మరో వేయి ప్రతిభా పురస్కారాలు

3 0
Read Time:17 Minute, 27 Second
విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రూ. 30 కోట్లు..
ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

రానున్న కాలంలో విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడు ఇస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలను మరో 1000కి పెంచుతామని, ఇందుకోసం మరో 30 కోట్లు అదనంగా వ్యయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. విద్యార్ధులలో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందని,  తల్లి దండ్రుల డబ్బులతో కాకుండా, విద్యార్ధులు తమ ప్రతిభా పురస్కారాలతో చదివే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా  ఆదివారం విజయవాడ ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను బహూకరించారు.  విద్యార్ధుల భవిష్యత్తుకు తపించిన వైజ్ఞానికుడు, మేధావి, భారత రాష్ట్రపతిగా పనిచేసి స్ఫూర్తిదాతగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతినాడు ఈ పురస్కారాలను ప్రదానం చేయండ సముచితంగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి ముహూర్తంగా ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.  ఏ మంచిపని అయినా సంకల్పం తీసుకుంటే తప్పక నెరవేరుతుందని ఆయన అన్నారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంలో తీసుకున్న సంకల్పాలు ఎలా ఫలప్రదమవుతున్న వైనాన్ని ముఖ్యమంత్రి వివరించారు.

తాము విద్యార్ధుల్లో ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలను మరో 1000 పెంచనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ వచ్చిన వారిని ఇంటర్మీడీయట్ చదివిస్తామని ప్రకటించారు. ఇంటర్ లో మెరిట్ స్కాలర్ షిప్ వస్తే వాళ్లు తర్వాత ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఎం ఎక్కడైనా చదివించడానికి సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామని సీఎం స్పష్టం చేశారు. ధనికులైనా, పేదలైనా పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచాలని కోరారు.

రాబోయే రోజుల్లో నాలెడ్జి ఎకానమీకి ప్రాధాన్యం వస్తుందని అన్నారు.  తాను పాతికేళ్ల క్రితమే  ఈ విషయం చెప్పానన్నారు.  పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కావని, చదువు-సంస్కారం అని అన్నారు. ఆచార వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థను కాపాడాలి.  పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా కష్టపడుతున్నారు.

1995 తాను సీఎం అయినప్పుడు చదువుకు ప్రాధాన్యతనిచ్చినట్లు, ఆనాడు ప్రతి కిలోమీటర్ కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీకు ఒక మాధ్యమిక పాఠశాలు, 5 .కి.మీ దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలన్న నిర్ణయం తీసుకుని పనిచేశామని గుర్తు చేశారు. మండలానికి జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని భావించి ప్రయత్నించామన్నారు.  30 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయన్నారు.

తర్వాత 9 ఏళ్లలో  300పైగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినట్లు తెలిపారు  చదువు తెలివిని ఇస్తుందని,  చదువు ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చన్నారు. కాలేజీలు పెడితేనే లాభం లేదు, అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలన్న ఉద్దేశంలో ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని, ఫలితంగా ఇక్కడ ఐటీలో లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, వేలాదిగా విదేశాలకు వెళ్లారని గుర్తుచేశారు.

మన విద్యార్ధుల ప్రతిభతో అనేక అవకాశాలు

ప్రపంచంలో ఐటీలో ఉన్న నిపుణులు ప్రతి నలుగురులో ఒకరు భారతీయుడని, దేశంలో ప్రతి నలుగురు ఐటీ ఇంజనీర్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేనన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా తాను  ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల లక్షలాదిమందికి లబ్దిచేకూరిందన్నారు.   ప్రపంచంలో ఐటీ ఇంజనీర్లలో 25% మనవాళ్లున్నారని, ఇందుకు తాను వేసిన బీజమే కారణమని, తన చొరవతో ఇది సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు.  ఉద్యోగాలతో సంతృప్తిచెందక పారిశ్రామిక వేత్తలుగా మారి, ఉపాధి అవకాశాలు సృష్టించాలని పిలుపునిస్తే మంచి స్పందన లభించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.  ఐఐటీలకు 18% మన విద్యార్ధులే ఎంపికవుతున్నారని, ఇదెంతో గర్వకారణమని చెప్పారు.  మన జనాభా 4.5% ఉంటే 18% సీట్ల మన విద్యార్ధులకే వస్తున్నాయని పోటీ ఉన్నప్పటికీ  ఇది సాధిస్తున్నారంటే మన పిల్లలు ఎంతో ప్రతిభావంతులన్నారు. అయితే తాను ఇంతటితో సంతృప్తిచెందనని, 25% సీట్ల మనకే రావాలని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు బిట్స్ పిలానీకి అందరూ మన విద్యార్ధులే వెళ్లేవారని, వాళ్లకు అసూయవచ్చి బిట్స్ పిలానీలో విధివిధానాల్లో మార్పు చేశారని చంద్రబాబు అన్నారు. వాళ్లు ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని నిబంధనలు విధించినా ప్రతిభతో మనమే ముందున్నామని నిరూపించామని వివరించారు.

