-
చంద్రన్న పెళ్ళి కానుక కింద పేద బీసీ జంటలకు రూ. 30 వేలు
-
201718లో 40 వేల పెళ్ళిళ్ళకు రూ. 120 కోట్లు అవసరం
-
రెండేళ్ళ తర్వాత ’టెన్త్ తప్పనిసరి’ నిబంధన
-
మంత్రివర్గ సమావేశంలో విధానానికి ఆమోదం
-
పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ’ఔట్ సోర్సింగ్’!
-
ఎంతమంది అవసరమో గుర్తించాలన్న సిఎం
రాష్ట్రంలోని బలహీనవర్గాల యువతీ యువకులకు పెళ్ళి సమయంలో రూ. 30 వేల రూపాయలు కానుకగా ఇవ్వాలన్న కొత్త పథకానికి మంగళవారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పేద బీసీలలో పెళ్ళికి చట్టబద్ధంగా నిర్దేశించిన వయసు (పురుషులైతే 21 సంవత్సరాలు… మహిళలైతే 18 సంవత్సరాలు) దాటినవారికి ’చంద్రన్న పెళ్ళి కానుక’ పేరిట ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. 2018 జనవరి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బలహీనవర్గాల యువతీయువకులు ఈ పథకంలో లబ్ది పొందుతారు.
అజెండాలో వున్న అన్ని అంశాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. వాటితో పాటు మరికొన్ని టేబుల్డ్ ఐటెమ్స్, స్టేటస్ రిపోర్టులపైనా సమీక్షించింది. అందులో ముఖ్యంగా… పంచాయతీరాజ్, రెవిన్యూ శాఖలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మానవ వనరుల నియామకాలు జరపాలన్న ప్రతిపాదన ఒకటి. దీనిపట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి… ఎంతమంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంకా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల సమాహారమిది.
ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ :
• రూ. 40 కోట్లతో ‘ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ’ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• ఏపీ ఎన్నార్టీల సంక్షేమం, రక్షణ, పునరావాసం కోసం సమగ్రంగా ఈ పాలసీ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు దీనిద్వారా ప్రయోజనం పొందుతారు.
• ప్రవాసాంధ్రులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి తగినంత ఆదాయం ఆర్జించేలా చర్యలు తీసుకుంటారు.
• ఏపీఎన్నార్టీల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌లో వారు పెట్టుబడులు పెట్టేలా చూస్తారు. విదేశాలకు వెళుతున్న వారికోసం 24 X 7 హెల్ప్ లైన్ ఏర్పాటుచేస్తారు.
• ఏపీ ఎన్నార్టీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీములో ప్రమాదవశత్తూ చనిపోయినా, అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షలు సహాయం అందుతుంది.
• ప్రవాసాంధ్ర సహాయ నిధి కూడా ఏర్పాటుచేస్తారు. విదేశాల్లో వుండే, లేదా స్వదేశానికి తిరిగివచ్చే ప్రవాసాంధ్రులకు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటే వారి తక్షణ అవసరాలను తీర్చడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది.
• రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది.
• ఎంపికచేసిన మున్సిపల్ పాఠశాలలలో వర్చువల్ క్లాస్ రూమ్స్ విధానాన్ని అమలుచేస్తారు.
• ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 160 కోట్లు.
• డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.
• ఈ సంవత్సరం చివరినాటికి మొదటిదశగా అన్ని ఉన్నత పాఠశాలల్లో వర్చువల్ క్లాసురూమ్స్ కలిగి వుండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. రెండవ దశలో అన్ని స్కూళ్లల్లో వర్చువల్ క్లాసురూమ్స్ ఉండాలని నిర్దేశం.
• వర్చువల్ క్లాస్‌రూమ్స్‌కు అవసరమైన కంటెంట్ తయారుచేసే పని విద్యాశాఖకు అప్పగింత. తగిన బృందాలను ఏర్పాటుచేసుకుని కంటెంట్ సిద్ధం చేసి, పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలని సూచన.
• జీఐసీ పాలసీ 2017-2020 నిబంధనలు సడలించాలని ఎఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ ఇండియా ప్రై.లిమిటెడ్ వారు చేసుకున్న అభ్యర్థనకు మంత్రిమండలి ఆమోదం.
• ఒక ఎకరా విస్తీర్ణంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణాలు చేయాలన్న నిబంధనలు సడలించి 50 వేల చదరపు అడుగులకు పరిమితం చేయాలని ఎఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ ఇండియా ప్రై.లిమిటెడ్ గతంలో చేసిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
• అలాగే, ఒక ఎకరానికి రూ. 50 కోట్లు కనీస పెట్టుబడి ఉండాలన్న నిబంధన సడలించి ప్రాజెక్టు మొత్తానికి రూ. 500 కోట్లు పెట్టుబడి పెడతామని సంస్థ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• దేశంలోని ప్రముఖ గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్ కంపెనీల్లో ఏ.ఎన్. ఎస్.ఆర్ కంపెనీ ఒకటి.
