ప్రైవేటు మింగిన ప్రాణాలు 21

అనుమతి లేని ఆపరేటర్ స్వార్ధమే కారణమన్న సిఎం
కుమార్తె మరణం భరించలేక ప్రాణాలు విడిచిన తల్లి

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. ప్రైవేటు బోటు ఆపరేటర్ నేరపూరిత నిర్లక్ష్యం, లాభాపేక్ష ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సంఘటన స్థలాన్ని ముందుగా ఏరియల్ సర్వేద్వారా పరిశీలించి తర్వాత పవిత్ర సంగమం వద్ద ప్రత్యక్షంగా కూడా పరిశీలించారు. ఈ సంఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు.

ఆదివారం రాత్రికి 16 మృత దేహాలను వెలికి తీసిన సహాయ సిబ్బంది సోమవారం మరో ఐదు మృత దేహాలను కనుగొన్నారు. ఒక మృతదేహం సంఘటనా స్థలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజీకి దగ్గరగా దొరికింది. బోటు ప్రమాదంలో చనిపోయిన 21 మందిలో 18 మంది ఒంగోలు వాసులే. ఇద్దరు నెల్లూరుకు చెందినవారు ఉండగా మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఒంగోలుకు చెందిన సుజన, నెల్లూరుకు చెందిన పోపూరి అశ్విత (ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు) ఆచూకీ ఇంకా తెలియలేదు.

అనుమతి లేని బోటును నడిపిన సంస్థను టూరిజం శాఖలోని సిబ్బందే ప్రారంభించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థను ఏర్పాటు చేసినట్టు భావించిన టూరిజం బోటు డ్రైవర్ గేదెల శ్రీనును ఉద్యోగం నుంచి తొలగించారు. మృత దేహాలను స్వస్థలాలకు తరలించారు. కాగా, మృతులలో ఒకరైన డి. లీలావతి మృత దేహాన్ని చూసి తట్టుకోలేక ఆమె తల్లి లక్ష్మీకాంతం ఒంగోలులో గుండె ఆగి చనిపోయారు.

మృతుల పేర్లు
  1. కె. ఆంజనేయులు (మర్రిచెట్టు బజార్, ఒంగోలు)
  2. పోపూరి లలితమ్మ (ఊటుకూరు, నెల్లూరు)
  3. అరవపల్లి గురునాథరావు (హెచ్.బి. కాలనీ, ఒంగోలు)
  4. కూరపాటి నారాయణరాజు (గాంధీ నగర్, ఒంగోలు)
  5. తిప్పారెడ్డి కుసుమాంబ (గొడుగుపాలెం, ఒంగోలు)
  6. ధాచర్ల భారతి (ఎన్.జి.ఒ. కాలనీ, ఒంగోలు)
  7. జెట్టి ప్రభాకర్ రెడ్డి (కోర్టు సెంటర్, ఒంగోలు)
  8. పెండ్యాల సుజాత (బొండాల వీధి, ఒంగోలు)
  9. వేగిరెడ్డి బిందుశ్రీ (గొడుగుపాలెం, ఒంగోలు)
  10. సాయిని కోటేశ్వరరావు (కర్నూలు రోడ్డు, ఒంగోలు)
  11. బూసరపల్లి వెంకటేశ్వర్లు (భీమవరపు వారి వీధి, ఒంగోలు)
  12. కళ్ళకుంట వెంకటరమణ (మర్రిచెట్టు బజారు, ఒంగోలు)
  13. సాయన వెంకాయమ్మ (ఎన్.జి.ఒ. కాలనీ, ఒంగోలు)
  14. దేవబత్తిన లీలావతి (ఒంగోలు పబ్లిక్ స్కూలు)
  15. పసుపులేటి సీతారామయ్య (లాయరుపేట, ఒంగోలు)
  16. పసుపులేటి అంజమ్మ (లాయరుపేట, ఒంగోలు)
  17. కఠారి సుధాకర్ (బస్టాండ్ సెంటర్, ఒంగోలు)
  18. పోపూరి హరిత (నెల్లూరువాసి, ప్రస్తుతం విజయవాడ)
  19. కోసూరి రిషిత్ రాయ్ (ఒంగోలు)
  20. కఠారి భూలక్ష్మి (వంకా కాలనీ, న్యూమార్కెట్, ఒంగోలు)
  21. గుర్తించని పురుషుడి మృత దేహం.

Related posts

Leave a Comment