శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా మహిళలను నిరోధించడం రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరచడమేనా? సాక్షాత్తు సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నఇది. మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం విషయంలో జరుగుతున్న విచారణ దీంతో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ కేసు విషయంలో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. దేవస్థానం మహిళల ప్రవేశాన్ని నిషేధించగలదా? ఆ నిషేధం రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తుందా? ఇలాంటి సంప్రదాయం మహిళల పట్ల వివక్ష వహించడమేనా? అన్న ప్రశ్నలకు రాజ్యాంగ ధర్మాసనం పరిష్కారం సూచించవలసి ఉంది.
శుక్రవారం నాటి నిర్ణయానికి చాలా ముందుగా గత ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు… ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా? అన్న విషయంలో ఉత్తర్వులను రిజర్వులో పెట్టింది. శబరిమల ఆలయం మేనేజ్ మెంట్ బోర్డు అప్పట్లోనే తన వాదనను వినిపించింది. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఉండే మహిళల ప్రవేశాన్ని నిషేధించడానికి కారణం… రుతుస్రావం సమయంలో స్వచ్ఛతను కాపాడలేకపోవడమేనని బోర్డు సెలవిచ్చింది.
మహిళలకు అనుకూలంగా కేరళ ప్రభుత్వ నిర్ణయం
శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధం, ప్రవేశ హక్కుకోసం జరుగుతున్న పోరాటం ఈనాటివి కావు. దీనిపై 2007లోనే అప్పటి వామపక్ష ప్రభుత్వం ఒక ప్రగతిశీల వైఖరిని తీసుకుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా వామపక్ష ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే… తర్వాత వచ్చని యుడిఎఫ్ ప్రభుత్వం దాన్ని రివర్స్ చేసింది. 10-50 మధ్య వయసు మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధం పురాతన కాలంనుంచే అమల్లో ఉందన్న యుడిఎఫ్ అప్పట్లో పేర్కొంది. అందుకు అనుగుణంగానే… మహిళల ప్రవేశానికి ప్రతికూలంగా నిర్ణయం తీసుకుంది.
కేేరళలో వామపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వైఖరి మరోసారి మారింది. అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న వైఖరిని పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత నవంబర్ 7వ తేదీన సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని సవాలు చేసినవారి వాదనను కోర్టు ఆలకించింది.
తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలు, రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించడం, మహిళల వాదనకు పినరయి విజయన్ ప్రభుత్వం మద్ధతు చూస్తుంటే… పశ్చిమ కనుమల్లోని పర్వత సానువుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం మహిళలకూ దక్కే రోజు దగ్గర్లో ఉందన్న అభిప్రాయం కలుగుతోంది.