బీసీ రిజర్వేషన్లు పదిలం : అసెంబ్లీలో సిఎం అభయం

బీసీలు లేనిదే టీడీపీ లేదు
వారికి నష్టం కలిగించే పని ఎన్నటికీ చేయం
స్వాతంత్రానికి పూర్వమే కాపు రిజర్వేషన్ 
ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలగించారు
తర్వాత జీవోలు తెచ్చారు…కోర్టులు కొట్టేస్తే పట్టించుకోలేదు
పాదయాత్రలో పేదరికం చూశాను… మాటకు కట్టుబడే ఈ నిర్ణయం

తెలుగుదేశం ప్రభుత్వం బలహీనవర్గాలకు నష్టం చేసే పని ఎన్నటికీ చేయదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కాపులను బీసీలలో చేరుస్తూ అదనంగా 5 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ కల్పించడంపై బీసీలలో అనుమానమే అక్కర్లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీసీలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదని ఉద్ఘాటించారు. బ్రిటిష్ కాలంనుంచీ కాపు రిజర్వేషన్ల చరిత్రను చెప్పిన సిఎం… తాను పాదయాత్రలో కాపుల్లో పేదరికం చూశానని, ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టానని పేర్కొన్నారు.

విద్య, ఉపాధిలో వెనుకబాటు, అధిక పేదరికం కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయానికి కారణమని ముఖ్యమంత్రి చెప్పారు. ‘కాపులు రాజకీయంగా ముందున్నారు. అందుకే ఆ నాయకులు కూడా రాజకీయ రిజర్వేషన్లు అడగలేదు. విద్య, ఉపాది పరంగా… ఆర్థికంగా వెనుకబడ్డామని, ఆ అంశాలలో ప్రభుత్వం చేయూతనివ్వాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో బీసీలలో అనుమానం రావడానికి వీల్లేదు. రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి చేరిన తర్వాత… రాజ్యాంగంలోని షెడ్యూలు 9ని సవరించి అదనపు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పడు ఈ బిల్లు తెచ్చాం. బీసీలకు నష్టం చేసే పని ఈ ప్రభుత్వం ఎప్పటికీ తలపెట్టదు. ఇప్పటిదాకా ఉన్న రిజర్వేషన్లు పదిలం. బీసీలలో ఎ,బి,సి,డి,ఇ కేటగిరిలకు అదనంగా ఎఫ్ కేటగిరిని చేరుస్తున్నాం. ఆ కేటగిరికి విడిగా 5 శాతం రిజర్వేషన్ నిన్న ఫైనల్ చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

రిజర్వేషన్ లేటవుతుందనే ముందుగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దాని ద్వారా విద్య, స్వయం ఉపాదికి సాయమందించామని గుర్తు చేశారు. బీసీ కమిషన్ కు నిర్ధిష్టంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో రిజర్వేషన్ అంశాన్ని చేర్చామని, ప్రస్తుతం బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఏమాత్రం ప్రభావితం కాకుండా కాపులకు విద్య, ఉద్యోగాలకోసం బీసీలలో చేర్చే విషయం పరిశీలించాలని కోరామని చంద్రబాబు గుర్తు చేశారు. కమిషన్ కు 8 నెలలు సమయం ఇస్తే ఆలస్యమైందని, మూడుసార్లు రిమైండర్లు ఇచ్చామని, ఇంకా ఆలస్యం కాకూడదనే నిన్న ఆమోదించామని చంద్రబాబు చెప్పారు. ఈ సమయంలోనే ఇంకొన్ని కోరికలు,  విన్నపాలు ముందుకొస్తున్నాయంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. అగ్రవర్ణ పేదల విషయంపై చర్చ ఉందన్న సిఎం, వారికోసం బడ్జెట్ లో నిధులు కేటాయించిన తొలి ప్రభుత్వం తమదేనని చంద్రబాబు చెప్పారు.

తానెప్పుడూ చెబుతున్నట్టు సమాజంలో డబ్బులుండేవారికులం, లేనివారి కులం రెండే ఉంటాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పేదరికం లేనిసమాజం కోసం తాను పని చేస్తున్నానన్నచంద్రబాబు ‘పేదరికం కులంతో రాదు. కానీ, సామాజిక వెనుకబాటు కులంతో ముడిపడి ఉంది’ అని చెప్పారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు మిగిలినవారికి విద్య, ఉపాధి, ఆర్థిక అంశాల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అంతరం ఉందని చెప్పారు. కొన్ని అగ్రవర్ణాలవారు… వారికి ఉన్న అవకాశాల రీత్యా ఆలోచనా విధానంలో చురుగ్గా ఉంటారని, అదే గిరిజనుల విషయానికొస్తే ఈ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారని సిఎం అభిప్రాయపడ్డారు.

సిఎం చెప్పిన కాపు రిజర్వేషన్ చరిత్ర

1915లో బ్రిటిష్ ప్రభుత్వం తెలగ, ఒంటరి, కాపు, బలిజలను బీసీలుగా గుర్తించింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ విధానాన్నే అమలు చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్ర, తెలంగాణలకు విడివిడిగా రెండు జాబితాలను నిర్వహించారు. సంజీవరెడ్డి ప్రభుత్వ  హయాంలో ఈ నాలుగు కులాలను బీసీ జాబితానుంచి తీసేశారు. ఏ అధ్యయనమూ చేయలేదు. దామోదరం సంజీవయ్య హయాంలో కోస్తా కాపు, తెలగ, ఒంటరి, బలిజలను మళ్ళీ బీసీలుగా గుర్తిస్తూ జీవో జారీ అయింది. దానికి సరైన ప్రాతిపదికను పాటించలేదంటూ 1963లో హైకోర్టు కొట్టేసింది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తిరిగి జీవో ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ఈ నాలుగు కులాలవారికి స్కాలర్ షిప్పులు, విద్యా రంగాల్లో అవకాశం ఇచ్చారు. 1980లో ఈ జీవోను మళ్ళీ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంలో కూడా హైకోర్టు తీర్పును సమర్ధించారు.

మధ్యలో కొన్ని కమిషన్లు వచ్చాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో 1994లో మరోసారి జీవో ద్వారా బీసీల జాబితాలో చేర్చారు. అదీ అధ్యయనం ప్రాతిపదికన చేయకపోవడంవల్ల కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. 2004, 2009లలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మొత్తం 17 కులాలను బీసీలలో చేరుస్తామని చెప్పి 13 కులాలను చేర్చారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ…ఈ నాలుగు కులాలనే విస్మరించారు. నేను వచ్చాక ఒక పద్ధతి ప్రకారం కమిషన్ వేసి అధ్యయనం చేేేయించాను. ఈ నాలుగు కులాలలో వెనుకబాటును నా పాదయాత్రలో గమనించాను. అందుకే పిఠాపురంలో ప్రకటించాను. దానికి కట్టుబడి రిజర్వేషన్లను సాకారం చేస్తున్నా. 18-1-2016న మంజునాథ కమిషన్ ను నియమించాం. ఫిబ్రవరిలో సభ్యులను నియమించాం. నిన్ననే కమిషన్ నివేదిక వచ్చింది.

అంబేద్కర్ వల్ల అంటరానివారికీ సమానావకాశాలు 

సమాజంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ అసమానతలు ఉన్నాయి. సరైన అవకాశాలు రాకుంటే ఈ ప్రభుత్వాల వల్ల ఉపయోగం లేదనే నిరాశ వస్తుంది. ఇక్కడ అంబేద్కర్ ను మనమంతా గుర్తు పెట్టుకోవాలి. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల.. కొన్ని వర్గాలు అంటరానితనం నుంచి ఇప్పుడు అందరితో సమానంగా అవకాశాలను అందుకునే వరకూ ఎదిగారు. కాపులకూ న్యాయం చేయాలి. స్వాతంత్రం రాక ముందే కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరోవైపు ప్రపంచీకరణతో కుల వృత్తులు దెబ్బతిన్నాయి. అందుకే బీసీ సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాం. పేదలు ఎవరైనా పేదలే. ఇక్కడ రాజకయం లేదు. ఈ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ఢోకా లేదు.

సమైఖ్యాంధ్రప్రదే్శలో కూడా బీసీలకు గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్. ఈరోజు విస్మరించే పరిస్థతి ఉండదు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు తెస్తున్నాం. కులాల జనాభా విషయంలో ఒక్కొక్కరు ఒక్కో లెక్క వేసుకొస్తారు. మొదటిసారి ఎపి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేశాం. ఆధార్ అనుసంధానంతో 4.30 కోట్ల మంది డేటాను పొందుపరిచాం. మరోవైపు… బీసీ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల డేటా తీసుకొని నివేదిక రూపొందించారు.

కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన ప్రజానీకంలో చిన్న రైతులు, కార్మికులు, మురికివాడల్లో నివసించేవారు, కౌలురైతులు, రిక్షా, ఆటో నడిపేవారు ఎక్కువగా ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలనుంచి డ్రాపౌట్లలోనూ ఆయా వర్గాలవారు ఎక్కువ ఉన్నారు.

Related posts

Leave a Comment