నవంబర్ 2వ తేదీనుంచి పాద యాత్ర చేయాలని సంకల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అందుకోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉన్న కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు. కేసుల విచారణకు సంబంధించి జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉంది. కాగా… వచ్చే ఆరు నెలలపాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని తాజాగా జగన్ కోర్టులు కోరారు.
ఈ పిటిషన్ పై విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. 2004 ఎన్నికలకు ముందు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన తరహాలోనే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. నిరంతరాయంగా యాత్ర చేయడానికి కోర్టు కేసులు అవరోధంగా ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇదివరకే ఒకసారి కోర్టుకు విన్నవించారు. అయితే అప్పట్లో సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. తాజా పిటిషన్ విషయంలో ఏ నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.