-
విత్తనాభివృద్ధిలో ఐయోవా, ఆంధ్రప్రదేశ్ కలిస్తే అద్భుతాలు..
-
యోవా యూనివర్శిటీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు జిల్లా తగడంచ దగ్గర ఏర్పాటు చేయనున్న మోగా సీడ్ పార్కును ప్రపంచ స్థాయి విత్తన పరిశోధన, అభివృద్ధి సంస్థగా ఏర్పాటు చేస్తామని, ఈ కేంద్రం రాష్ట్ర, దేశీయ అవసరాలు తీర్చేది మాత్రమే కాదని, ప్రపంచానికే మేలురకం విత్తనాలు అందించే సంస్థగా రూపొందాలని అభిలషిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
డెమోయిన్స్ లోని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో ఏర్పాటు చేసిన మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ విత్తనాభివృద్ధిలో అనేక దేశాలకు మార్గదర్శనం చేస్తున్న ఐయోవా యూనివర్శిటీ, వ్యవసాయం, ఉద్యానపంటల రంగ ప్రగతిలో ముందుకెళుతున్న ఆంధ్రప్రదేశ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. ‘హబ్ అండ్ స్పోక్స్’ విధానంలో ‘మెగా సీడ్ పార్కు’ను అభివృద్ధి చేస్తాం. కర్నూలు హబ్‌గా ఉంటుందని, మిగిలిన కేంద్రాలు కర్నూలు హబ్‌కు అనుసంధానంగా ఉంటాయన్నారు. కేవలం రాష్ట్ర అవసరాలకే కాదు. ప్రపంచ అవసరాలు తీర్చేవిధంగా సీడ్ పార్కును తీర్చిదిద్దటం తమ ధ్యేయమని, అందుకు అయోవా స్టేట్ యూనిర్శటీ సంపూర్ణ సహకారం కోరుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో నెలకొల్పనున్న మెగాసీడ్ పార్కుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని, ఈ ప్రాజెక్టు ఏ ఇబ్బందీ లేకుండా మనుగడ సాగించాలి, లాభసాటిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన పంటల్ని విస్తరించి, వైవిధ్య పంట విధానాలను అనుసరిస్తున్నామని తెలిపారు.
దేశంలోనే ఉత్తమ వ్యవసాయ రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే తమ సంకల్పంమని అన్నారు. అందుకే ప్రపంచశ్రేణి ప్రమాణాలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, అది సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలబడాలన్నదే తుది ఆలోచన అని చంద్రబాబు వివరించారు.
కాలానుగుణంగా మారిన ఆహారపుటలవాట్లను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా పంటలను పండించాలన్నదే తమ ఆలోచన అని చంద్రబాబు వివరించారు. ఆహార భద్రత, విత్తన భద్రత అవిభాజ్యమైనవని అన్నారు. సీడ్ పార్కు ఏర్పాటుకు భారతప్రభుత్వం నుంచి కొంత సహాయం తీసుకుంటామని, సొంతంగానే కొన్ని నిధులు సమకూర్చుకుంటమని, స్థిరంగా ఈ విత్తన కేంద్రం మనుగడ సాగించాలన్నదే తమ ఆలోచన అని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు సుస్థిరంగా కొనసాగడానికి ఇదొక్కటే చాలదు. ఉత్తమ పరిశోధనా సంస్థలు అక్కడికి రావాల్సి ఉందని అన్నారు. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని, సానుకూల వ్యవస్థను నిర్మిస్తామని తెలిపారు.
ఆదర్శ, అనుసరణీయ వ్యవసాయం ఎలా ఉండాలో చాటడానికి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనాగా నిలవాలన్నదే తమ లక్ష్యమని, వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సదస్సు నిర్వహించబోతున్నామని, ఈ సదస్సుకు బిల్‌గేట్స్, మిలిందా గేట్స్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలకు, మానవ వనరులకు కొదవలేదన్నారు. పుష్కలంగా నీరు, విద్యుత్తు, నైపుణ్యంతో కూడిన మంచి మానవ వనరులు ఉన్నాయని, మరోవైపు ప్రగతిశీలురైన రైతులున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తమ రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని, సుపరిపాలన ఉందని చెప్పారు.
వ్యవసాయ నాలెడ్జ్ బ్యాంక్ యోచన
వ్యవసాయరంగంలో నాలెడ్జ్ బ్యాంక్ నెలకొల్పాలని భావిస్తున్నట్లు, ఏటికేడాది అభివృద్ధి సాధించి రానున్న ఇరవై సంవత్సరాలలో 20% వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయోవా సదస్సులో స్పష్టం చేశారు. ఈరంగంలో అందుబాటులోకి వచ్చిన వైజ్ఞానిక పరికరాలు, ఆధునిక సదుపాయాలన్నీ తాము వినియోగించుకుంటున్నామని ఏసీ సీం అన్నారు.
వాస్తవ సమయంలో వర్షపాత నమోదు వివరాలు తెలుసుకోగలుగుతున్నట్లు చెప్పారు. భూమిలో తేమ శాతాన్ని కనుగొని కరవు నివారణకు ముందస్తుగా సిద్ధమయ్యే చర్యలను తాము తీసుకోగలుగుతున్నామని చంద్రబాబు చెప్పారు.వ్యవసాయరంగంలో డ్లోన్లను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఏపీలో ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి వస్తే మీరు ఐయోవా నుంచి తమ రాష్ట్ర రైతులతో నేరుగా మాట్లాడవచ్చని చంద్రబాబు అన్నారు.
మూడు నెలల స్వల్ప వ్యవధిలో ఇక్కడికి వచ్చానని, వ్యవసాయ రంగానికి, రైతాంగ సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తోందో దీన్ని అనుసరించే అర్ధం చేసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. ‘రాష్ట్రంలో రైతులు ఆహార పంటలను పండిస్తున్నారు. కానీ వారికి తిరిగి మంచి ఆదాయం రావటం లేదు. తగినంత లాభాలూ రావడం లేదు’ ఈ పరిస్థితిని మార్చడమే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక దార్శనిక విధానం తీసుకుని తాము గతంలో వ్యవసాయక ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా ఉండే రాష్ట్రాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌లో సుస్థిర వ్యవసాయాభివృద్ధి దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయంపై బాధ్యతతోనే రూ. 24 వేల కోట్ల రుణమాఫీ
రైతాంగ రుణాలను మాఫీ చేయడానికి దేశంలో ఎక్కడా, ఎప్పుడూ ఇవ్వనంత రికార్డు స్థాయిలో రూ.24 వేల కోట్ల మేర కేటాయించామని, మిగులు వనరులు లేకపోయినా, వ్యవసాయరంగంపై బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుని ధైర్యంగా ముందుకు పోగలిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించాలని భావిస్తున్నట్లు వివరించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, అర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వాహకాధికారి జాస్తి కృష్ణ కిశోర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టిని గుర్తించాం
– ఐయోవా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్
ముఖ్యమంత్రి చంద్రబాబును ఐయోవా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ సాదరంగా ఆహ్వానించారు. ప్రపంచ ఆహార పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మెగా సీడ్ పార్కుపై మాట్లాడుతూ భారతదేశం మొత్తం మీద ఆకలి, ఆహార భద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించినట్టు తెలిపారు. విద్యా, పరిశ్రమ, ప్రభుత్వ పాలన వ్యవస్థలతో పరస్పర సహకారానికి, సరికొత్త బంధానికి ఏపీని ఆహ్వానిస్తున్నట్టు ఐయోవా గవర్నర్ ప్రకటించారు. ఐయోవా, ఏపీ మధ్య నెలకొన్న సరికొత్త భాగస్వామ్యానికి ఈ వేడుకే నాంది అని గవర్నర్ అభివర్ణించారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వ్యవసాయ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. కార్యక్రమానికి ఒకరోజు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అక్కడి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి బృందానికి వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్లు వివరించారు.
ఐయోవా వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్లు ప్రొ. గ్రెగ్ ల్యూకే (Greg Luecke), ప్రొ. జిమ్ అలివర్ తమ కేంద్రంలోని వివిధ విభాగాలను గురించి వివరించారు. అయెవా యూనివర్శిటీకి చెందిన ప్రొ. మంజిత్ మిశ్రా, లిసా షెన్ (Lisa Shen), ప్రొ. జో కొలెట్టి (Prof Joe Coletti), మైఖేల్ స్తార్ (Michael Stahr), జాఫ్రీ వోల్ట్ (Jeffrey Wolt), హెలెన్ రాండల్ ( Helen Randall), జొసాన్నె సిక్స్ (Josanne Six) పాల్గొన్నారు.
ప్రొ.మంజిత్ మిశ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందానికి స్వాగతం పలుకుతూ ఐయోవా స్టేట్ యూనివర్శిటీకి, ఆంధ్రప్రదేశ్ సహకారం చాలా ముఖ్యమైన దశలో ఉందని, ఈ దిశగా ఏపీలో సీడ్ పార్కు ఏర్పాటు ఉత్పాదకత పెంపుదలకు, ఆకలి మంటలు తగ్గించడానికి, మరింత పోషకాహారం అందజేయడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు లో మనం సమ భాగస్వాములమని జో కొల్లెట్టి (Joe colletti) అన్నారు.