వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మట్ లో ఆహార, రిటైల్ దిగ్గజాలు భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. శనివారం డిల్లీలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెప్సి, కోకకోలా, అమేజాన్ వంటి ప్రపంచవ్యాప్త సంస్థలతోపాటు పతంజలి, ఐటీసీ వంటి దేశీయ దిగ్గజాలు పాల్గొన్నాయి. సుమారు రూ. 60 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందులో పెప్సి కంపెనీ అత్యధికంగా రూ. 13,340 కోట్ల పెట్టుబడికి హామీ ఇవ్వగా.. దాని ప్రత్యర్ధి కోక కోలా రూ. 11,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
మొత్తం ఒప్పందాలలో 13 ఇదివరకే పెట్టుబడి హామీలు ఇచ్చిన సంస్థలకు సంబంధించినవి. పెప్సి ఇండియాలో రూ. 35 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఎంఒయు కుదుర్చుకున్న మొత్తం అప్పటి ప్రకటనలో భాగమే. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో భాగస్వములతో కలసి రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెడతామని కోక కోలా గత జూలైలో ప్రకటించింది. ఐటీసీ సీఈవో సంజీవ్ పూరీ రూ. 10 వేల కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చారు. 12 రాష్ట్రాల్లో 20 వినిమయ వస్తువుల ఉత్పత్తి, లాజిస్టిక్స్ సదుపాయాల ఏర్పాటుకు ఐటీసీ ఒప్పందాలు కుదుర్చుకుంది.
వినిమయ వస్తువుల రంగంలో శరవేగంగా ముందుకొచ్చిన పతంజలి తాజాగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ షరాఫ్ గ్రూపు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలో రూ. 5,000కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చింది. అమేజాన్ కూడా ఫుడ్ రిటైల్ రంగంలో రూ. 3,450 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. పెప్సికో బెవరేజ్, ఫుడ్ ప్లాంటు ఏర్పాటుకు, కోక కోలా పండ్ల పరిశ్రమలో సప్లై చైన్ అభివృద్ధికి పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పాయి.