‘బ్రాహ్మణ హితైషి’ చంద్రబాబు..

  • బిరుదు ఇవ్వాలని ఏఐబీఎఫ్ నిర్ణయం!
  • ముఖ్యమంత్రిని కలిసిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు

ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులు వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వపరంగా అన్నివిధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనలో, స్వయం ఉపాధి పథకాలలో నిరుపేద బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. తెలివితేటలు, జ్ఞానసంపత్తిలో ముందున్న బ్రాహ్మణ సామాజికవర్గంలో పూట గడవని స్థితిలో చాలామంది ఉన్నారని, వీరి అభ్యున్నతికి సహకరిస్తామని తన పాదయాత్రలోనే మాటిచ్చానని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించామని చెప్పారు.

గురువారం సాయంత్రం సచివాలయంలో ఆలిండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ ఆధ్యర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వచనాలు అందించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉన్నాయని హర్షం వ్యక్తంచేశారు. అఖండ భారతావనిలో బ్రాహ్మణులంతా ఏకత్రాటిపై వచ్చి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలకు అండగా నిలబడటం అభినందనీయమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆదాయం తక్కువగా ఉండే ఆలయాల్లో పూజారులకు గౌరవ వేతనం చెల్లించేందుకు యోచిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రాజస్థాన్ తరహాలో ఏపీలోనూ 19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, సామాజిక న్యాయం కోసం ఇప్పుడున్న బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లను కొనసాగిస్తూనే కేరళలో ఏర్పాటుచేసినట్టుగా ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఈ బృందం ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించింది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వేద విజ్ఞాన పాఠశాల, గోశాల, గాయత్రి మందిరం, పరశురామ మందిరం, ప్రవచన మండపం వంటివి ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా రాష్ట్రంలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ‘బ్రాహ్మణ హితైషి’ అనే బిరుదును ఇవ్వాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలిండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ (ఏఐబీఎఫ్) అపెక్స్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ఈ బిరుదును స్వీకరించాలని కోరారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య, ఏఐబీఎఫ్ అధ్యక్షుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే భవర్‌లాల్, కార్యదర్శి ప్రదీప్ జ్యోతి, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోట శంకరశర్మ, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment