మందగమనం ముగిసినట్టేనా…

admin
2 0

జూలై-సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటు 6.3 శాతం

జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) గత జూలై- సెప్టెంబర్ కాలంలో 6.3 శాతం వృద్ధి చెందినట్టు కేంద్ర గణాంక సంస్థ గురువారం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.7 శాతం నమోదైన నేపథ్యంలో గురువారం వెలువడిన గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చాయి. 2016 నవంబర్ మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడింది. గత ఐదు త్రైమాసికాలుగా నిరాశాజనకంగా ఉన్న వృద్ధి రేటు ఈసారి పంజుకుంటుందని తాజాగా సర్వేలు వెల్లడించాయి. దాదాపుగా అంచనాలకు తగ్గట్టుగానే వృద్ధి రేటు ఆరు శాతం దాటింది.

మొత్తంగా తొలి ఆరు నెలల కాలానికి జీడీపీ 6 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆర్నెల్ల కాలానికి జీడీపీ ఏకంగా 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. అప్పట్లో ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇండియా అత్యధిక వృద్ధి రేటును నమోదు  చేయగా... ఈ ఏడాది డీమానెటైజేషన్, జీఎస్టీ పుణ్యమా అని ఆ టాప్ స్పాట్ కోల్పోయింది. జూలై-సెప్టెంబర్ కాలానికి చైనా 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసి టాప్ లో ఉంది.

గత మూడు త్రైమాసికాలలో ఇదే అధిక వృద్ధి రేటు అయినప్పటికీ 2016-17లో మూడో త్రైమాసికంతో (6.9 శాతంతో) పోలిస్తే  తక్కువే. ఆ క్వార్టర్ లోనే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. వ్యవసాయ, పారిశ్రామిక,సేవా రంగాలు ఆర్థిక వ్యవస్థకు జోడించిన మొత్తం విలువ (జీవీఎ) ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ మధ్య 6.1 శాతం వృద్ధి చెందింది. ఇది అంతకు ముందు త్రైమాసికంలో 5.6 శాతంగా ఉంది. తాజా ఫలితాలను బట్టి ఇక మందగమనం ముగిసినట్టేనని, 2017-18 ఆర్థిక సంవత్సరం మిగిలిన త్రైమాసికాలలో వృద్ధి రేటు పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పెట్టుబడుల వృద్ధి 4.6 శాతం నమోదు కావడం, దానికి తగ్గట్టుగా డిమాండ్ పెరగడం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆశాజనకమైన జీడీపీ వృద్ధి రేటుకు కారణంగా భావిస్తున్నారు. తొలి త్రైమాసికంలో పెట్టుబడులు కేవలం 1.6 శాతం పెరిగాయి. అయితే, జీడీపీలో పెట్టుబడుల వాటా గణనీయంగా తగ్గింది. తొలి త్రైమాసికంలో జీడీపీలో 29.9 శాతంగా ఉన్న పెట్టుబడుల మొత్తం రెండో త్రైమాసికానికి 27.5 శాతానికి తగ్గింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రతికూల ప్రభావం దీనికి కారణంగా చెబుతున్నారు. కచ్చితంగా రెండో త్రైమాసికం మొదలయ్యే జూలై 1వ తేదీనే జీఎస్టీ అమలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

పరిశ్రమలు పెరిగితే సర్వీసులు తగ్గాయి

పారిశ్రామిక రంగ స్థూల ఉత్పత్తి రెండో త్రైమాసికంలో 7 శాతం పెరగడం మొత్తంగా జీడీపీ పెరుగుదలకు దోహదం చేసింది. గత త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.2 శాతం పెరిగింది. ఆ కాలంలో 8.7 శాతం వృద్ధి చెందిన సేవల రంగం మాత్రం ఈసారి 7.1 శాతం వృద్ధి  రేటునే నమోదు చేసింది. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో స్తబ్ధత దీనికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో ఖరీఫ్ సీజన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.8శాతం తగ్గింది. గత ఏడాది దీనికి భిన్నంగా 10.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.

 

 

Next Post

పోల‘వార్’... కేంద్రం వద్దన్నా ముందుకే

జూలై-సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటు 6.3 శాతంజాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) గత జూలై- సెప్టెంబర్ కాలంలో 6.3 శాతం […]
error

Enjoy this blog? Please spread the word