన్నా చిత్తశుద్ది లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మందలించారు. యన్టీఆర్ వైద్య పరీక్షల ద్వారా ఇప్పటివరకు 40.90 లక్షల మందికి 1,46,80,323 పరీక్షలు నిర్వహించామని అధికారులు వివరించారు. ఎన్ని పరీక్షలు చేశామన్నది లెక్కలు చెబితే కాదని, ఆ పరీక్షలు రోగికి సరైన సమయంలో చేసి తగిన ఫలితాలు సాధించామా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు.

 

ప్రజలు సంతృప్తి చెందడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎక్కడ, ఎలా పనిచేస్తున్నాయో అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణ ప్రాంతాలలో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామాల్లో వీధులు పరిశుభ్రంగా ఉంచేలా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు మురుగు కాలువలు శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం మలేరియా, డెంగ్యు కేసులు తగ్గించగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరింత మెరుగ్గా పనిచేసి అర్యోగ్య సూచికలో అభివృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పలు కారణాలతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెబుతూ, కారణం ఏదైనా, ఎంత వేగంగా స్పందించామనేదే ముఖ్యమని అన్నారు. ప్రతి అధికారి, వైద్యుడు, సిబ్బంది తమతమ విధులను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వాన్ని ఊరుకునేది లేదని తేల్చారు.

 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజల వైద్య రికార్డులను నిర్వహించాలని, అన్ని రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యలు సమర్ధంగా చేపడితే వ్యాధులు తలెత్తే అవకాశమే లేదని చంద్రబాబు చెప్పారు. ఐటీడీఏ పరిధిలోని గ్రామాలలో ప్రజారోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రహదారుల సమస్యలు ఇంకా కనిపిస్తున్నాయని, ఆయా ప్రాంతాలకు సమయానికి చేరుకోలేకపోవడమే అతిపెద్ద సమస్యగా ఉన్నదని చెప్పారు.

 

గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు నిపుణులైన వైద్యులు సుముఖత వ్యక్తం చేయడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే ప్రభుత్వం ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాలలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కచ్చితంగా 24 గంటలు పనిచేయాలని సిఎం స్పష్టం చేశారు.

 

ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు, నాలేడ్జ్ పార్టనర్లు ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రుల వారీగా, పేషెంట్ల వారీగా వివరాలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి తీరాలన్నారు. ప్రజారోగ్యం విషయంలో పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. వచ్చే నెల నుంచి జనన, మరణ వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్ చేయాలన్నారు. స్వల్ప వ్యవధిలో పోష్టికాహార లోపం సమస్యను ఎలా రూపుమాపగలమో తగిన ప్రణాళికలతో రావాలని చెప్పారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply