ఆన్ లైన్ లో టెండర్ షెడ్యూళ్ళు
దాఖలుకు 20వరకు గడువు
ప్రతి సోమవారం పోలవారంగా మార్చకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ఇప్పుడు కేంద్రంపై పోల‘వార్’ ప్రకటించారు. కొత్త టెండర్ ప్రక్రియను నిలిపివేయాలన్న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జీత్ సింగ్ ఆదేశాలను తోసిరాజని.. స్పిల్ వే పనులకు కొత్త టెండర్ల షెడ్యూలును కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ వల్ల జాప్యం జరుగుతుండటంతో… స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను ప్రత్యేక టెండర్ ద్వారా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టెండర్లను ఆహ్వానించిన తర్వాత… ఆ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా అమర్ జీత్ మూడు రోజుల క్రితం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి టెండర్ల ప్రక్రియను గురువారం సమీక్షించారు.
టెండర్ ప్రక్రియను ఆపకూడదని నిర్ణయించిన సిఎం.. అమర్ జీత్ లేఖలో లేవనెత్తిన సాంకేతికాంశాలను మాత్రం చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో.. టెండర్ల దాఖలకు తక్కువ గడువు ఇవ్వడం, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయకపోవడం వంటి లోపాలను సవరించే పనిని అధికారగణం గురువారమే చకచకా పూర్తి చేసింది. తాజా నిర్ణయం ప్రకారం డిసెంబర్ 20వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చిన అధికారులు… టెండర్ షెడ్యూళ్ళను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. తద్వారా టెండర్ల ప్రక్రియను నిలిపివేసేది లేదని, కొద్దిపాటి మార్పులతో ముందుకే వెళ్తామని స్పష్టం చేసినట్టయింది.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ. 1398 కోట్ల విలువైన నిర్మాణ పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్నె మూడో వారంలోవిడిగా టెండర్లను ఆహ్వానించింది. దీనికి ముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి సమావేశమై సహకారం కోరారు. అయితే, అనూహ్యంగా ఆ శాఖ కార్యదర్శినుంచి ప్రతికూలమైన తాఖీదు మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గురువారం అసెంబ్లీలో వెల్లడించారు.
ఇంతకు ముందు నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఈ నాలుగో తేదీ వరకే టెండర్ దాఖలుకు గడువు ఉంది. తాజా షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 20వ తేదీవరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. 21న సాంకేతిక బిడ్లను, 23న ఆర్థిక బిడ్లను తెరచి కాంట్రాక్టర్ల అర్హతలను సమీక్షిస్తారు.