మళ్లీ అధికారం మాదే.. మేకిన్ ఆంధ్రప్రదేశ్!

1 0
Read Time:6 Minute, 42 Second
  • మీ పెట్టుబడులకు నాదీ భరోసా…
  • ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉంటుంది..
  • దుబాయి రోడ్‌షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని, కాబట్టి పెట్టుబడిదారులు ఆ విషయమై ఎలాంటి సందేహాలకూ లోను కావలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే విజయం సాధించి తిరగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్భయంగా, నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టాలని అబుదాబిలో ఇన్వెస్టర్లకు విన్నవించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో గత మూడు రోజులుగా పర్యటించిన ముఖ్యమంత్రి… చివరిరోజైన సోమవారం అబుదాబీలో జరిగిన ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఐబిపిజి (IBPG), ఐసిఏఐ (ICAI)లతో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘నన్ను కొంతమంది అడిగారు. మేము పెట్టుబడులు పెట్టాక రాజకీయ సమీకరణాలు మారితే మా పరిస్థితి ఏమిటి? అని.. నేనొకటే చెప్తున్నాను. మీకా భయం అక్కర్లేదు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి ఉత్పన్నం కాదు. మేం దీర్ఘకాల వ్యూహాలతో పని చేస్తున్నాం. ఎనభై శాతం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పాలన అందిస్తున్నాం. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం, అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తాం’ అని ముఖ్యమంత్రి ధీమాగా చెప్పారు.

గత సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షంపై 1.6 % మెజారిటీతో గెలిచామని, అయితే..ఇటీవల నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 16% ఓట్ల ఆధిక్యం లభించిందని, 57 % ఓట్ షేర్ సాధించామని సిఎం పెట్టుబడిదారులకు వివరించారు. ఈ ఓటు శాతాన్ని 80%కు తీసుకెళ్తామని చెప్పారు. ప్రజల్లో 80% సంతృప్తి తీసుకొస్తున్నామని, రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదని పునరుద్ఘాటించారు. ఇన్వెస్టర్లు నమ్మకంతో రావాలని, సుస్థిర ప్రభుత్వం ఉంటుందని, మళ్లీ తాము అధికారంలోకి రావటం తధ్యమని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

‘మీ పెట్టుబడులకు నాదీ భరోసా’ అని సభికుల కరతాళ ధ్వనుల మధ్య చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల లోటుతో ప్రారంభం అయ్యామని, కేవలం 2 నెలల్లో మిగులు విద్యుత్ సాధించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో రెండవ తరం సంస్కరణలకు వెళుతూ, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ రంగంలో తాము దేశానికే ఆదర్శంగా నిలిచామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీలో అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

‘మీరందరూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుతున్నా.నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంది. అమరావతిని కేవలం పాలనా నగరంగానే కాక నాలెడ్జ్, ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే ప్రఖ్యాత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు అమరావతికి వచ్చాయి’ అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పదహారు మెడికల్ కాలేజీలు వచ్చాయని, మరే సిటీకి ఇటువంటి సదుపాయాలు లేవని పేర్కొన్నారు. పట్టణ రవాణాపై శ్రద్ద పెట్టామని, అరగంటలో ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లేలా అమరావతిలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని, అవినీతి నిరోధానికి 1500 మందితో 1100 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 డాలర్ల కంటే తక్కువకే ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తున్నామని వివరించిన సిఎం.. ప్రతి ఇల్లూ ఒక నాలెడ్జ్ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రూ 5,000 కోట్ల వ్యయం కాగల ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తన వినూత్న ఆలోచన వల్ల రూ 320 కోట్లకు తగ్గించగలిగినట్లు సీఎం చెప్పినప్పుడు సభికులు హర్షధ్వానాలతో అభినందించారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడితోనూ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే వీలుంటుందని సిఎం చెప్పారు.

‘ఇండియాకు గొప్ప భవిష్యత్తు ఉంది. ఆలోచించండి. పెట్టుబడి పెట్టే వారికి ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. డబ్బు సమస్య కాదు. మేకిన్ ఇంధ్రప్రదేశ్..మీకే సందేహాలున్నా వదిలేయండి. ఆంద్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది. ఆంద్రప్రదేశ్ మీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply