ప్రవాసాంధ్రులూ.. మద్ధతివ్వండి

రాష్ట్రానికి మీ డబ్బు ఇమ్మని అడగడం లేదు
ఆలోచనలు, అనుభవాలు జన్మభూమికి పంచండి
అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి
అమరావతినుంచి ఎమిరేట్స్ కు నేరుగా విమాన సర్వీసు
గల్ఫ్ లోని ఆంధ్రులతో దుబాయ్ లో చంద్రబాబు భేటీ
ఏపీ ఎన్ఆర్టీలో భాగస్వాములు కావాలని పిలుపు

ప్రతి ప్రవాసాంధ్రుడూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి కావాలని, అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం సుస్థిరత సాధించడానికి మద్ధతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకొని దుబాయ్ చేరుకున్న సిఎం శనివారం నాడక్కడ ప్రవాసాంధ్రుల సంస్థ ఎన్ఆర్టీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు.

రాష్ట్రానికి మీ డబ్బులు వెచ్చించాలని అడగడంలేదు. మీ ప్రాంత అభివృద్ధి కోసం తగిన సలహాలు, ఉత్తమ పద్ధతులు, సాంకేతికతను తీసుకురావాలి. నిధుల కంటే ఆలోచనలు ముఖ్యం. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తుంది. ప్రభుత్వానికి సహకరించడమే మీ పని. నాయకత్వం వహించి మీ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వండి’

సంక్షోభ కాలంలో అధికారంలోకి వచ్చి సమస్యల సుడిగుండం నుంచి రాష్ట్రాన్ని బయటికి తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. విభజననాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉంటే..ఏడాదికే మిగులు సాధించామన్నారు. రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటుతో ప్రయాణం ఆరంభమైందని, అన్ని సమస్యలను అధిగమిస్తూ కేంద్ర సహాయంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

ఇప్పటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించాలంటే రాష్ట్రానికి మరోసారి సుస్థిర ప్రభుత్వ అవసరం ఉందని, అందుకు అందరూ తనకు సహకరించాలని కోరారు. రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు మద్దతుగా నిలవని పక్షంలో రాష్ట్రం కష్టాల్లో పడుతుందని చంద్రబాబు చెప్పారు.

‘రాష్ట్రంలో మూడేళ్ల నాడు మీమీ గ్రామాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేమెలా మార్చేవేశామో వెళ్లి బేరీజు వేసుకోండి’ అని సీఎం ప్రవాసాంధ్రులకు సూచించారు. ‘దుబాయ్ బాగుందా, విశాఖ బాగుందా?’ అని ప్రశ్నిస్తే ఓ అమ్మాయి విశాఖ బాగుందని సమాధానమిచ్చిందని, ఇది తనకెంతో గర్వకారణమని సిఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను సైతం అధునాతనంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ఫైబర్ నెట్, డ్రోన్లు వంటి అధునాతన సాంకేతికతను, పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు.

‘ఏపీలో 80% ప్రజలు తృప్తిగా ఉండాలనే లక్ష్యంతో సమస్యలను రియల్ టైమ్ లో పరిష్కరిస్తున్నాం. రాజకీయంగా కూడా నూటికి 80% తమ పార్టీనే ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న అభివృద్ధి కోసం సుస్థిర ప్రభుత్వం రావాలి. మళ్లీ మాకు సహకరించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఇచ్చిన ప్రజలు… ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టారని అభిప్రాయపడ్డారు.

అమరావతి రూపంలో ఒక సుందర రాజధానిని తీర్చిదిద్దే అవకాశం తనకు వచ్చిందంటూ…ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని అభయమిచ్చారు. అమరావతి నుంచి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుందని సభికుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు.

ఎడారిలా ఉన్న దుబాయ్‌ని ఇక్కడ అంతా కలసి భూతల స్వర్గంగా మార్చారని, అదే తమకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఇక్కడ నీళ్లు లేవు, ఉష్ణోగ్రతలు ఎక్కువ, నివాసయోగ్య వాతావరణం ఉండదు, అయినా మీరంతా కష్టపడి ఈ దేశ రూపురేఖలు మార్చారు. చమురు, సముద్రం తప్ప ఏమీ లేవు. ఆ ఉప్పునీటిని మంచినీటిగా మార్చాలి. విద్యుత్తు లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఉన్న దుబాయిని స్వర్గంగా చేశారు. ఇదొక సంకల్పం తప్ప మరొకటి కాదు’ అని చంద్రబాబు అన్నారు.

‘మీరు కష్టపడి ఇక్కడి నుంచి మీ మీద ఆధారపడిన మీ వాళ్లకు డబ్బు పంపిస్తున్నారు’ అంటూ ప్రశంసించారు. మన రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో విదేశాల్లో ఉన్న మనవాళ్లు 25 లక్షలమంది ఉన్నారని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనవాళ్లున్నారని, ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఇది తనకు ఎంతో గర్వకారణం గా ఉందని చంద్రబాబు కొనియాడారు. ప్రతి 20 మంది ఆంధ్రులలో ఒకరు విదేశాల్లో ఉన్నారని, ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్నారని, అది మన శక్తియుక్తులకు నిదర్శనమని పేర్కొన్నారు. అదే సమయంలో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసాలకు గురై బాధపడుతున్నవారున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ఆర్టీలో అంతా భాగం కావాలి

ప్రవాసాంధ్రులంతా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు (ఎన్ఆర్టీ)లో భాగం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసులకు సాధ్యమైనంతగా ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసమే తాను అధికారంలోకి రాగానే ఏపీ ఎన్నార్టీని నెలకొల్పానని చంద్రబాబు చెప్పారు.

‘నేనొక్కటే ఆలోచన చేశాను. ఏపీలో ఉండే తెలుగువారే కాకుండా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా వాళ్లందరికీ నేను ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా వారిని ఆదుకోవాలని నిశ్చయించాను. ఇప్పటికి 109 దేశాల్లో ఏపీ ఎన్నార్టీలోకి 45,000 మంది వచ్చారు. ఏపీ ఎన్.ఆర్.టీ మీ అందరినీ సంఘటితపరిచే శక్తి. తెలుగువారికి ప్రపంచంలో ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తుంది. ఏపీ ఎన్నార్టీ ప్రభుత్వ సంస్థ’ అని చంద్రబాబు చెప్పారు.

ఎన్.ఆర్.టి పెట్టింది ప్రవాసాంధ్రుల అభివృద్ధి కోసమేనని, ఒకప్పుడు సమస్యలుంటే ఫోన్ చేయాల్సి ఉండేదని, ఇప్పడు నేరుగా హెల్ప్ లైన్ తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అత్యవసరంగా మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ హెల్ప్ లైన్ ద్వారా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దురదృష్ట వశాత్తూ ఉద్యోగాలు కోల్పోయి కట్టుబట్టలతో ఇంటికి రావాల్సిన పరిస్థితి వస్తే చేయూతనివ్వడానికి ఎన్.ఆర్.టీ విధివిధానాలను రూపొందిస్తోందన్నారు.

ఇక్కడ నివసించే ఆంధ్రులకు సాధికారత కల్పించడంకోసం ఏపీ ఎన్నార్టీ సహకారం అందిస్తోందని, మన రాష్ట్రానికి వచ్చినా స్థిరపడాలనుకున్నా, లేదా పనిచేస్తున్న దేశాలలో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికైనా ఏపీ ఎన్నార్టీ తోడ్పడుతోందని సీఎం అన్నారు.

ఇవీ ఎన్ఆర్టీ కల్పిస్తున్న ప్రయోజనాలు

విదేశాలల్లో ఉన్న మన రాష్ట్రం వారు దురదృష్టవశాత్తూ సమస్యల్లో ఉన్నా, ఆపదల్లో చిక్కుకున్నా వారికి తక్షణ సాయం అందించేందుకు రాష్ట్ర బడ్జెట్ లో రూ.40 కోట్లను కేటాయించామని చంద్రబాబు చెప్పారు. ‘ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్’ పేరుతో 24 గంటలూ సేవలందించే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించాలని ఏపీ ఎన్నార్టీ కి సూచించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ఒక బీమా పథకం తీసుకొచ్చామని, దురదృష్టవశాత్తు చనిపోయినా, ప్రమాదవశాత్తూ గాయపడినా, వైకల్యం సంభవించినా, జబ్బులు వచ్చినా, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా ఆదుకుంటున్నట్లు సీఎం వివరించారు.

గల్ఫ్ మైగ్రెంట్స్ కేవలం ఏడాదికి రూ. 50 ప్రీమియం చెల్లిస్తే చాలని, మిగతాది ప్రభుత్వం చెల్లిస్తుందని, దురదృష్టవశాత్తు చనిపోతే రూ..10 లక్షల బీమా, రూ. లక్ష వరకు ఆరోగ్య బీమా, లీగల్ ఇన్సురెన్స్ కింద రూ.45,000 అందిస్తున్నామని, ఇక్కడ నివసించే మన రాష్ట్ర మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఇక్కడికి వలస వచ్చిన వారిని అత్యవసరంగా సహాయం అందించేందుకు ‘ప్రవాసాంధ్రనిధి’ ఏర్పర్చినట్లు చెప్పారు.

గల్ఫ్ లో ఉన్న మన వాళ్ల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చి సంపన్నులైన వారు జన్మభూమికి సహాయపడవచ్చని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరెలా భాగస్వాములు కావచ్చో ఏపీఎన్నార్టీ మార్గదర్శనం చేస్తుందని సిఎం వివరించారు.

సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ఎపీఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుడు నల్లూరు వెంకట శేషయ్యరూ. 25 లక్షలు, శ్రీరాం, రేఖ దంపతులు రూ.12 లక్షల చెక్ ను ఏపీ ఎన్నార్టీకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు. సమావేశంలో కువైట్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ నుంచే కాకుండా ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రవాసాంధ్ర బృందం కూడా పాల్గొంది.

మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీ రామారావును ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తలుచుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీరామారావు అని, ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో వుండే ఏకైక వ్యక్తి ఆయనేనని కొనియాడారు.

Related posts

Leave a Comment