మధ్యప్రాచ్యంలో మంట పెట్టిన ట్రంప్…జెరూసలేం ఇజ్రాయిల్ రాజధానిగా ప్రకటన

అమెరికా రాయబార కార్యాలయం టెల్ అవీవ్ నుంచి తరలింపు

ముస్లిం దేశాలతోపాటు మిత్ర దేశాల నిరసన
ఇది శాంతికి భంగకరమని ముందునుంచీ హెచ్చరికలు
క్రైస్తవులనుంచీ నిరసన ఎదుర్కొంటున్న అమెరికా నిర్ణయం

అనుకున్నంతా అయింది. ముస్లిం వ్యతిరేకతకు మారు పేరుగా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో తీవ్రమైన నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో మంట పెట్టారు. పురాతన జెరూసలేం నగరాన్ని ఇజ్రాయిల్ దేశ రాజధానిగా గుర్తిస్తున్నట్టు బుధవారం  ప్రకటించారు. ఇప్పటిదాకా టెల్ అవీవ్ నగరంలో ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలేం తరలిస్తామని స్పష్టం చేశారు. దీంతో మధ్యప్రాచ్యంలోని దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయిల్ మినహా అరబ్బు దేశాలన్నిటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయా దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్ ఫ్లెక్సీలు మంటల్లో తగులబడుతున్నాయి. ఇది మొత్తంగా మధ్యప్రాచ్యంలో శాంతి యత్నాలకు భంగకరంగా పరిణమిస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే ఉత్తర కొరియాపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్, ముస్లిం వ్యతిరేక వీడియోల షేరింగ్ వంటి అంశాలతో తన భావజాలాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా పాలస్తీనియన్ల ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా ఇజ్రాయిల్ కు జెరూసలేంను కట్టబెట్టేలా ఏకపక్షంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ముందే… అమెరికా మిత్రపక్షాలతో సహా నాటో సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ను హెచ్చరించాయి. అయినా వినకుండా మొండిఘటంలా తన నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు

ట్రంప్ ప్రకటన వెలువడగానే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ జాతీయ టెలివిజన్ లో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని కొనియాడారు. పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్యసమితి గత తీర్మానాలను ట్రంప్ ఉల్లంఘించారని అబ్బాస్ ఆక్షేపించారు. అరబ్ లీగ్ సహా ముస్లిం దేశాలు, అమెరికా అనుంగు మిత్రులైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుకె సహా పలు దేశాల నేతలు ట్రంప్ ప్రకటనను ఖండించాయి. 8 దేశాలు వెంటనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. నిజానికి ఆయా దేశాల నేతలు… ట్రంప్ ప్రకటనకు ముందే హెచ్చరికలు జారీ చేశారు. నాటో సభ్యదేశమైన టర్కీ… జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా ట్రంప్ ప్రకటిస్తే ఇజ్రాయిల్ తో సంబంధాలను తెంచుకుంటామని ప్రకటించింది. అంతెందుకు అమెరికాలోనూ నిరసన వ్యక్తమైంది.. అవుతోంది.

మితవాద భావజాలానికి ప్రతినిధి అయిన ట్రంప్… పాలస్తీనా ఉనికిని గుర్తించడానికి ఇష్టపడని ఇజ్రాయిల్ కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రపంచంలో ఏమూల ఏ దేశం తన మాట వినకపోయినా ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలను పాటించడంలేదని యుద్ధానికి సైతం సిద్ధపడే అమెరికా ఈ విషయంలో అదే ఐరాస తీర్మానాన్ని సైతం తుంగలో తొక్కి ఇజ్రాయిల్ పక్షం వహించింది.

వివాద నేపథ్యమిదీ…

జెరూసలేం వివాదం ఎప్పటినుంచో నడుస్తోంది. జెరూసలేంను క్రైస్తవులు, ముస్లింలు, యూదులు కూడా తమ పవిత్ర స్థలంగా భావిస్తారు. యూదులు 3000 వేల సంవత్సరాలనుంచి జెరూసలేం తమ రాజధాని అని చెబుతారు. కానీ, ఆధునిక చరిత్రలో యూదులు అక్కడ లేనప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు మనుగడ సాగించారు. 1917లో తిరిగి యూదుల రాక మొదలైంది. 1948లో బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత జెరూసలేంలోని పాత నగరం పాలస్తీనా అధీనంలో ఉండగా… మిగిలిన ప్రాంతం ఇజ్రాయిల్ స్వాధీనంలోకి వచ్చింది. తలదాచుకోవడానికి చోటిస్తే గుడారం మొత్తాన్ని ఆక్రమించిన ఒంటె మాదిరే పాలస్తీనా ప్రాంతం మొత్తాన్ని 50 ఏళ్ళలో క్రమకమంగా ఆక్రమిస్తూ వచ్చిన ఇజ్రాయిల్.. అదే సూత్రాన్ని జెరూసలేం నగరానికీ వర్తింపజేసింది.

1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ముస్లిం దేశాలు ఓడిపోవడంతో ఇజ్రాయిల్ కు తిరుగు లేకుండా పోయింది. అప్పుడే పాలస్తీనా ప్రాంతంపై పట్టు సాధించింది. పాలస్తీనియన్ల అధారిటీ కిందనున్న జెరూసలేం ప్రాంతాన్ని కూడా తన అధీనంలోకి తీసుకుంది. యూదుల సెటిల్మెంట్లను పెంచింది. పురాతన కాలంనుంచీ అది యూదుల కేంద్రమే అని రుజువు చేయడానికి వంకర మార్గాలూ అనుసరించింది. ‘పురాతన యూదు స్మశాన వాటిక’లను సృష్టించింది. అయినా, ప్రపంచం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించేందుకు సిద్ధపడలేదు.

మిత్రపక్షమైన ఇజ్రాయిల్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా దశాబ్దాల నుంచి ఈ ప్రకటన చేయడానికి అమెరికా అధ్యక్షులెవరూ సాహసించలేదు. పాలస్తీనా, ఇజ్రాయిల్ వివాదానికి క్రైస్తవుల వ్యతిరేకత కూడా తోడై ఇన్నాళ్ళూ ఇంటా బయటా వ్యతిరేకతకు భయపడి అమెరికా అధ్యక్షులు ఈ డిమాండ్ ను పక్కన పెట్టారు. జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన గత అధ్యక్షులు సైతం దాన్ని బుట్టదాఖలా చేశారు.

ప్రపంచ దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను టెల్ అవీవ్ లోనే ఏర్పాటు చేశాయి. ఇజ్రాయిల్ కోరుకున్నట్టు ఎవరూ జెరూసలేంను రాజధానిగా గుర్తించి రాయభార కార్యాలయాలను తరలించలేదు. ఇజ్రాయిల్ వాణిజ్య నగరం టెల్ అవీవ్ లోనే అమెరికా రాయబార కార్యాలయం కూడా కొనసాగింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం… ఆ దేశ అనుకూలురు, వ్యతిరేకులు అన్న అంశంతో నిమిత్తం లేకుండా ప్రపంచంలోని మెజారిటీ దేశాలపై ఏదో ఒక రూపంలో పడుతోంది. మధ్యప్రాచ్యం అయితే.. మళ్ళీ అశాంతితో అల్లాడే పరిస్థితి తలెత్తుతుందన్న ఆందోళన నెలకొంది.

Related posts

Leave a Comment