విద్యార్ధుల భవిష్యత్తుకు తాను అన్ని అవకాశాలు సృష్టిస్తానని సీఎం చెప్పారు.

విద్యోన్నతి ద్వారా విదేశీ విద్య

విద్యోన్నతి పథకాల ద్వారా విదేశాల్లో చదువుకునే అవకాశాలు సృష్టించామని చంద్రబాబు తెలిపారు.వెనుకబడిన వర్గాల విద్యార్ధుల 1000 మంది, ఈబీసీలు 750, కాపులు1000, ఎస్సీలు 1000 మంది, ఎస్టీలు, మైనారిటీలు 750..మొత్తం 4,500 మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చామన్నారు. నచ్చిన విశ్వవిద్యాలయానికి పంపించి ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుందని, ఆ కల కలగానే మిగిలిపోకుండా విజయపథాన ముందుకు వెళ్లడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చంద్రబాబు చెప్పారు. పేదపిల్లలయినా వినూత్న ఆలోచనలున్నాయని గుర్తు చేశారు.  45,571 మంది విద్యార్ధులను వ్యవసాయ కోర్సులకు ఎంపికచేశామని తెలిపారు. మెడికల్ ఎంట్రెన్స్ కు 36 వేల 50 మంది మన విద్యార్ధులు అర్హత సాధించారని,  దేశంలో అన్ని పోటీ పరీక్షల్లో మన విద్యార్ధులే ముందున్నారని ఇది తమకెంతో గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

2020 నాటికి దేశంలో ఏపీ టాప్

ప్రజలంతా సహకరిస్తే 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్-1 గా తీర్చిదిద్దుతానని, తన తపన, ఆశయం, లక్ష్యం అదేనన్నారు.  పల్లెటూరులా ఉండే సింగపూర్ సంపదలో, తలసరిఆదాయంలో నేడు ప్రపంచానికే స్ఫూర్తినిస్తోందని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ నేడు అగ్రస్థానంలో ఉందన్నారు.ఎడారి లాంటి దుబాయ్ స్వర్గంగా మారిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయో తాను బేరీజు వేసుకుని ఆచరణలో పెడతానని ఆయన వివరించారు.

విద్యకు సమాజాన్ని మార్చే శక్తి ఉంది

మంత్రి గంటా శ్రీనివాసరావు

మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ  విద్యార్ధులుకు విలువైన, ప్రమాణాలతో కూడిన విద్య అందించాలననది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు.  ప్రతిభ కనపరిచిన 6,500 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలిస్తున్నామని, రాష్ట్రాన్ని విద్యా, వైజ్ఞానిక కేంద్రంగా మార్చాలి అనే ఉద్దేశంతో దేశానికి విద్యార్ధులే సంపదగా భావించిన స్ఫూర్తిదాత అబ్దుల్ కలాం జయంతి నాడు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. సమాజాన్ని మార్చేశక్తి విద్యకే ఉందని, అలాంటి విద్యను అందించడంలో లోటు రానివ్వకూడదని భావిస్తున్నామన్నారు. ఆర్ధికంగా లోటు లో వున్నా, మఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రూ.23,209 చంద్రబాబు ప్రభుత్వం విద్యశాఖకు   కోట్లు కేటాయించిందన్నారు. విద్యకు 10 %గా ఉన్న బడ్జెట్ ను 15% పెంచిందని,  దేశంలోనే మొదటి సారిగా  5,000 కోట్లతో ఏపీలో అన్ని పాఠశాలల్లో పాఠశాలల్లో ప్రాథమిక వసతులకు కేటాయంచిందని గంటా వివరించారు.  ప్రతిభా పురస్కారాల్లో భాగంగా పురస్కార గ్రహీత అయిన విద్యార్ధికి రూ. 20,000 నగదు, ప్రశంసాపత్రం,  మెడల్ , ల్యాప్ టాప్, లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చిన  సీక్రెట్ బుక్  ఇస్తున్నామని వివరించారు.

