స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రుణానికి గ్యారంటీ
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
జల వనరుల శాఖ బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు పొందేందుకు ఉన్న రుణ పరిమితిని తొలగించేందుకు..1997 ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ చట్టంలోని 34 వ విభాగాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడానికి వీలు కలుగుతుందని మంత్రివర్గం భావించింది. దీంతోపాటు.. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ రూ.500 కోట్లు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిధులతో స్వచ్ఛభారత్ మిషన్ కింద 12.5 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నరేగా కింద మరో 2.5 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడతారు. మంత్రిమండలి సమావేశం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు…
కోల్డ్ చెయిన్స్ కార్పోరేషన్ ఏర్పాటు
- కోల్డ్ చెయిన్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• దీనిపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని, వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకురావాలని నిర్ణయం.
• వ్యవసాయం, వ్యవసాయానుబంధ శాఖ, పరిశ్రమల శాఖ, పౌర సరఫరాలశాఖ మంత్రులు దీనిపై సమగ్రంగా అధ్యయనం జరిపి ముసాయిదా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం.
• 30 రోజులలో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశం.
ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ మార్గదర్శకాలు
• ‘ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2017’కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• అంతర్గత జలరవాణా చట్టం-1917 కింద ‘ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రూపొందించిన మోడల్ ‘ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2013’ ఆధారం చేసుకుని దానికి నిర్ధిష్ట నిబంధనలు చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2017ను రూపొందించారు.
• కాకినాడ పోర్టుల డైరెక్టర్ చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించిన మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపింది.
• ప్రయాణికులు, ప్రమాదకరమైన వస్తువుల రవాణాకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఇందులో పొందుపరచారు.
• అంతర్గత జల రవాణా ద్వారా ముఖ్యంగా రైళ్లు, రహదారుల రద్దీని తగ్గించే వీలుంది.
• జాతీయ జలరవాణా-4 ఫేజ్ 1లో భాగంగా ముక్త్యాల నుంచి విజయవాడవరకు ఏర్పాటుచేసే ఈ మార్గ నిర్వహణ, పరిశోధన, బీమా, జరిమానా, ఇతర చట్టపరమైన చర్యలు ఇందులో పొందుపరచారు.
కైకలూరు కోర్టులో నియామకాలు
- కైకలూరులో కొత్తగా ఏర్పాటైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టులను మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం.
- ఈ పోస్టులకు గాను రూ. కోటీ 38 లక్షల మేర భారం పడనున్నది.
రాయదుర్గం కళాశాల నియామకాలు
- అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి మంత్రిమండలి ఆమోదం.
- మొత్తం 16 పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి ఆమోదం. ఈ కళాశాలల వల్ల 500 బాలికలు విద్యనభ్యసించనున్నారు. ఈ నియామకాల ద్వారా రూ. కోటీ 59 లక్షల భారం పడనున్నది.
ఏపీపీఎస్‌సి
- విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు APPSCకి అదనపు అధికారం కల్పించేందుకు దోహదపడే బిల్లును రానున్న శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.
వెమ్ టెక్నాలజీస్
• వెపన్స్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఏర్పాటు నిమిత్తం వెమ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు, పెదవేగి మండలం భోగాపురం గ్రామాలలో ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన 350 ఎకరాల భూములకు గాను జరపవలసిన చెల్లింపులకు గడువు పెంచుతూ, దానిపై 16 శాతం అపరాధ వడ్డీ కింద చెల్లించాల్సిన మొత్తం రూ.1,84,52,384లను మాఫీ చేస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• ఈ సంస్థ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో లైట్ కాంబాట్ ఏర్ క్రాఫ్ట్ (LCA) వెహికిల్స్ తయారుచేయడానికి పరిశ్రమను నెలకొల్పుతుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు దేశంలో తొలిసారి.
భూసేకరణ బిల్లు వర్షాకాల సమావేశాల్లో..
ఇంతకుముందు ఆమోదించిన భూసేకరణ (ఏపీ సవరణ చట్టం) బిల్లు నెం: 13/2017ను ఉపసంహరిస్తూ, దాని స్థానంలో తాజా భూసేకరణ (ఏపీ సవరణ చట్టం) బిల్లును, తెలంగాణా భూసేకరణ (సవరణ) చట్టం, 21/2017 తరహాలో రూపొందించి దానిని వచ్చే శాసనసభ వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.
గత మంత్రిమండలి సమావేశంలో ఆమోదించిన ముసాయిదా ఆర్డినెన్సు ప్రకారం సవరించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడి) చట్టం, 3/2006ను బిల్లు రూపంలో మార్పు చేసి రాబోయే వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలన్నది మరో నిర్ణయం.