ప్రధాని పదవి ఆశ లేదు : చంద్రబాబు

1 0
Read Time:7 Minute, 1 Second
పెద్ద పదవి వద్దు,  పెద్దమనసుతో తోడ్పడండి..
వనరులన్నీ అందిస్తా…పెట్టబడులతో రండి..

రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం
గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కార్పొరేట్ గవర్నెన్స్ లో చంద్రబాబు సతీమణికీ అవార్డు

తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. బుధవారం రాత్రి లండన్ నగరంలో జరిగిన గోల్డెన్ పీకాక్ అవార్డలు ప్రదానోత్సవ సభలో ఆయన ఈ అంశాలపై మట్లాడారు. తనకు పెద్ద పదవులు అక్కర్లేదన్న చంద్రబాబు… పెద్దమనసుతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే చాలని ఆ కార్యక్రమానికి హాజరైన పారిశ్రామిక ప్రముఖులను ఉద్దేశించి చెప్పారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ లండన్ నగరంలో 25వ తేదీనుంచి 27 వరకు నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ‘లీడర్‌షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్’ విభాగంలో ముఖ్యమంత్రికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డు అందుకుంటే.. కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ఆయన సతీమణి భువనేశ్వరి అవార్డు అందుకోవటం విశేషం.

‘నాకు ఒక అవార్డు ఇచ్చారు. నా సతీమణి మరో అవార్డు స్వీకరిస్తోంది. ఒకటి కార్పొరేట్ రంగం నుంచి, మరొకటి పబ్లిక్ సెక్టర్ నుంచి రెండు అవార్డులు మాకు లభించడం అరుదైన అవకాశం’

వీరితోపాటు భారతి సంతతికి చెందిన యుకె మంత్రి ప్రీతి పటేల్ ’పబ్లిక్ సర్వీస్, యుకె-ఇండియా ఆర్థిక సంబంధాలు’ అనే అంశంపై మరో అవార్డును అందుకున్నారు. ప్రీతీ పటేల్ తో అంతకు ముందే సమావేశమైన ముఖ్యమంత్రి… ఆమెతో రాష్ట్రాభివృద్ధిపై సంభాషించినట్లు చెప్పారు. తమదొక ప్రాంతీయ పార్టీ అని, తాను ఆ పార్టీకి అధ్యక్షుణ్ణి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని పేర్కొన్న చంద్రబాబు, ప్రధాని పదవికి ఆశావహుల్లో తాను లేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా, నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇక్కడ హాజరైన వాణిజ్య, కార్పొరేట్ల మద్దతు కావాలని కోరారు.

‘మీరు మీ వాటాదార్లతో జవాబుదారీతనంతో ఉండాలి. నేను గవర్నమెంట్ లో నా షేర్ హోల్డర్స్ అయిన సాధారణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. కార్పొరేట్ సెక్టార్లో మీరు ఎండీలుగా కొంత కాలం ఉంటారు. కానీ రాజకీయనాయకులకు ప్రతి ఐదేళ్లకు ఎన్నికల పరీక్షలే’ అని చంద్రబాబు అన్నారు.

 రెండంకెల వృద్ధి మాకే సాధ్యం

భారత్ కు సంప్రదాయంగా వస్తున్న బలాబలాలున్నాయని, జనాభా రీత్యా అనుకూలత ఉందని సిఎం చెప్పారు. ‘మా దేశంలో  ఆంగ్లం మాట్లాడే వాళ్లు ఎక్కువ. అది బ్రిటిషర్ల పరిపాలనా ప్రభావం. మీరు మాకు ఇంగ్లీషునిచ్చారు’ అని నవ్వుతూ అన్నారు. సాంకేతికతలో తామెంతో బలంగా ఉన్నామని, గూగుల్, మైక్రోసాఫ్ట్ లేదా ఇతర ఐటి కంపెనీల్లో అత్యధికులు భారతీయులేనని పేర్కొన్నారు. విదేశాల్లో భారతీయులు నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఆంధ్రప్రదేశ్ వారు ఒక్కరున్నారు. ఇటీవలే  తమరాష్ట్రం విడిపోయిందని, తన హయాంలో సైబరాబాద్‌ను నిర్మించి నాలెడ్జి ఎకానమీతో లక్షల మందికి ఉపాధి కల్పించానని చెప్పారు.

విభజనానంతరం తమదే కొత్త రాష్ట్రంలా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మూడేళ్లనుంచి కష్టపడుతున్నానని, అసాధ్యమని భావించిన అన్నింటిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్‌ ప్రకారం రాష్ట్రాన్ని 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ గా నిలుపుతానన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రాతిపదికన పాలనపై అత్యధిక  సంతృప్తి సాధించే దిశగా రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాన్నారు. తాను ముఖ్యమంత్రిని అయినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉంటే 3 నెలలకే  మిగులు సాధించామని వివరించారు.

పెట్టుబడులు తెండి

‘మీరు వచ్చి పెట్టబడులు పెడితే మా దగ్గర అత్యంత ప్రతిభ చూపే మానవనరులున్నాయి, మీకు విద్యుత్తునిస్తాం, నీరిస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా రాష్ట్రం సెంబర్-1’ అని చంద్రబాబు వివరించారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తన బాధ్యతలను మరింత గుర్తు చేస్తోందని అన్నారు. పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు చెబుతూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు. సభలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్ , ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
50 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Leave a Reply