బడ్జెట్ సంపన్నం… వ్యయంలో దారిద్య్రం

admin
0 0
Read Time:8 Minute, 40 Second
బీసీ సంక్షేమ శాఖ ఏడు నెలల్లో చేసిన ఖర్చు 36 శాతమే

2017-18 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు రూ. 5,013 కోట్లు. ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచాయి. దామాషాలో ప్రకారం చూస్తే ఇప్పటికి సుమారు రూ. 3,000 కోట్లు బీసీ సంక్షేమ కార్యక్రమాలకోసం ఖర్చు చేసి ఉండాలి. కానీ, వాస్తవంలో అయిన వ్యయం ఎంతో తెలుసా? కేవలం రూ. 1,827 కోట్లు. ఇది అనధికారిక లెక్క కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఆయనకు నివేదించిన తాజా సమాచారం. మంగళవారం ముఖ్యమంత్రి సంక్షేమ విభాగాల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను సిఎంకు నివేదించారు.

బీసీ సంక్షేమంలో భాగంగా కాపు కార్పొరేషన్ కు కేటాయించిన రూ. 1000 కోట్లలో ఇప్పటికి రూ. 368.50 కోట్లు మాత్రమే ఖర్చయినట్టు అధికారులు చెప్పిన లెక్కలను బట్టి తెలుస్తోంది. కాగా ‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ’ పథకం కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 20.33 కోట్లతో 463 మంది బీసీ విద్యార్ధులకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ‘ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ’ పథకం కింద 1,534 మంది విద్యార్ధులకు ఈ ఏడాది లబ్ది చేకూరింది. ఏపీ బీసీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 22,589 మందికి రూ. 154.67 కోట్ల సబ్సిడీ అందించినట్టు అధికారులు తెలిపారు.

ఓవర్సీస్ విద్యకు అదనంగా రూ. 10 లక్షల రుణం
ప్రభుత్వానిదే గ్యారంటీ, వడ్డీ భారం

ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకునేలా ‘అంబేదర్క్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ. 10 లక్షల ఆర్ధిక సాయానికి అదనంగా మరో రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బ్యాంకు రుణాలకు మొత్తానికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు గ్యారంటీ ఇవ్వాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ముఖ్యమంత్రి దీనికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని, బ్యాంకు రుణం మొత్తాన్ని ఐదేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మార్చి 2018 నాటికి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

2017-18లో 5,878 మంది ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వగా 4,039 మందికి ఉపాధి లభించిందని, 33 శిక్షణ సంస్థలు 76 శిక్షణ కేంద్రాలు ద్వారా 81 రంగాలలో నైపుణ్యాభివృద్ధి పెంపొందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 9, 10 తరగతులు చదివే 36,948 మంది ఎస్సీ విద్యార్ధులకు, 5 నుంచి 8వ తరగతి చదివే 44,822 మంది ఎస్సీ విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశామని, ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ కింద 700 మంది ఎస్సీ అభ్యర్ధులకు రూ. 12.60 కోట్లు ఖర్చు పెట్టి పోటీ పరీక్షలలో శిక్షణ ఇప్పించామని తెలిపారు.

‘గిరి బాల నయనం’ వంటి వినూత్న కార్యక్రమాలతో గిరిజన ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రూ. 863.34 కోట్లతో గిరిజన తండాలకు 2,871.43 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్టు వివరించారు. మిగిలిన అన్ని తండాలకు ఈ ఏడాది చివరి కల్లా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన శరవేగంగా జరగాలని ముఖ్యమంత్రి హుకుం జారీ చేశారు.

ఖర్చు చేయడం కాదు.. ఫలితాలు రావాలి

ప్రజా సంక్షేమానికి భారీగా నిధులు ఖర్చు చేయడంతోనే సరిపెట్టకుండా సంపూర్ణ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలనకు దోహదపడాలని, అప్పుడే దానికి సార్ధకత వస్తుందని అన్నారు. ఏ పథకంతో ఎంతమందికి ప్రయోజనం కలుగుతోంది, ఏమేరకు ఫలితాలు సాధిస్తున్నామనే అంశాలపై విశ్లేషణ జరగాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈబీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నందున వారికి వినియోగించే నిధుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని చెప్పారు.

‘కానుక’లో 20 శాతం పెళ్లికి ముందే
‘సీపీకే’ మొబైల్ యాప్ లో దరఖాస్తు

జనవరి 1 నుంచి ప్రారంభిస్తున్న ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం కింద ప్రతి జంటకు ఇచ్చే మొత్తంలో 20 శాతాన్ని పెళ్లికి ముందుగానే లబ్దిదారులకు అందించాలని, ఇవి పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ‘సీపీకే’ పేరుతో మొబైల్ అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసువచ్చారు.

శ్రీకాంత్ స్ఫూర్తి యువతలో రగిలించాలి

సామాన్యులు సైతం అసామాన్య ప్రతిభ చాటగలరని బాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ నిరూపించారని, ఇదేస్ఫూర్తిగా ఎంతోమంది యువతలో దాగున్న ప్రతిభను వెలికి తెచ్చేందుకు ప్రయత్నించాలని, తగిన మద్దతివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ సహకారంతో విజేతలైన వారి గురించి అందరికి తెలియజేయడం ద్వారా మరికొందరికి ప్రేరణ కలిగించొచ్చని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి కూడా పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు రావాలని, ఇందుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ప్రభుత్వ ఆర్ధికసాయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించినవారికి మరింత తోడ్పాటు ఇవ్వాలని చెప్పారు. ఇందుకు ఆటంకంగా వున్న నిబంధనలను సవరించాలని అన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

ఎల్ఎన్‌జీ టెర్మినల్ భాగస్వామ్యానికి ‘ఉడ్‌సైడ్’ సిద్ధం

Share Tweet LinkedIn Pinterest
error

Enjoy this blog? Please spread the word