• ఏ.ఎన్.ఎస్.ఆర్. రాకతో రానున్న 6 సంవత్సరాల్లో 10 వేల ఉద్యోగాలు, వెయ్యి కోట్ల పెట్టుబడులు విశాఖకు రానున్నాయి.
• అగ్రిమెంట్ సైనింగ్‌లో భాగంగా మధురవాడ ఐటీ సెజ్‌లో 10 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ఏ.ఎన్.ఎస్.ఆర్ కంపెనీకి కేటాయించనుంది.
• కృష్ణా పుష్కరాలకు ముందు చేపట్టిన పోలవరం కుడి ప్రధాన కాలువ రహదారి నిర్మాణం కోసం అంచనాల్లో సవరణ చేస్తూ మంత్రిమండలి ఆమోదం.
• 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల కంటే 4.85 శాతం తక్కువకు నామినేషన్ ప్రాతిపదికన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తూ ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ ప్రతిపాదనలకు ఆమోదం.
• రూ. 39.67 కోట్ల విలువైన పనులను మంజూరుచేస్తూ 6.12.2016న ప్రభుత్వ ఉత్తర్వులు.
• కృష్ణాజిల్లా గొల్లనపల్లి నుంచి నున్న వరకు ఐదో నెంబర్ జాతీయరహదారి నుంచి తొమ్మిదో జాతీయ రహదారిని అనుసంధానం చేసే నాలుగు వరసల బైపాస్ రోడ్డు పనులివి.
• ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్, 2017 డ్రాఫ్టుకు మంత్రిమండలి ఆమోదం. దీనివల్ల రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం మరింత మెరుగవుతుంది. పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు అవసరమైన సేవలు త్వరితగతిన పూర్తవుతాయి. సేవలు అందించవలసిన సంస్థలు జాప్యం చేసినట్టయితే వాటికి జరిమానాలు విధిస్తారు.
• చిత్తూరు జిల్లాలో ‘మోడ్రన్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టైర్ మ్యాన్యుఫాక్చరింగ్ ప్లాంట్’ ఏర్పాటు కోసం భూ కేటాయింపు పొందిన అపోలో టైర్స్ లిమిటెడ్ కోరిన మినహాయింపులకు మంత్రిమండలి ఆమోదం. ప్లాంటు ఏర్పాటులో జాప్యం జరిగినందుకు విధించిన అపరాథ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తారు. ఆ మినహాయింపులు ఇవీ: A. కేటాయింపు ఉత్తరం పొందిన 10 పనిదినాల్లోగా ఎలాంటి వడ్డీ లేకుండా జరిమానా చెల్లింపు. (వడ్డీ రద్దుతో రూ.79,28,680 లక్షలు). B. భూ కేటాయింపు పొందిన కంపెనీ కర్మాగారం ఏర్పాటుకు కావాలసిన అనుమతులు పొందడంలో జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లింపు లేకుండా కాలపరిమితి పొడిగింపు. C. భూ యజమానికి చెల్లించాల్సిన నష్టపరిహారం సొమ్ము పెంచుతూ సివిల్ కోర్టులు ఆజ్ఞాపిస్తే ఆ నష్టపరిహారం సొమ్ము భూ కేటాయింపు పొందిన వారే చెల్లించాలి. D. రూ.7,28,680 రూపాయల వడ్డీ రద్దు (16%). కంపెనీ భూమి పొందినట్లుగా కేటాయింపు పత్రం తీసుకున్న 90 రోజుల్లోగా చెల్లించలేదు. భూకేటాయింపు పొందిన కంపెనీ తాజాగా పది రోజుల్లోగా జాప్యం జరిగినందుకు ఎటువంటి వడ్డీ చెల్లించకుండా అసలు చెల్లించాలని ప్రతిపాదించింది.
• గ్రీన్‌ఫీల్డ్ ఎం&హెచ్.సి.వి ఉత్పాదక ప్రాజెక్టు ఏర్పాటుకు అశోక్ లేల్యాండ్ కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలకు ఆమోదం. ప్రోత్సాహకాలు : పదేళ్లపాటు 100% నెట్ SGST రిఇంబర్స్‌మెంట్‌కు అవకాశం. ప్రాజెక్టులో శిక్షణ వ్యయం ఒక్కొక్కరికి నెలకు రూ. 10వేలు. (శిక్షణ, ఉపాధి పొందిన వారికి). అనుబంధ యూనిట్ల స్థాపనకు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి. అశోక్ లేల్యాండ్ లిమిటెడ్‌కు ఎకరా ఒక్కింటికి రూ.16.50 లక్షల వంతున 50 ఎకరాలు, ఆర్.వి.ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు 25 ఎకరాలు కేటాయింపు.