2018నాటికి ప్రాజెక్టు పూర్తి కాదు
నిర్మాణ పనుల సందర్శన అనంతరం వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేాయలని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘పెట్టిన ఖర్చుకంటే ఎక్కువ తినేశారని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో సందేహం ఉంది. నిధులు దారి మళ్ళించారనే ఆలోచనతో నిధులనూ నిలిపివేశారు. వాళ్లు లెక్కలు చెప్పమంటున్నారు. అవకతవకలు లేనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పవచ్చు కదా… అందులో మనం ఆలోచించవలసింది ఏముంది? లెక్క చెప్పమంటే.. మరి తిన్నదేం చేయమంటారన్న సామెతలా ఉంది. మీరు నీళ్ళు నమిలేకొద్దీ కేంద్రానికి బలం వస్తుంది. ప్రాజెక్టును ఆపేస్తుంది. ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళదు. తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేం చెబుతున్నానంటే… మీరు అవకతవకలు చేయనప్పుడు దయ చేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ కాకుంటే మనం ఫైట్ చేయవచ్చు. ఎందుకు నిధులు ఆపేశారని కేంద్రంపై పోరాటం చేయవచ్చు. అలా చేయాలంటే మనవైపు తప్పు ఉండకూడదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.
గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన పవన్… అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు పునరావాస వ్యయం 3 వేల కోట్లనుంచి 30 వేల కోట్లకు పెరిగింది. కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే ఆ విషయాన్ని బల్ల గుద్ది చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గితే మాత్రం కేంద్రానికే కాదు…నాకుకూడా సందేహం వస్తుంది. కేంద్రంతో గొడవ పెట్టుకోవాలంటే ముందు మన బంగారం మంచిదై ఉండాలి’ అని పవన్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల నేపథ్యంలో బుధవారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనలను విజయనగరం జిల్లాతో జన సేనాని ప్రారంభించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని బుధవారం పరామర్శించిన పవన్, గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలవరంపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ సూచించారు. 2018 నాటికి ప్రాజెక్టునుంచి నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసినప్పుడు…అప్పటికి ప్రాజెక్టు పూర్తి కాదని ఉద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకోసం ఏ పార్టీ వాడుకోకూడదన్న పవన్, ఈ విషయంలో టీడీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు చాలా కష్టమైన పని అన్న పవన్, దశాబ్దాల కాలంపాటు నిర్మాణం జరగకపోవడంవల్ల రూ. 125 కోట్లనుంచి వ్యయం 58 వేల కోట్లకు పెరిగిందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తానొక్కడినే మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ‘హోదాపై నేనొక్కడినే మాట్లాడాలా… మీతో పోలిస్తే నేను చాలాా చిన్నపిల్లవాడిని రాజకీయాల్లో’ అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేరు ప్రస్తావిస్తూ… ‘ఆయన భార్య కేంద్రంలో మంత్రి కదా? పైగా ఆమె రాష్ట్రంనుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు… హోదాపై ఎందుకు కేంద్రంలో మాట్లాడటంలేదు’ అని పవన్ ప్రశ్నించారు. బయటఉన్న తాను సమస్యలను ఎత్తిచూపించి పరిష్కారానికి కృషి చేస్తుంటే.. అసెంబ్లీలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంత చేయవచ్చని ప్రశ్నించారు.
డబ్బు లేకుండా రాజకీయాలు ఎలా చేయవచ్చో తాను చూపిస్తానని పవన్ చెప్పారు. ‘ఊహించనివి చాలా జరుగుతాయి.. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఓ ముఖ్యమంత్రి కొడుకు ఏడాదిపాటు జైల్లో ఉంటాడని ఎవరైనా ఊహించారా? అలాగే ఊహించనివి జరుగుతాయి. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం ఎలాగో చూపిస్తా’ అని పవన్ ధీమాగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్థలం వద్ద ‘జై పవర్ స్టార్’, ‘సిఎం’ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులను పవన్ వారించారు. ప్రాజెక్టు ఎస్ఇ రమేష్ బాబు నిర్మాణ పనులు జరుగుతున్న తీరును వివరించారు.