ముంబై, కోల్ కత మహా నగరాల్లో తక్కువ ఛార్జీలు
28న హైదరాబాద్ మెట్రో ప్రధాని చేతులమీదుగా ప్రారంభం
29నుంచి ప్రయాణీకుల చేరవేత
ఏడు సంవత్సరాలకు పూర్తి కావలసిన మెట్రో రైలు ప్రాజెక్టు పద్నాలుగేళ్ళకు పూర్తయింది. మధ్యలో కంపెనీ మారింది. వ్యయం అంచనా మూడున్నర రెట్లు అయింది. ముందుగా అనుకున్న ఛార్జీలూ రెండు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ మెట్రో కథ ఇది. మరో మూడు రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభం కానుండగా ఎల్ అండ్ టి కంపెనీ ఛార్జీలను ప్రకటించింది.
దేశంలోని వివిధ నగరాల్లో మెట్రోలు తక్కువ ఛార్జీలతో ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కాలక్రమంలో ఛార్జీలు పెంచారు. అయితే, హైదరాబాద్ మెట్రో ప్రారంభంలోనే దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న గరిష్ఠ ఛార్జీలను ప్రామాణికంగా తీసుకుంది. కనీస ఛార్జీ 10 రూాపాయలుగా, గరిష్ఠ ఛార్జీ 60 రూపాయిలుగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి తాజాగా ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఛార్జీలు సమంజసంగానే ఉన్నట్టు అభిప్రాయపడుతోంది. అయితే, 2012లో ఎల్ అండ్ టి కంపెనీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం గరిష్ఠ ఛార్జీ 19 రూపాయలుగా ఉండాలి. మహానగరాల్లో ముంబై, కోల్ కత తక్కువ ఛార్జీలతోనే మెట్రో రైళ్లను నడుపుతున్నాయి. కోల్ కతలో కనీస ఛార్జీ 5 రూపాయలుగాను, గరిష్ఘ ఛార్జీ 25 రూపాయలుగానూ ఉంది. దాంతో పోలిస్తే హైదరాబాద్ ఛార్జీలు రెట్టింపు కంటే ఎక్కువ.
ముంబై మెట్రోలో కనీస ఛార్జీ 10 రూపాయలేగాని గరిష్ఠ ఛార్జీ 40 రూపాయలకు పరిమితం చేశారు. అక్కడ ఛార్జీలు భారీగా పెంచాలని ఇటీవల కంపెనీ చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు నిలువరించింది. మన పొరుగునున్నబెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రస్తుతం ఛార్జీలు హైదరాబాద్ తో సమానంగా రూ. 10 నుంచి 60 వరకు ఉన్నాయి. జైపూర్ మెట్రో గరిష్ఠ ఛార్జీ 23 రూపాయలే ఉంది. కేరళలోని కొచ్చి నగరంలోనూ గరిష్ఠ ఛార్జీ(రూ. 50) హైదరాబాద్ కంటే తక్కువ.
హైదరాబాద్ మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీన మెట్రో సర్వీసులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు శనివారం ట్రయల్ రన్ వేశారు.