ప్రజల సమక్షంలోనే జగన్ సమాధానం చెప్పాలి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్
ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు రావడంపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళావెంకట్రావు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కళా, పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉన్న జగన్… వారి సమక్షంలోనే ప్యారడైజ్ పేపర్లపై సమాధానం చెప్పాలని కోరారు. జగన్ అవినీతి రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు.
పాదయాత్ర చేస్తే సిఎం అయిపోతాననే భ్రమలో జగన్ ఉన్నారని కళా ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారనుకుంటే, అందరూ అదే పని చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పేరుతో తన ఎంపీలతో గత జూన్ లో రాజీనామా చేస్తానని జగన్ ప్రకటించారనని, ఇప్పటివరకూ దానిపై మాట్లాడడంలేదని ఆక్షేపించారు. తన ఎంపీల చేత ఎప్పుడు రాజీనామా చేయిస్తారని మంత్రి ప్రశ్నించారు. ప్రజాజీవితంలో కొనసాగాలనుకునే వ్యక్తి నైతిక విలువలతో ఉండాలన్నారు.
అసెంబ్లీని వైకాపా బహిష్కరించడంతో, సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చకు అవకాశం కలిగిందని కళా అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఉన్నా లేకున్నా నిబంధనల ప్రకారం సభ నిర్వహణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీకి ఏపీ జెన్ కో, ట్రాన్ కో విరాళంగా ఇచ్చిన రూ.61.43 లక్షల చెక్ ను సొసైటీ ప్రతినిధులకు మంత్రి మంగళవారం అందజేశారు.