ప్రపంచంలోనే అతి పెద్ద రేటింగ్ ఏజన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పి) భారత ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్ ను ‘పూర్’ స్థాయినుంచి మార్చడానికి ఇష్టపడలేదు. తాజా రేటింగ్ ప్రకటనలోనూ ఇంతకు ముందున్న బిబిబి-(మైనస్) స్థాయిని యధాతథంగా ఉంచింది. భారత క్రెడిట్ రేటింగ్ పై స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం మూడీస్ తన రేటింగ్ ను బిఎఎ3 నుంచి బిఎఎ2కి పెంచిన నేపథ్యంలో ఇతర ఏజన్సీలూ సానుకూలంగా స్పందిస్తాయని ప్రభుత్వం ఆశించింది.
అయితే బాండ్లకు అత్యంత తక్కువ స్థాయి రేటింగ్… బిబిబి- (మైనస్)నే కొనసాగిస్తూ ఎస్ అండ్ పి నిర్ణయం తీసుకుంది. 2007లో ఇండియాకు ఈ రేటింగ్ ఇచ్చిన ఏజన్సీ అప్పటినుంచీ అలాగే కొనసాగిస్తోంది. మధ్యలో పరిస్థితి నిలకడగా ఉందా.. ప్రతికూలంగా ఉందా? అన్న విషయంలో ట్యాగ్ లను మార్చినా రేటింగ్ మాత్రం బిబిబి- (మైనస్) వద్ద నిలకడగానే ఉంది.
తక్కువ తలసరి ఆదాయం, ఎక్కువ ప్రభుత్వ అప్పు జీడీపీ వృద్ధిని బ్యాలన్స్ చేస్తున్నాయని ఎస్ అండ్ పి తన తాజా ప్రకటనలో పేర్కొంది. వచ్చే రెండేళ్లలో వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందన్న సానుకూల వ్యాఖ్య చేస్తూనే… ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆర్థిక రంగంలో ఫలితాలను ఇస్తేనే రేటింగ్ బలోపేతమవుతుందని అభిప్రాయపడింది.
2016లో హఠాత్తుగా ప్రకటించిన నోట్ల రద్దుతో 2017లో జీడీపీ వృద్ధి, విశ్వాసం దెబ్బ తిన్నాయని ఎస్ అండ్ పి పేర్కొంది. బ్యాంకుల ఆర్థిక కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య వచ్చే రెండేళ్ళలో జీడీపీ వృద్ధి రేటు పెరగడానికి దోహదపడుతుందని అంచనా వేసింది. అదే సమయంలో..భారతీయ బ్యాంకులకు ఇప్పుడు 30 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది.
నోట్ల రద్దు, జీఎస్టీ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరిస్థితి అంత సమంజసంగా లేదని భావిస్తున్న తరుణంలో.. కొద్ది రోజుల క్రితం రేటింగ్ ఏజన్సీ ’మూడీస్‘ ఆశ్చర్యకరంగా ఇండియా రేటింగ్ ను పెంచింది. దీన్ని ప్రభుత్వం తమ సంస్కరణలకు లభించిన విజయంగా పేర్కొంది. స్టాండర్డ్ అండ్ పూర్స్ కూడా రేటింగ్ పెంచబోతోందన్న ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగా స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ఎస్ అండ్ పి రేటింగ్ అంచనాలకు భిన్నంగా వచ్చింది.