ఐఎఎస్ అయి, చంద్రబాబు దగ్గర పనిచేస్తా: పొదిలి విద్యార్ధిని షేక్ షర్మిల

ప్రతిభా పురస్కార గ్రహీతలతో వారి వారి జీవిత లక్ష్యాలను తెలుసుకుని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబ  ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో విద్యార్ధుల ఆశలు, ఆశయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో మురిసిపోయారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఓ కళాశాల నుంచి బిట్స్ పిలానీకి ఎంపికైన షేక్ షర్మిల మాటలకు ముఖ్యమంత్రి ఆద్యంతం సంతోషంగా కన్పించారు. తాను  ఐఏఎస్ అయ్యి  చంద్రబాబు నాయుడు వద్దనే పనిచేయాలని ఉందని షేక్ షర్మిల చెప్పినప్పుడు ముఖ్యమంత్రి మురిసిపోయారు.

పిల్లల భవిష్యత్తుకు  ఎక్కువ  ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు గారిలా పరిపాలకురాలిని కావాలని భావిస్తున్నట్లు చెప్పింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ తాను గతంలో వాగ్దానం చేసినట్లుగా షర్మిలకు  బిట్స్ పిలానీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆమె ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటన్నట్లు చెప్పారు. షర్మిల చెప్పినట్లు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతోనే పిల్లలకు భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్నారు.

రైతుకుటుంబం నుంచి వచ్చా,  20 వేల నగదు పురస్కారం మాకెంతో గొప్ప:

వై. దయానంద్, జడ్పీ స్కూలు, చిత్తూరు జిల్లా

తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రూ. 20,000 ప్రతిభా పారితోషికంతనకు ఎంతో పెద్ద మొత్తమన్నాడు. మా అమ్మానాన్నలు ఈ డబ్బు కష్టపడి సంపాదించాలంటే నెలరోజులు పడుతుందని చెప్పాడు.  కృష్ణా జిల్లా నందివాడ జడ్పీ పాఠశాల విద్యార్ధిని మాట్లాడుతూ అనేక మందికి జిల్లాపరిషత్ పాఠశాలలంటే చాలా చిన్నచూపు ఉంటుందని అన్నది.  విద్యార్ధినులకు సైకిళ్ల పంపిణీ, డిజిటల్ క్లాసెస్ లాంటి వినూత్న విధానాలు, పథకాలు ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబును  ప్రశంసలు కురిపించింది. తనలాంటి పేద విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయన్నది. దీనివల్ల తమకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయన్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఐఏఎస్ చేస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ బాలిక చెప్పింది. అందుకు ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు. సమాజానికి  సేవచేయడానికే ఐఏఎస్ కావాలని  ఉందని ఆ విద్యార్ధిని  చెప్పడం తనకెంతో నచ్చిందని ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు.

వద్దని వదిలించుకునే ఆడపిల్లలను దత్తత తీసుకుని చదివిస్తా:

గుడ్లవల్లేరు విద్యార్ధిని సాయి ఆత్మిక

గుడ్లవల్లేరు పాఠశాల విద్యార్ధిని సాయి ఆత్మిక మాట్లాడుతూ తల్లి దండ్రులు వద్దనుకుంటున్న ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతానన్నారు. ఇంకా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారా అని సీఎం ప్రశ్నించారు.  అబ్బాయిలకంటే అమ్మాయిలే మంచి నిర్ణయాలు తీసుకుంటారని తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలని సాయి ఆత్మికకు ముఖ్యమంత్రి సూచించారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు 33% ఉద్యోగాల్లో , కాలేజీ సీట్లలో 33% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాం. ఇవాళ అన్ని కాలేజీల్లో ఆడపిల్లలే ఉన్నారు. కొన్ని రోజులు పోతే మగపిల్లలే ఎదురు కట్నమిచ్చి ఆడపిల్లల్ని పెళ్లిచేసుకుంటారని చమత్కరించారు.

గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ నుంచి వచ్చిన విద్యార్ధిని ఎల్ రమ్యశ్రీ మాట్లాడుతూ తాను ఒక ఆటోడ్రైవర్ కుమార్తెనని  తెలిపింది.  శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఆనందాచారి మాట్లాడుతూ మంచి ఎవరు చేసినా ప్రోత్సహించాలన్నారు. అదే తమ సిద్ధాంతమని చెబుతూ సీఎంను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రుల తరపున పద్మావతీదేవి అనే మహిళ మాట్లాడారు.  కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పురస్కార గ్రహీతల విద్యార్ధులు పాల్గొన్నారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply