పార్టీ ఏదైనా ప్రభుత్వం అందరిదీ…

3 0
Read Time:10 Minute, 12 Second
వివక్షకు చోటు లేకుండా 100 శాతం వినతుల పరిష్కారం
ఐదో విడత జన్మభూమిలో 36,77,133 మందికి రూ. 4,764 కోట్ల మేరకు ప్రయోజనం
కొత్తగా 3,80,155 పెన్షన్లు, 4,86,069 రేషన్ కార్డులు, 24,903 మందికి ఇళ్ల స్థలాలు
వివిధ కార్పొరేషన్ల ద్వారా 2,70,819 మందికి రూ.2,888.70 కోట్లు లబ్ది
10 రోజుల పండుగ ముందు అధికారులకు సిఎం దిశానిర్దేశం

టీడీపీకి ఓటు వేయలేదనో, ప్రభుత్వానికి అనుకూలం కాదనో పథకాల ప్రయోజనాల పంపిణీలో ఎక్కడా వివక్ష చూపించొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు చెప్పారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందే హక్కు వుంటుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా తాను సహించేది లేదని స్పష్టం చేశారు. లబ్దిదారులతో మర్యాదగా నడుచుకోవాలని, వినతులను వినమ్రంగా స్వీకరించాలని సూచించారు. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జరిగే ఐదో విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నూరు శాతం వినతుల పరిష్కారమే లక్ష్యం

ప్రజా వినతులను నూరు శాతం పరిష్కరించడమే మన లక్ష్యం కావాలని, ఆర్ధిక-ఆర్ధికేతర అంశాలుగా విభజించి వేగంగా వినతులు పరిష్కరించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కుటుంబ వికాసం – సమాజ వికాసం మరచిపోవద్దని, కుటుంబానికి కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం వచ్చేలా తోడ్పడాలని అన్నారు. ప్రజాసాధికార సర్వేలో పేరు నమోదు చేసుకోవడంతో పాటు, ఆధార్ కార్డు వున్నవారు మాత్రమే ప్రభుత్వ పథకాలకు అర్హులని చెప్పారు. ఎక్కడా అవినీతికి, అక్రమాలకు ఆస్కారం వుండకూడదనేది తమ విధానమని అన్నారు. జన్మభూమి నిర్వహణకు జిల్లాకు రూ. కోటిన్నర కేటాయిస్తున్నామని వెల్లడించారు.

పెద్దఎత్తున పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ

అన్నింటికన్నా ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ‘జన్మభూమి-మాఊరు’లో పెద్దఎత్తున పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 3,80,155 మంది అర్హులు వున్నారని, హిజ్రాలకు కూడా పింఛన్లను అందించాలని అధికారులకు సూచించారు. ఒక కుటుంబంలో ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన సభ్యులు కొత్త కార్డు కోసం చేసిన దరఖాస్తుల సంఖ్య 2,61,366 కాగా, మరో 2,24,703 రేషన్ కార్డులు నూతనంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొత్తం 4,86,069 రేషన్ కార్డులు ఈ విడత అందిస్తామని తెలిపారు.

రూ. 48.75 కోట్ల విలువైన టూల్ కిట్స్‌ను 19,500 మందికి పంపిణీ చేస్తామని, 24,903 మందికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని, చంద్రన్న బీమాతో అసంఘటితరంగ కార్మికులకు రక్షణ కల్పిస్తామని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 2,70,819 మంది లబ్దిదారులకు రూ.2,888.70 కోట్లతో ప్రయోజనం కలిగిస్తామని వెల్లడించారు. రూ.1,610.43 కోట్లతో మొత్తం 10,75,842 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, వికలాంగులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పారు. ‘జన్మభూమి-మాఊరు’లో వివిధ పథకాల కింద మొత్తం 36,77,133 మంది లబ్దిదారులకు రూ.4,763.88 కోట్లతో ప్రయోజనం కలుగనుందని ముఖ్యమంత్రి అన్నారు. జన్మభూమి చివరి రోజైన జనవరి 11న మండల కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం వుంటుందని తెలిపారు.

ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం

గత జన్మభూమి కార్యక్రమానికి ఈసారి ‘జన్మభూమి-మాఊరు’కు ప్రత్యేకత వుందని, పక్కా ప్రణాళికతో ఐదో విడత జన్మభూమి నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతీరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలోని ఏదో ఒక గ్రామంలో జరిగే ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు. ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం కోసం రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగమంతా సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

పదిరోజులు పది అంశాలు

‘జన్మభూమి-మాఊరు’లో పది రోజులు పది అంశాలపై ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తొలిరోజు సంక్షేమం అంశంపై, రెండో రోజైన జనవరి 3న ఆరోగ్యంపై, జనవరి 4న స్వచ్ఛాంధ్రప్రదేశ్, 5న విద్య, 6న పల్లెల్లో మౌలిక సదుపాయాలు, 7న సహజవనరులు-జలవనరులు, 8న వ్యవసాయం, అనుబంధరంగాలు, 9న సుపరిపాలనకు టెక్నాలజీ వినియోగం, 10న విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్-పేదరికంపై గెలుపు అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు.చివరిగా జనవరి 11న ‘ఆనందలహరి’ పేరుతో ముగింపు కార్యక్రమం వుంటుందని అన్నారు.

జలసంరక్షణ, విజన్ 2022, 2029,2050, సమ్మిళిత వృద్ధి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపైనా గ్రామసభలు, చర్చాగోష్టులు జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అర్ధవంతమైన చర్చల తర్వాత కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనవరి 7న ఉదయం 6.30 నుంచి 7.30 వరకు 5కే రన్ నిర్వహించాలని చెప్పారు. అలాగే ఈ పది రోజుల్లో మండల కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, రంగవల్లుల పోటీలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని అన్నారు. రోజూ సాయంత్రం ‘జన్మభూమి-సంక్రాతి సంబరాలు’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిలో చైతన్యం తీసుకురావాలని, హెల్త్ క్యాంపు, వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

అన్ని గ్రామాలకు సమన్వయకర్తలు

ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి ‘జన్మభూమి-మాఊరు’ను విజయవంతం చేయాలని, ప్రతీ గ్రామానికి ఒక కోఆర్డినేటర్ చొప్పున నియమించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ‘జిల్లా స్థాయి కమిటీలు’తో సమన్వయ పరుచుకోవాలని చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌లో ‘రాష్ట్రస్థాయి కంట్రోల్ రూం’ను సిద్ధంగా వుంచామని అన్నారు. ప్రతీ రోజూ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్‌లో అందుబాటులో వుంచుతున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

పంచాయతీలకు స్టార్ రేటింగ్

పల్లెల్లో మౌలికవసతుల కల్పనతో సరిపెట్టకుండా టెక్నాలజీ పరంగా ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గ్రామాలకూ స్టార్ రేటింగ్‌లు ఇవ్వాలని, మొత్తం 10 స్టార్లు కేటాయించి, వివిధ అంశాలకు సంబంధించి సాధించిన ఫలితాలు ఆధారంగా రేటింగ్ విధానం వుండాలని  అన్నారు. పంచాయతీల వారీగా ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది, ఎంతమందికి వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూర్చింది వంటి వివరాలతో సమగ్రంగా బుక్‌లెట్ ప్రచురించాలని నిర్దేశించారు. ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా ఏరువాక, జలసిరికి హారతి, వన మహోత్సవం, సూర్య ఆరాధన వంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply