పలానావారి అబ్బాయి అని ఓట్లేయరు : పవన్ కామెంట్ పై లోకేష్

admin
పోలవరంపై చాలా చర్చ జరిగింది

అది అర్ధంపర్ధం లేని పాదయాత్ర
పవన్, జగన్ లకు కౌంటర్

వారసత్వంతో అవకాశం వచ్చినా… సమర్ధత నిరూపించుకోలేకపోతే నిలబడలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ‘పలానా వారి అబ్బాయి అని చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు’ అని లోకేష్ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలపై జనసేన పార్టీ అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు లోకేష్ ఈ విధంగా స్పందించారు. శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో కుటుంబ ఆస్తుల ప్రకటన నిమిత్తం లోకేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.

రెండు రోజుల క్రితం విజయనగరంలో ఒక సభలో మాట్లాడిన పవన్ ‘సిఎం కొడుకును కాబట్టి సిఎంను కావాలి’ అనుకోవడం తప్పని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ…మొత్తంగా వారసత్వ రాజకీయాలపై విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో లోకేష్ ‘వారసత్వం అవకాశం కల్పించిన మాట వాస్తవమే. అయితే, ఆ తర్వాత ఎవరు సమర్ధవంతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారో వారే మిగులుతారు’ అని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో పవన్ లేవనెత్తిన అంశాలను ప్రస్తావించినప్పుడు ‘పోలవరంపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. తెలియని విషయాలేం లేవు. శానసభలో కూడా వివరాలు ఇచ్చాం. పోలవరం మొత్తం వ్యయంలో 33 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే… రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా ప్రాజెక్టును నిర్మించి ఉంటే మూడు వేల కోట్లతో ఆ పని అయిపోయేది’ అని లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పుడు (2013 భూసేకరణ చట్టం రాక ముందు) ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు.

గోదావరి నది నుంచి ఏటా 2000 టిఎంసిలు సముద్రంలోకి పోతున్నాయని, అదే సమయంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కేవలం 5 టిఎంసిలకోసం కొట్టుకున్న సంగతీ చూశామని లోకేష్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందనే ముందుగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించామని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై స్పందిస్తూ… ‘పాదయాత్ర అర్ధం పర్ధం లేకుండా చేస్తున్నారు. విమర్శలు తప్ప ఏమీ లేదక్కడ. తెలుగుదేశం పార్టీ భావనలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. మాకు ప్రతిపక్షం ప్రభుత్వ కాల్ సెంటరే. దాని ద్వారానే ప్రజల సమ్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాం. ప్రపంచంలోనే ఇలాంటి కాల్ సెంటర్ మరొకటి లేదు. ఇక అసెంబ్లీలోనైతే మా సొంత ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. తాగునీటి సమస్యపైన నన్నే నిలదీశారు’ అని లోకేష్ చెప్పారు.

Leave a Reply

Next Post

చంద్రబాబుకంటే మనవడి నెట్ వర్త్ ఎక్కువ

ShareTweetLinkedInPinterestEmailShareTweetLinkedInPinterestEmail

Subscribe US Now

shares