కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీ అని అభయం
మోడీ రెండు ఇండియాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్య
‘‘ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు’’ అనే పాచికను ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఎత్తులు వేస్తున్నారు. దేశంలోని ‘‘ప్రతి పేదకూ కనీస ఆదాయం గ్యారంటీ’’గా కల్పిస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ ఫలితం ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు.
చత్తీస్ గఢ్ లోని రాయపూర్ నగరంలో జరిగిన ‘‘కిసాన్ ఆధార్ సమ్మేళన్’’లో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. 15 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు చత్తీస్ గఢ్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కొంతమంది రైతులకు రుణ మాఫీ పత్రాలను అందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు ఇండియాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించిన రాహుల్ ‘‘ఒకటి రాఫేల్ కుంభకోణం, అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మేహుల్ చోక్సిలది కాగా… మరొకటి పేద రైతులది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఓ చారిత్రాత్మక నిర్ణయానికి నాంది పలికింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం కనీస ఆదాయానికి గ్యారంటీ ఇస్తుంది. దానర్ధం… ఇండియాలోని ప్రతి పేద వ్యక్తీ కనీస ఆదాయాన్ని పొందుతారు. అంటే ఇకపైన ఆకలి బాధ ఉండదు. పేదలే ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.
గత నెలలో జరిగిన చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 సీట్లను (మొత్తం 90) గెలుచుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘‘రైతు రుణ మాఫీ’’కి హామీ ఇచ్చారు.
2004లో అధికారంలోకి వచ్చినప్పుడు యుపిఎ ప్రభుత్వం ‘‘ఉపాది హామీ’’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్ ఇస్తున్న ‘ఆదాయ హామీ’… ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లో ఉన్న ‘యూనివర్శల్ బేసిక్ ఇన్ కం’ పథకం తరహాలోనే ఉంది. ఆదాయ హామీతో ఎన్నికలకు వెళ్ళడం ఫలితాన్ని ఇస్తుందో లేదో వేచి చూడాలి.