బాబు పెన్షన్ బౌన్సర్!

6 0
Read Time:7 Minute, 25 Second
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మొత్తం రెట్టింపు…
వృద్దులు, వితంతువులకు రూ. 1000 నుంచి 2000కు పెంపు…
వికలాంగులకు రూ. 1500 నుంచి రూ. 3000కు…
డయాలసిస్ రోగులకు రూ. 2,500 నుంచి రూ. 3,500కు… 
మొత్తంగా 54.15 లక్షల మందికి పెరిగిన పింఛన్…
సంక్రాంతి కానుకగా జనవరి నుంచే చెల్లింపు…
ఇక వార్షిక పెన్షన్ బడ్జెట్ ఏడాదికి రూ. 13 వేల కోట్లు!!

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో వృద్దులు, వితంతువులకు ఇస్తున్న కనీస పింఛన్ రూ. 200. ఒకేసారి 5 రెట్లు పెంచి 2014 అక్టోబర్ నుంచి రూ. 1000 ఇస్తున్నారు. ఇప్పుడా మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్టు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు ‘‘జన్మభూమి’’ సభలో ప్రకటించారు. దీంతో నాలుగేళ్ళ నాలుగు నెలల కాలంలో పింఛను మొత్తం 10 రెట్లు పెరిగినట్టయింది.

2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని రూ. 2000కు పెంచుతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో… చంద్రబాబు ఇప్పుడే ప్రకటించి సంచలనానికి కారణమయ్యారు. ఎన్టీఆర్ భరోసా పేరిట రాష్ట్రంలో 10 కేటగిరిల లబ్దిదారులకు ప్రభుత్వం నెలనెలా సామాజిక పింఛను ఇస్తోంది. జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్లూ కలిపి 50.61 లక్షల మందికి ఇస్తుండగా.. కొత్తగా మంజూరైనవాటితో కలిపి ఇప్పుడా సంఖ్య 54,14,592కు చేరింది.

ముఖ్యమంత్రి తాజా ప్రకటన ప్రకారం.. జనవరి మాసపు సామాజిక పింఛను అన్ని కేటగిరిల లబ్దిదారులకూ రెట్టింపు కానుంది. వృద్దులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, 79 శాతం లోపు వైకల్యం ఉన్నవారు, ఒంటరి మహిళలు, హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం రూ. 1000 ఇస్తుండగా ఈ నెలనుంచి రూ. 2000 ఇవ్వనున్నారు. 80 శాతం, ఆ పైన వైకల్యం ఉన్నవారికి, ట్రాన్స్ జెండర్లుకు ఇప్పటిదాకా రూ. 1500 ఇస్తుండగా.. ఇప్పుడది రూ. 3000 కానుంది. డయాలసిస్ పేషెంట్లకు రూ. 2,500 నుంచి రూ. 3,500కు పెంచారు. ఈ పెరిగిన పింఛను మొత్తాలు ఫిబ్రవరి మొదటి వారంలో చేతికి వస్తాయి.

ఏ కేటగిరిలో ఎంత మందికి…
కేటగిరి                                లబ్దిదారుల సంఖ్య

వృద్ధులు                      24,22,444

వితంతువులు               20,13,808

దివ్యాంగులు                  6,41,820

చేనేత కార్మికులు           1,07,992

కల్లుగీత కార్మికులు            28,011

హెచ్.ఐ.వి రోగులు             3,2979

ట్రాన్స్ జెండర్లు                   1,665

మత్స్యకారులు                  45,358

ఒంటరి మహిళలు          1,12,471

డయాలసిస్ పేషెంట్లు        8,044

భారీగా పెరగనున్న బడ్జెట్

2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘‘ఎన్టీఆర్ భరోసా’’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటకి ఐదేళ్ళ బడ్జెట్లలో రూ. 27 వేల కోట్లకు పైగా పింఛనుకోసం నిధులు కేటాయించింది. ఇప్పటికి రూ. 24,618 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు పింఛను మొత్తం రెట్టింపు కావడంతో… వార్షిక బడ్జెట్లో కేటాయింపులు కూడా రెట్టింపు చేయవలసిన అవసరం ఉంది.

ప్రస్తుతం నెలకు రూ. 560 కోట్ల చొప్పున పింఛన్లకోసం కేటాయించారు. జనవరి నుంచి దాదాపు రూ. 1100 కోట్లు అవసరమవుతుంది. కేవలం పింఛన్లకోసం నెలకు ఇంత ఖర్చు చేయడం అంటే అసాధారణమే. ఈ లెక్కన వచ్చే ఏడాదినుంచి సుమారు రూ. 13 వేల కోట్లు వార్షిక బడ్జెట్లో కేటాయించవలసి వస్తుంది. సంక్షేమానికి కేటాయింపులలో ఇదో అసాధారణ పరిణామమే అవుతుంది.

కేరళ, ఆంధ్రప్రదేశ్ టాప్..!

వృద్ధాప్య పింఛన్లలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన పెద్ద రాష్ట్రాలకంటే ముందుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు రూ. 1000 చొప్పున కనీస పింఛను ఇస్తుండగా… చిన్న రాష్ట్రాలైన కేరళ, ఢిల్లీ, గోవాలలోనూ, పుదుచ్ఛేరి, అండమాన్ దీవుల వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం వృద్ధాప్య పింఛను రూ. 2000గా ఉంది. హర్యానాలో రూ. 1800, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రూ. 1700 ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కేవలం రూ. 400 ఉండగా.. ఇప్పటిదాకా బీజేపీ పాలించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరింత తక్కువగా రూ. 300 మాత్రమే ఇస్తున్నారు. రాజస్థాన్ లో రూ. 500, మహారాష్ట్రలో రూ. 600, చత్తీస్ గఢ్ లో రూ. 350 మాత్రమే ఇస్తున్నారు.

దక్షిణాదిన వృద్ధాప్య పింఛను కర్నాటకలో అతి తక్కువగా రూ. 500 ఇస్తుండగా కేరళలో రూ. 2000, మిగిలిన మూడు రాష్ట్రాల్లో రూ. 1000 చొప్పున అమల్లో ఉంది. మనతో పోలిస్తే చిన్న రాష్ట్రమే అయినా కేరళలో 52 శాతం మంది వృద్ధులకు పింఛను ఇస్తున్నారు. రూ. 2000 పింఛనును అంత భారీ స్థాయిలో వృద్ధులకు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. అంత శాతం కాకపోయినా.. అత్యధిక సంఖ్యలో వృద్ధులకు రూ. 2000 పింఛను ఇచ్చే రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కనుంది.

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %