235 మంది మృతి, మరో 109 మందికి గాయాలు
ఈజిప్టులో ఉగ్రవాదం విశ్వరూపం దాల్చింది. ఉత్తర సినాయ్ ప్రావిన్సులోని అల్ రవాదీ మసీదులో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. బాంబు పేల్చి… దాని ప్రభావంనుంచి తప్పించుకున్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 235 మంది ప్రాణాలు తీశారు. ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘మేనా’ కథనం ప్రకారం మరో 109 మంది గాయాల పాలయ్యారు.
ఇటీవల జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇదొకటి. ఈ దాడి ఎవరు చేశారన్నది వెంటనే తేలలేదు. అయితే, ఇస్లామిక్ స్టేట్ కు అనుబంధంగా పని చేసే ఓ సంస్థతో సినాయ్ ఎడారి ప్రాంతంలో ఈజిప్టు భద్రతా దళాలు గత కొంత కాలంగా పోరాడుతున్నాయి. అక్కడా ఉగ్రవాద సంస్థ వందల మంది పోలీసులు, జవాన్ల ప్రాణాలు తీసింది.
శుక్రవారం ఉదయం ప్రార్ధనలు జరిగే సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి మానవ శరీరాలు తునాతునకలుగా చెల్లచెదురయ్యాయి. బాంబుదాడినుంచి బయటపడినవారు అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు గేట్ల దగ్గర కాపు కాసిన మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. మిలిటెంట్లు ఆంబులెన్సులపై కూడా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల ఫతా అల్ సిసి దేశ రక్షణ, దేశీయ వ్యవహారాల మంత్రులు, ఇంటలిజెన్స్ ఛీఫ్ తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈజిప్టువ్యాప్తంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
ఈజిప్టులో ఉగ్రవాదులు ఇప్పటిదాకా ప్రధానంగా రక్షణ దళాలనే లక్ష్యంగా చేసుకుంటూ వచ్చారు. 2013లో సిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ దాడులు పెరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహ్మద్ ముర్సిని కూలదోసి మిలిటరీ కమాండర్ గా పని చేసిన సిసి అధ్యక్ష పదవిలోకి వచ్చారు. తనను తాను ఇస్లామిక్ ఉగ్రవాద వ్యతిరేక రక్షణ ఛత్రంగా చెప్పుకునే సిసి వారికి టార్గెట్ అయ్యారు.
గత జూలైలో ఆత్మహుతి కారు బాంబు దాడిలో 23 మంది సైనికులు చనిపోయారు. అప్పటి దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. మే నెలలో మరో శుక్రవారం రోజున క్రిస్టియన్లపై దాడి చేసి 29 మందిని చంపారు. ఈ శుక్రవారం జరిగిన దాడి తీవ్రతలో వాటన్నిటినీ మించిపోయింది.