స్పీడ్ టెస్టులో 77 దేశాల్లో అట్టడుగున ఇండియా
అందుబాటులో మాత్రం అగ్రదేశాలతో పోటీ
ఇంత వైరుధ్యం మరే దేశంలోనూ లేదు
ఫోర్త్ జనరేషన్… సింపుల్ గా 4జీ. దాదాపు దేశమంతా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు 84.03 శాతం 4జి అందుబాటుతో ఇండియా అభివృద్ధి చెందిన దేశాలతో ఢీ అంటే ఢీ అంటోంది. అదే సమయంలో స్పీడ్ విషయంలో మాత్రం అట్టడుగున ఉంది. 77 దేశాల్లో 4జి మొబైల్ నెట్ వర్క్ సామర్ధ్యాన్ని మధించి చూస్తే సింగపూర్ 46.64 ఎంబిపిఎస్ స్పీడుతో మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాదే ఆఖరి స్థానం. మన దేశంలో 4జి నెటవర్క్ సగటు స్పీడు 6.13 ఎంపిపిఎస్ మాత్రమే. ఈ 77 దేశాల సగటు స్పీడు 16.6 ఎంబిపిఎస్ గా ఉంది.
దాయాది దేశం పాకిస్తాన్ ఈ విషయంలో మనకంటే చాలా ముందుంది. ఆ దేశంలో 4జి డౌన్ లోడ్ స్పీడు సగటు 11.67 ఎంబిపిఎస్ గా తేలింది. ఓపెన్ సిగ్నల్ అనే సంస్థ రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోని ఏ దేశమూ 50 ఎంబిబిస్ దాటి ఎల్ టిఇ సేవలను అందించలేకపోతోంది. సింగపూర్ (46.6 ఎంబిపిఎస్), దక్షిణ కొరియా (45.9 ఎంబిపిఎస్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నార్వే, హంగరీ తర్వాత రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ నాలుగు దేశాల్లో మాత్రం 40 ఎంబిపిఎస్ కంటే ఎక్కువ వేగంతో 4జి నెటవర్క్ సేవలు అందుతున్నాయి.
ఇండియాలో ఇప్పుడంతా 4జీ మొబైల్ ఫోన్ల హవా నడుస్తోంది. రిలయన్స్ జియో వచ్చాక ఇది వేగవంతమైంది. దీంతో 4జి నెట్ వర్క్ అందుబాటు ఏకంగా 84.03 శాతానికి పెరిగింది. ఇండియాలో 4జి నెట్ వర్క్ శరవేగంగా విస్తరించినట్టే లెక్క. అదే సమయంలో 4జి డౌన్ లోడ్ స్పీడ్ మన పొరుగు దేశాల కంటే అధ్వానంగా ఉంది. ఇండియాకు రెట్టింపుకంటే ఎక్కువ స్పీడు (13.04 ఎంబిపిఎస్)తోో శ్రీలంక చాలా ముందుంది. శ్రీలంక, పాకిస్తాన్ 4జి అందుబాటు విషయంలో ఇండియాకంటే బాగా వెనుకబడి ఉన్నా.. వేగంలో ముందున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 50 దేశాల్లో 70 శాతం కంటే ఎక్కువగా 4జి నెట్ వర్క్ విస్తరించింది. ఆరు నెలల క్రితం 33 దేశాల్లోనే 70 శాతం మించి ఉండేది. అయితే అందుబాటు పెరిగినా చాలా దేశాల్లో ఇంతకు ముందుకంటే డౌన్ లోడ్ స్పీడు తగ్గింది.